
అమానుషమైన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నవారిని మినహాయించి, శిక్షా కాలంలో సగం సమయాన్ని పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను మూడు విడతలుగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా గాంధీ జయంతికి ఈ ఏడాది అక్టోబర్ 2న కొందరిని, తిరిగి ఏప్రిల్ 10న చారిత్రక చంపారన్ ఘటన రోజున కొందరిని, అనంతరం వచ్చే ఏడాది గాంధీ జయంతికి మరికొందరు మహిళల్ని.. వారితో పాటు సీనియర్ సిటిజన్, ట్రాన్స్‌జెండర్, వికలాంగులు, అనారోగ్యం పాలైన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ::: 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలు, యువతులు, మహిళలు కేరళ, శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవడంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రార్థనాలయాలను దర్శించుకునే రాజ్యాంగ హక్కు మహిళలకు ఉందని స్పష్టం చేస్తూ, మహిళల ఆలయ ప్రవేశంపై ‘ట్రాంకోవర్ దేవస్వమ్ బోర్డు’ విధించిన ఏళ్లనాటి నిషేధం సమర్థనీయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది ::: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది అసీమ్ సాహ్నీకి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పదోన్నతి కల్పించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 31 మంది న్యాయవాదులకు అడిషనల్, డిప్యూటీ అడ్వొకేట్ జనరళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ అడ్వొకేట్ జనరల్‌గా పని చేస్తున్న అసీమ్ సాహ్నీ పేరు కూడా ఉంది!
2009 జూలైలో వివాహమైన ఒక ముస్లిం మహిళ.. పిల్లలు కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం తన భర్త తలాక్ చెప్పినప్పటి నుంచీ మామగారిని, మరిదులను పెళ్లి చేసుకోవాలని ఆ కుటుంబ సభ్యులంతా తనపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని, మామగారు పలుమార్లు తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చెయ్యడంతో యు.పి.పోలీసులు కేసు నమోదు చేశారు. 489 ఎ (వరకట్నం), 323 వేధింపులు, 328 (విష ప్రయోగం), 511 (శిక్షార్హమైన నేరాలు) సెక్షన్‌ల కింద ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేసి ఆ మహిళ భర్తను, అతడి తల్లిదండ్రులను, అతడి చెల్లెల్ని, అతడి ముగ్గురు తమ్ముళ్లను అరెస్టు చేసినట్లు క్విలా పోలీస్ స్టేషన్ అధికారి కె.కె.వర్మ తెలిపారు ::: బాల్య వివాహాల నిషేధ చట్టంలోని సెక్షన్ 3ని సవరించి బాల్యవివాహాలు చెల్లుబాటు కాని విధంగా చట్టంలో మార్పులు తేవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ.. కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదనలు పంపింది. ఈ సవరణ జరిగి, చట్టం అమల్లోకి వస్తే ఆ తర్వాత జరిగే బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉండదు ::: గత ఏడాది విడుదలైన తన ఆల్బమ్ ‘విట్‌నెస్’.. అనుకున్నంతగా ఆదరణ పొందకపోవడంతో తను అనేకసార్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నటి, టెలివిజన్ పర్సనాలిటీ కేటీ పెర్రీ వెల్లడించారు. ప్రాణం పెట్టి మరీ తను రూపొందించిన ‘విట్‌నెస్’ను మ్యూజిక్ లవర్స్ అంతే ప్రాణప్రదంగా స్వీకరించకపోవడం తన మనసును నొప్పించిందని ఆమె మనసు విప్పారు.
రష్యాలో వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ పోటీలలో ఫ్రాన్స్ విజయం సాధించినప్పుడు స్టేడియం లోపల, బయట, వీధులలో మహిళలపై జరిగిన మూకుమ్మడి వేధింపులపై రష్యా ఆరా తీస్తోంది. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తక్షణం ఆ ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపించేందుకు రష్యా ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది ::: ట్రంప్ ఇటీవల బ్రిటన్ వెళ్లినప్పుడు క్వీన్ ఎలిజబెత్ 2 తో కలిసి సైనిక వదనం స్వీకరిస్తున్న సమయంలో కొన్ని మర్యాదలను విస్మరించారని విమర్శలు వస్తుండగా, ట్రంప్ తిరిగొచ్చాక, అమెరికా ప్రభుత్వ యంత్రాంగం వైట్ హౌస్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘రాణిగారు 70 ఏళ్ల తర్వాత తొలిసారి ట్రంప్ వచ్చిన సందర్భంగానే సైనిక వందనంలో పాల్గొన్నారు’ అని పేర్కొనడం ఆయన్ని అపహాస్యంపాలు చేసింది :::
Comments
Please login to add a commentAdd a comment