
ఇక్కడ ఎవరు మాత్రం అత్యాచార వేధింపులకు గురికావడం లేదూ? అంటూ ప్రశ్నించింది నటి అనుపమా పరమేశ్వరన్. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంతో పరిచయమైన ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఒకరైన ఈ బ్యూటీ ఆ చిత్రం తెచ్చి పెట్టిన పేరుతో ఇప్పుడు దక్షిణాది భాషల్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా తెలుగు, మలయాళంలో బాగానే పాపులర్ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో మెరిసింది.
అప్పుడెప్పుడో గాయని సుచిత్ర చిత్ర పరిశ్రమలో సెక్స్ రాకెట్‌ను బయట పెట్టి కలకలం సృష్టించింది. అయితే కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మాత్రం ముందు బాలీవుడ్‌లో బయటపడింది. ఆ తరువాత దక్షిణాదిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మధ్య నటి శ్రీరెడ్డి అవకాశాల పేరుతో లైంగికంగా వాడుకున్నారంటూ రోడ్డెక్కి కలకలం సృష్టించింది. అయితే అంతకు ముందే నటి రాధికా ఆప్తే, వరలక్ష్మీ శరత్‌కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి కొందరు సినీరంగంలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు.
తాజాగా నటి అనుపమ పరమేశ్వరన్ లైంగిక వేధింపులు నిజమేనని పేర్కొంది. దీని గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ సినీరంగంలో హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురవుతున్న మాట వాస్తవమేన న్నది తాను ఖండించలేనంది. ఇక్కడ ఎవరు మాత్రం లైంగిక వేధింపులకు గురి కావడం లేదు? అంటూ ప్రశ్నించింది. అయితే అలాంటి సంఘటన ఇంత వరకూ తనకు ఎదురవలేదని పేర్కొంది. ఈ రంగంలో ఏదో సాధించాలన్న ఆశతో కొత్తగా వచ్చే తారలు ఎక్కువగా అత్యాచార వేధింపులకు గురవుతున్నారని అంది.
అయితే అలాంటి వేధింపులను ఎదిరించనంత వరకూ యథేచ్ఛగా జరుగుతూనే ఉంటాయన్నది తన భావన అని అంది. తన చుట్టూ మంచి వారే ఉన్నవారని చెప్పింది. అలాంటి వారు ఉన్నంత వరకూ తనకెలాంటి సమస్య రాదనే ధీమాను వ్యక్తం చేసింది. మరో విషయం ఏమిటంటే అందం అనేది మోడ్రన్‌గా ఉండడంలోనో, లంగా ఓణి ధరించడంలోనో ఉండదని, ప్రతిభావంతమైన నటనను ప్రదర్శంచడంలోనే ఉంటుందని ఆ అమ్మడు చెప్పింది.