తమిళసినిమా: మహిళలకు ధైర్యం అవసరం అంటోంది నటి ఆండ్రియా. తనకు నచ్చిన విధంగా జీవించే అతి కొద్ది మంది నటీమణుల్లో ఈ జాణ ఒకరని చెప్పకతప్పదు. విమర్శలను, వివాదాలను అసలు పట్టించుకోని నటి ఆండ్రియా. తొలుత గాయనిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నటిగా తెరపైకి వచ్చింది. అలా పచ్చైక్కిళి ముత్తుచ్చారం, ఆయిరత్తిల్ ఒరువన్, విశ్వరూపం, తరమణి చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించి తనకంటూ సొంత ఇమేజ్‌ను సంపాదించుకున్న ఆండ్రియా తాజాగా కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు చూద్దాం.
విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగానే విశ్వరూపం–2 ఉంటుంది. ఇందులో అశ్విత పాత్రలో నటించాను. తొలి భాగంలో కంటే రెండో భాగంలోనే అశ్విత ఎవరన్నది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను. ఇంతకు ముందు కాలక్షేపం కోసమే చిత్రాల్లో నటించాను. అయితే విశ్వరూపం చిత్రంలో నటించిన తరువాత సామాజిక బాధ్యత ఎక్కువైంది. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరికి బాధ్యత అవసరం. ఎవరి పని వారు చేయడం కాదు. అదే విధంగా పాఠ్యాంశాల్లో విద్యను అభ్యసించడంతదో సరిపోదు. దేశపోకడలను తెలుసుకోవాలి. నటన విషయంలో నిబంధనలు విధిస్తున్నారా అని అడుగుతున్నారు. చిత్రాల్లో నటించడానికి ఎలాంటి నిబంధనలు విధించను. అయితే కథ నాకు నచ్చాలి. అదే ముఖ్యం. విశ్వరూపం–2 చిత్రం తరువాత వడచెన్నై చిత్రంలో నటించాను.
ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆరు నెలలు ఖాళీగానే ఉన్నాను. ప్రస్తుతం వడచెన్నై డబ్బింగ్ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కథా చిత్రాల్లో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. అలా నటించడం వల్ల నా స్థాయి తగ్గుతుందని భావించడం లేదు. నా కథా పాత్ర ఏమిటి? దర్శకుడు ఎవరు? అన్న అంశాలపైనే దృష్టి పెడతాను. నేను నటనతో పాటు గాయనీగానూ కొనసాగుతున్నాను. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే. ఎందులో అవకాశం వస్తే అది చేస్తాను. ఇటీవల సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు. ఆమె చెప్పేది నిజం అయితే వాటిని బహిరంగ పరచానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయట పెట్టడం కరెక్ట్. అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే ప్యూచర్ ప్లాన్ ఏమిటీ అని అడుగుతున్నారు. నేను మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తానో తెలియదు. అలాంటిది ఫ్యూచర్ ప్లాన్ గురించి అడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment