స్త్రీలోక సంచారం  | Womens empowerment: Kanakadurga temple plans cottages in Amaravati capital | Sakshi
Sakshi News home page

 స్త్రీలోక సంచారం 

Published Wed, Jan 2 2019 12:14 AM | Last Updated on Wed, Jan 2 2019 12:14 AM

Womens empowerment:  Kanakadurga temple plans cottages in Amaravati capital - Sakshi

‘ఇప్పుడే వస్తాను బిడ్డను పట్టుకో’ అని చెప్పిన వెళ్లిన తల్లి మళ్లీ తిరిగి రాలేదు. బిడ్డ ఏడుస్తోంది. బిడ్డను ఎత్తుకున్న ఆ మగ మనిషికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్‌ పాలు పట్టబోయాడు. పాప తాగలేదు. దగ్గరల్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో పాపను అప్పగించి తనూ వెళ్లిపోయాడు. పాప ఏడుపు ఆపడం లేదు. డ్యూటీలో ఉన్న కాదిస్టేబుల్‌కు ఏం చేయాలో తోచలేదు. ఇంటికి ఫోన్‌ చేశాడు. ‘పాల కోసం ఏడుస్తున్నట్లుంది. ఇంటికి తీసుకురండి’ అంది ఆయన భార్య. ‘ఆ పాపను మనమే మన సొంత కూతురిలా పెంచుకుందాం’ అని కూడా చెప్పింది. అప్పటికే ఆ దంపతులకు ఒక మగబిడ్డ. ‘‘అలా చేయలేం’’ అని చెప్పాడు. వెంటనే ఆమె తన బిడ్డను చంకనేసుకుని భర్త పని చేస్తున్న పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. చంకలోని బిడ్డను భర్తకు ఇచ్చి, స్టేషన్‌లో ఉన్న బిడ్డను చంకేసుకుని తన పాలు పట్టించింది. కడుపులో పాలు పడగానే పాప ఏడుపు మానింది. పాలు పట్టిన ఆ తల్లి కూడా కాన్‌స్టేబులే! పాప తల్లి చిత్తుకాగితాలు ఏరుకునే మనిషి అని పాపను పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి వెళ్లినతను చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. పోషణలేక పాప బలహీనంగా ఉంది. ఆ పసికందుకు ఒక సురక్షితమైన ఆశ్రయం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడా కానిస్టేబుల్‌ దంపతులు. ఈ సంఘటన ఏడాది చివరి రోజు హైదరాబాద్‌లో జరిగింది. 

కేరళ ప్రభుత్వం జనవరి 1 సాయంత్రం తలపెట్టిన 630 కిలోమీటర్ల పొడవైన ‘మహిళాహారం’ (వనితామతిల్‌)  విజయవంతం అయింది. ఉత్తర కేరళలోని కాసర్‌గడ్‌ జిల్లా నుంచి దక్షిణ కేరళలోని తిరువనంతపురం వరకు జాతీయ రహదారి వెంబడి దాదాపు 20 లక్షల మంది మహిళలు చేయీచేయి కలిపి మహిళాహారాన్ని నిర్మించారు. ‘‘లైంగిక సమానత్వ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలంతా మద్దతు ఇస్తున్నట్లు ప్రముఖ నటి, యాక్టివిస్టు మాలా పార్వతి తెలిపారు. 

విజయవాడ కనకదుర్గ ఆలయంలో జనవరి 1 నుంచి వస్త్రధారణ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రధానంగా మహిళా భక్తుల కోసం ఉద్దేశించిన ఈ నిబంధన ప్రకారం దర్శనానికి, ఆర్జిత సేవలకు వచ్చేవారు చీర, లెహంగా వంటి సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించవలసి ఉంటుంది. ఆలయ పవిత్రతను, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాల కార్యనిర్వాహక అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. అయితే ఈ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉందని ‘నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌’ ఎ.పి. శాఖ కార్యదర్శి పి.దుర్గాభవాని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement