ప్రియా భవానీశంకర్
తమిళసినిమా: కోలీవుడ్‌లో హీరోయిన్లకు రక్షణ లేదన్నది ఇటీవల ఎక్కవగా వినిపిస్తున్న మాట. అయితే నటి శ్రుతిహాసన్ లాంటి కొందరు మాత్రం ఇక్కడ హీరోయిన్లకు భద్రత ఉందని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. అయితే ఆ మధ్య సుశీలీక్స్ పేరుతో గాయని సుచిత్ర కోలీవుడ్‌లోని పలువురికి దడ పుట్టించిన పరిస్థితులను మరచి పోకముందే నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌తో, కోలీవుడ్‌లోని కొందరు దర్శకులు, నటులను ఠారెత్తిస్తోంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో సహా పలువురు హీరోయిన్లకు అత్యాచార వేధింపులు ఎదురవుతున్న మాట నిజమేనని కుండబద్ధలు కొట్టినట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తాజా వర్ధమాన నటి ప్రియా భవానీ శంకర్ కూడా అత్యాచార వేధింపులు వాస్తవమేనంటోంది.
మెయ్యాద మానే చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బుల్లితెర నటి ఇప్పుడు వెండి తెరపై హీరోయిన్‌గా బిజీ అవుతోంది. ఇటీవల కార్తీకి జంటగా కడైకుట్టి సింగం చిత్రంలోనూ నటించింది. కాగా శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ నటి శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ సినిమా రంగంలో హీరోయిన్లకు అత్యాచారం వేధింపులు అన్నది కొట్టిపారవేయలేమని అంది. అయితే ఇలాంటి వేధింపులు ఇతర రంగాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొంది. మహిళలు సెక్స్ వేధింపులకు గురవుతున్నారని, అయితే అలాంటి వాటిని అంగీకరించడం, నిరాకరించడం అనేది మన చేతుల్లోనే ఉందని అంది. అయితే నటి శ్రీరెడ్డి అత్యాచార వేధింపులను ఎదుర్కొన్నానని బహిరంగంగా చెప్పడం సరి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తప్పు చేసి దాన్ని బయటకు చెప్పుకోవడం ఎంత వరకు సబబు అని ప్రియా భవానీశంకర్ అంటోంది. సెక్స్ వేధింపుల భారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని అంది. తాను మాత్రం కుటుంబ కథా చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నానని ఈ అమ్మడు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment