విదేశాలకు వెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ప్రత్యేక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ లోని టీవీలో తనకు ఇష్టం లేని చానెల్.. సి.ఎన్.ఎన్. ట్యూన్ చేసి ఉండటం, పైగా ఆ చానెల్‌ను తన సతీమణి మెలానియ వీక్షిస్తూ కనిపించడంపై ఇటీవలి పర్యటనలో వైట్ హౌస్ సిబ్బంది మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. నియమాలకు విరుద్ధంగా ‘ఫాక్స్’ చానల్‌కు బదులు సి.ఎన్.ఎన్.ను సిద్ధం చేసి ఉంచిన వారిపై విరుచుకుపడ్డారు. అయితే అమెరికా ప్రథమ మహిళకు తనకు ఇష్టమైన చానెల్‌ను చూసే హక్కు, అధికారం ఉంటాయని మెలానియ ప్రతినిధి స్టెఫానీ గ్రీషమ్ ఒక ప్రకటన విడుదల చేశారు! ::: ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తన ఫ్యాషన్ కంపెనీలన్నిటినీ మూసి వేసి, వైట్ హౌస్‌లో తన తండ్రికి పూర్తి స్థాయి సలహాదారుగా విధులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు నుంచీ ‘ఇవాంకా ట్రంప్’ బ్రాండు పేరిట ఆమె నడుపుతున్న దుస్తులు, షూలు, హ్యాండ్ బ్యాగుల విక్రయ సంస్థలపై.. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అనేక రాజకీయ విమర్శలు రావడంతో ఇవాంక ఒకొటొకటిగా తన బిజినెస్‌లు అన్నింటి నుంచీ వైదొలగుతున్నారు ::: ప్రముఖ అమెరికన్ టీవీ నెట్‌వర్క్ సి.బి.ఎస్. (కొలంబియా బ్రాడ్‌కాస్ట్ సిస్టమ్) లో నాలుగేళ్లుగా ప్రసారం అవుతున్న పొలిటికల్ డ్రామా సిరీస్ ‘మేడమ్ సెక్రటరీ’లో అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శులు హిల్లరీ క్లింటన్, మెడలీన్ ఆల్‌బ్రైట్‌లు ప్రత్యక్షం కాబోతున్నారు! అక్టోబర్ 7న మొదలవుతున్న ఐదో సీజన్ డ్రామా ప్రీమియర్‌లో.. ‘మేడమ్ సెక్రటరీ’ కల్పిత వ్యాఖ్యాత ఎలిజబెత్ మెకార్డ్ పాత్రను పోషిస్తున్న అమెరికన్ నటి ఈ డ్రామా ఎపిసోడ్‌లో భాగంగా బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌ల హయాంలో విదేశాంగ కార్యదర్శులుగా పనిచేసిన పై ఇద్దరు మహిళలు.. హిల్లరీ క్లింటన్, మెడలీన్ ఆల్‌బ్రైట్‌ల సలహాలను తీసుకుంటారు.
జూలై 25న జరిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ (లోక్‌సభ) ఎన్నికల్లో ఈసారి ఎక్కువమంది మహిళా అభ్యర్థులు పోటీ చేయడంపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పాక్ మహిళా రాజకీయ నాయకులను, భారత్‌లోని మహిళా రాజకీయ నాయకులను పోలుస్తూ వారి ఫొటోలను పక్కపక్కన పెట్టి.. ‘ఇక్కడివాళ్లు అక్కడివాళ్లంత అందంగా లేరని, అందుకే శశిథరూర్ వంటివాళ్లు ఇండియాను ‘పాకిస్తానిండియా’ అవాలని కోరుకున్నారని’ అంటూ, ఇంకా అనేక రకాల ‘సెక్సిస్టు’ కామెంట్‌లతో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ సంగతలా ఉంచితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి పార్టీ విధిగా కనీసం 5 శాతం మహిళా అభ్యర్థులను నిలపాలన్న పాక్ ఎన్నికల సంఘం ఆదేశాల కారణంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో 171 మంది మహిళా అభ్యర్థులు 272 జనరల్ సీట్లకు పోటీ చేశారు ::: జార్జియాలో సెప్టెంబర్ 23 నుంచి మొదలౌతున్న ‘ఒలింపియాడ్’కు మన చెస్ గ్రాండ్ మాస్టర్, 31 ఏళ్ల కోనేరు హంపి సిద్ధమౌతున్నారు. 11 నెలల బిడ్డ తల్లి అయిన హంపీ.. పాప ఆలన, పాలన కోసం ఆట నుంచి విరామం తీసుకున్నాక తిరిగి చెస్ బరిలోకి రావడంపై ‘స్పోర్ట్‌స్టార్’ పత్రికతో మాట్లాడుతూ, ‘పెళ్లయ్యాక కెరీర్‌లో రాణించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవన్న మాట విన్నప్పుడు నేను నమ్మలేకపోయేదాన్ని కానీ, పెళ్లి తర్వాత కెరీర్‌కి, కుటుంబానికి మధ్య ప్రాధాన్యాలు తరచు మారిపోతుంటాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’ అని చిరునవ్వుతో అన్నారు ::: స్త్రీ, పురుషులతో పాటు తమకూ ఉద్యోగాలలో ఒక కేటగిరీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేయకూడదని తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాన్స్ ఉమన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ షానవీ పొన్నుసామి ప్రశ్నిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, కేవలం ట్రాన్స్ ఉమన్ అయిన కారణంగా ‘ఎయిర్ ఇండియా’ షానవీకి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించడంతో, ఆమెకు సంఘీభావంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమన్ (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ) బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, తనకు ఇప్పటి వరకు 20 కంపెనీలు ఉద్యోగాన్ని నిరాకరించాయని షానవీ ఆవేదన చెందారు :::
స్త్రీలోక సంచారం
Published Fri, Jul 27 2018 1:02 AM | Last Updated on Fri, Jul 27 2018 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment