ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ‘బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ’ (వక్షోజ ఆకృతికి శస్త్ర చికిత్స) చేయించుకున్నందుకు ఆ తర్వాత తానెంతో చింతించానని బ్రెజీలియన్ సూపర్ మోడల్ జిసెల్ బంద్‌చంద్ ఒక మ్యాగజీన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 38 ఏళ్ల జిసెల్‌కు బెంజిమన్ అనే 8 ఏళ్ల కొడుకు, వివియన్ అనే 5 ఏళ్ల కూతురు ఉన్నారు. ఫుట్‌బాల్ ప్లేయర్ టామ్ బ్రాడీ ఆమె భర్త. సూపర్ మోడల్ కాబట్టి జిసెల్ ధ్యాస ఎప్పుడూ తన దేహాకృతుల మీదనే ఉండేది. అలా లేకపోతే, తన అభిమానుల ఆశల్ని, ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చేసినట్లవుతుందనే బెంగ కూడా ఆమెకు ఉండేది. అందుకే చక్కగా తినేవారు. బాగా వ్యాయామం చేసేవారు. అయితే పిల్లలు పుట్టాక ఈ ప్రయత్నాలేవీ ఆమెలో వస్తున్న శారీరక మార్పులను ఆపలేకపోయాయి. పైగా పాలు తాగే వయసులో.. కొడుకు, కూతురు కూడా ఏ కారణం చేతనో ఆమె ఎడమ స్తన్యాన్నే ఎక్కువగా ఇష్టపడేవారు. దాంతో కుడి ఎడమలు సమంగా కనిపించేందుకు.. రెండో బిడ్డ పాలు మరిచిన కొన్నాళ్లకు ఎడమ స్తన్యానికి ‘బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ’ చేయించుకున్నారు జిసెల్. ఈ విషయాన్నే ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘‘రోజూ నిద్ర లేవగానే నాకు అనిపిస్తుంది.. నేను చేసిన పనేమిటని! నాది కాని దేహంలో నేను ఉండటం ఏమిటి అని కూడా అనుకుంటాను. ఇదొక జీవిత పాఠం నాకు. నేను అలా చేసి ఉండాల్సింది కాదని బాధపడుతున్న ప్రతిసారీ నా భర్త నన్ను ఓదారుస్తాడు’’ అని తెలిపారు జిసెల్.
స్త్రీ, పురుష సమానత్వం (ఈక్వాలిటీ) అనేది పాశ్చాత్య భావనే తప్ప, అది మనది కాదని అంటూ.. మన దేశంలో పురుషుడికన్నా స్త్రీనే అధికం అని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖల మంత్రి ఉమా భారతి అన్నారు. గురువారం నాడు సుప్రీంకోర్టు 158 ఏళ్ల నాటి అడల్టరీ సెక్షన్‌ను కొట్టివేస్తూ.. వివాహేతర బంధం నేరం కాదనీ, అయితే నైతికంగా అది తప్పు అని ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఉమా భారతి.. ‘‘ప్రతిదానికీ కోర్టుల వరకు ఎందుకు వెళతారో అర్థం కాదు. సెక్షన్లు ఎలా ఉన్నా, ఏం చెబుతున్నా.. మన సమాజంలో స్త్రీ పాత్ర పురుషుడికంటే ఉన్నతమైనది.. పురుషుడికంటే స్త్రీ ఏ విధంగా చూసినా ఎక్కువే తప్ప.. పురుషుడితో సమానం కాదు’’ అని వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 21న ప్రారంభం అవుతున్న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పాపులర్ సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 6, ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆలియా భట్, దీపికా పడుకోన్ దర్శనమివ్వబోతున్నారు! ‘దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గర్ల్ పవర్’ అని ఈ తొలి ఎపిసోడ్ గురించి ట్విట్టర్‌లో కామెంట్ పెట్టిన కరణ్.. రణవీర్‌సింగ్‌తో దీపికకు, రణ్‌బీర్ కపూర్‌తో ఆలియాకు ఉన్న రిలేషన్‌షిప్‌లోని గుట్టుమట్లను ఎలాగైనా బయటికి లాగేస్తాడని.. సోషల్ మీడియాలో ఆ ‘షో’ అభిమానుల ఆకాంక్షల్ని బట్టి తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment