►తమిళనాడులోని తిరుచ్చిలో 17 మహిళా స్వయం సహాయక బృందాలలోని సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘కాలేజ్ బజార్ గ్రూపు’.. తిరుచ్చిలో తొలి విడతగా ఎంపిక చేసుకున్న 15 కళాశాలల్లోని ప్రాంగణాలలో కాలేజీ యాజమాన్యాల అనుమతితో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టాల్స్ అత్యంత ఆదరణ పొందడమే కాక.. గ్రూపు సభ్యుల స్వయం సమృద్ధికి, ఆర్థిక స్వేచ్ఛకు తోడ్పడుతున్నాయి. తిరుచ్చి జిల్లా మొత్తంలో సుమారు 10 వేలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాలు ఉండగా, ఒక్క తిరుచ్చి పట్టణంలోనే వెయ్యి వరకు చురుగ్గా పనిచేస్తున్నాయని, ఆ వెయ్యి బృందాలలోని పదిహేడు బృందాలు.. కాస్ట్యూమ్ జ్యుయలరీ, క్లాత్ బ్యాగులు, దుస్తులు, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన ఉత్పత్తులను స్వయంగా తయారు చేసుకుని వచ్చి, చవక ధరల్లో విక్రయిస్తూ ఆదరణ పొందుతున్నందున.. కొత్తగా ప్రారంభం అయిన ‘కాలేజీ బజార్ గ్రూపు’ను ఒక సంస్థగా రిజిస్టర్ చేయించిన అనంతరం, ఇలాంటివే మరికొన్ని గ్రూపుల ఏర్పాటుకు సహకారం అందించనున్నామని ‘తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్’ ప్రతినిధి ఒకరు తెలిపారు.
► తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక అకృత్యాలపై బాధితుల ఫిర్యాదును స్వీకరించి, వారికి న్యాయం జరిపించేందుకు వీలుగా ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న తమ అభ్యర్థనపై తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తిస్తోందంటూ.. ఏడుగురు సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాలీవుడ్‌లోని పెద్ద పెద్ద దర్శకులు, నటులు అవకాశాల పేరుతో తనను వాడుకుని దగా చేశారనీ, తనకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీరెడ్డి అనే యువతి ఈ ఏడాది ఏప్రిల్ 7న ఫిల్మ్ చాంబర్ ఎదుట.. సంచలనాత్మకంగా అర్ధనగ్న నిరసన చేపట్టిన అనంతరం.. తామంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అనేకమార్లు కలిసి.. ‘క్యాస్టింగ్ కౌచ్’ ఫిర్యాదులను స్వీకరించి, విచారించి, బాధితులకు న్యాయం జరిపించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అడుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో కోర్టుకు వెళ్లక తప్పలేదని ఈ ఏడుగురు పిటిషనర్‌లు తెలిపారు.
►బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్‌ల మధ్య ప్రారంభం నుంచీ కెరీర్‌లో ఉన్న ‘శత్రుత్వం’.. దీపికను ప్రతిదానికీ ప్రియాంకతో పోల్చుకునేలా ప్రేరేపిస్తోందని వదంతులు వినిపిస్తున్న క్రమంలో.. ఇటీవలి నిశ్చితార్థం తర్వాత బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌ని ఈ నవంబర్‌లో గానీ డిసెంబర్‌లో గానీ ప్రియాంక చేసుకోబోతున్న వివాహానికంటే ఘనంగా, అదే సమయానికి తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు దీపిక ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. హాలీవుడ్ చిత్రాల్లో నటించడంలో ప్రియాంక పైచేయిగా ఉండగా, బాలీవుడ్‌లో దీపికే వెలిగిపోవడం దీపికకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ అయితే.. ప్రియాంకలా దీపికకు విదేశీ బాయ్‌ఫ్రెండ్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అని కూడా ఏవేవో విశ్లేషణలు జరుగుతున్నాయి.
►డాలర్ ముందు రూపాయి విలువ పడిపోకుండా ఉండటం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం పైన సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో బంగారు ఆభరణాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువను కాపాడుకునేందుకు కనీసం 2 శాతంగానైనా బంగారంపై దిగుమతి సుంకాన్ని విధించడం ఒక్కటే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ఉత్తమమైన మార్గమని ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలరీస్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ.) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అంటున్నారు.
►భారతదేశంలో మహిళల ఆత్మహత్యల సంఖ్య అధికంగా ఉండడానికి కారణం.. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసెయ్యడమేనని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారతదేశంలో జరుగుతున్నవేనని ప్రఖ్యాత ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్‌లో వచ్చిన తాజా సర్వే నివేదిక వెల్లడించింది. చిన్న వయసులోనే తల్లి అవడం, ఆర్థికంగా ఆధారపడి ఉండటం, గృహహింస వంటివి.. మహిళల్లో మానసికంగా ఒత్తిడిని కలిగించి, వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని నివేదిక తెలిపింది.
► 44 ఏళ్ల కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారం జరిపిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుండీ కొట్టాయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 85 ఏళ్ల జోన్ జోసెఫ్ అనే జాయింట్ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, జోసెఫ్ స్టీఫెన్ అనే ఓ రైతుతో పాటు సోమవారం నుంచి బాధితురాలి చెల్లెలు కూడా దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉండగా, అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిలు కోసం బిషప్ ములక్కల్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణను కేరళ హైకోర్టు సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.
►తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్.. చెన్నైలోని ఒక ఆటో డ్రైవర్ ఇంటిని అకస్మాత్తుగా సందర్శించి, ఆ కుటుంబం క్షేమ సమాచారాలు కనుక్కొని, ఒక స్వీట్ బాక్సును ఇచ్చి.. ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని చెప్పివెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలో సోమవారం తమిళసై ఏర్పాటు చేసిన సభలో ఆ ఆటో డ్రైవర్.. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండటంపై అసహనంతో ఆమెను ప్రశ్నిస్తూ ఉండగానే.. పార్టీ కార్యకర్తలో కొందరు అతడిని తోసుకుంటూ అక్కడి నుంచి తీసుకెళుతున్న వీడియో వైరల్ కావడంతో.. నష్ట నివారణ చర్యలో భాగంగా తమిళసై అతడి ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.
► బ్రిటన్ రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాక ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ తొలిసారి ఒక కొత్త ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. గత ఏడాది లండన్‌లోని ‘గ్రెన్‌ఫెల్ టవర్’ ఫైర్‌లో 70 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు విరాళాలను సేకరించడం కోసం ఆయా కుటుంబాలు సంప్రదాయికంగా వండే 50 రకాల వంటకాలను చేయించి, వాటిల్లో కొన్ని స్వయంగా తను చేసి, వాటన్నిటితో ‘టుగెదర్ : అవర్ కమ్యూనిటీ కుక్ బుక్’ అనే ఓ చక్కటి వంటల పుస్తకాన్ని వేయించి, దానికి ముందుమాట కూడా తనే రాసి, పుస్తకావిష్కరణ జరిపించారు మేఘన్ మార్కెల్.
స్త్రీలోక సంచారం
Published Wed, Sep 19 2018 12:34 AM | Last Updated on Wed, Sep 19 2018 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment