స్త్రీలోక సంచారం | Womens empowerment: Athletics Federation of India | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Thu, Aug 23 2018 12:14 AM | Last Updated on Thu, Aug 23 2018 12:14 AM

Womens empowerment:  Athletics Federation of India - Sakshi

ఇండోనేషియాలోని జకార్తాలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌కి అర్హత పొందినప్పటికీ ‘అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎ.ఎఫ్‌.ఐ.) తనను ఎంపిక చెయ్యకపోవడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఉత్తరప్రదేశ్‌ మిడిల్‌–డిస్టెన్స్‌ రన్నర్‌ మోనికా చౌదరికి ఊరట లభించింది. ఏషియన్‌ గేమ్స్‌లో అర్హత కోసం గువాహతిలో జరిగిన ఇంటర్‌స్టేట్‌ మీట్‌లో రజత పతకాన్ని పొందినప్పటికీ మీట్‌ మధ్యలో జ్వరపడి తేరుకున్న కారణంగా తనను ఏషియాడ్‌కు పంపే క్రీడాకారుల జాబితా నుంచి తొలగించడంతో ఆవేదన చెందిన మోనికా.. కోర్టు తనకు ట్రయల్‌గా మళ్లీ ఒక పోటీ పెట్టి తన సామర్థ్యం నిరూపించుకోడానికి బుధవారం నాడు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఒక అవకాశం ఇవ్వాలని ఎ.ఎఫ్‌.ఐ.కి సూచించడంతో భూటన్‌లో తనిప్పుడున్న నేషనల్‌ క్యాంప్‌ నుంచి హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు.

పాప్‌ కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ కూతురు, ఇరవై ఏళ్ల మోడల్, నటì .. పారిస్‌ జాక్సన్‌.. ‘హార్పర్‌ బజార్‌’ పత్రిక (సింగపూర్‌ ఎడిషన్‌) సెప్టెంబర్‌ సంచిక ముఖచిత్రంగా ప్రత్యక్షమవడంపై ఆ దేశంలోని ఎల్‌.జి.బి.టి. హక్కుల ఉద్యమకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమెనొక ‘కపటి’గా అభివర్ణించడంతో పారిస్‌ జాక్సన్‌ క్షమాపణలు చెప్పి, ఇన్‌స్టాగ్రామ్‌లో తను పెట్టిన ఆ ముఖచిత్రం ఫొటోలను తొలగించారు. ‘బైసెక్సువల్‌’ (స్త్రీ,పురుషులిద్దరి ఆకర్షణకూ లోనయ్యే వ్యక్తి) అయిన పారిస్‌ హిల్టన్‌.. గే హక్కుల ఉద్యమకారిణి అయి ఉండి కూడా, సేమ్‌ సెక్స్‌ ‘భావ’బంధాలను నేరంగా పరిగణించే సింగపూర్‌ దేశం నుండి వెలువడిన హార్పర్‌ బజార్‌ పత్రికకు మోడలింగ్‌ చెయ్యడంపై విమర్శలు రావడంతో.. తను మరీ అంత లోతుగా అంతగా ఆలోచించలేదని, ఫ్యాషన్‌పై తనకున్న ఇష్టంతోనే కవర్‌ పేజీ మోడలింగ్‌కి అంగీకరించానని వివరణ కూడా ఇచ్చారు. 

76 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఆగస్టు 16న కన్నుమూసిన ప్రముఖ అమెరికన్‌ సింగర్, పియానిస్టు అరెథా ఫ్రాంక్లిన్‌ నివాళి సందర్భంగా ఎం.టి.వి. వీడియో మ్యూజిక్‌ అవార్డు ఫంక్షన్‌లో మాట్లాడుతూ పాప్‌ స్టార్‌ మడోన్నా.. ఆ పెద్దావిడకన్నా కూడా తన గురించే ఎక్కువగా చెప్పుకున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై మడోన్నా స్పందిస్తూ, ‘‘నిజానికది అరెథా నివాళి కార్యక్రమం కాదని, ‘వీడియో ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డ్‌ ప్రకటించే వేడుకలో నిర్వాహకులు తనను అరెథాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకోమని అడగడంతో తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి రెండు నిముషాల్లో ముగించలేకపోయానని’’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. 

కేరళ వరద బాధితులను టీవీలో చూసి చలించిన 12 ఏళ్ల తమిళనాడు బాలిక అక్షయ.. రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యే తన హార్ట్‌ సర్జరీ కోసం సోషల్‌ మీడియా ద్వారా ఇప్పటి వరకు సేకరించిన 20 వేల రూపాయలలోంచి ఐదు వేల రూపాయలను కేరళకు విరాళంగా అందజేసింది! కరూర్‌ జిల్లా కుమారపాళ్యంలో తల్లితో పాటు ఉంటున్న అక్షయ.. ఆరేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోగా, ఆమె తల్లి జ్యోతిమణి.. కూతురి గుండె జబ్బుకు వేరే ఆర్థిక ఆసరా లేక.. నవంబరులో జరగవలసిన ఆమె సర్జరీ కోసం తెలిసినవాళ్ల ద్వారా అనేక మార్గాల్లో దాతల్ని ఆశ్రయిస్తోంది. 

ఉత్తరకాశిలో గతవారం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య జరిగిన ఘటనపై స్వచ్ఛందంగా స్పందించిన ఉత్తరాఖండ్‌ హైకోర్టు.. బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న నేరాలను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాగల 48 గంటల్లో శాశ్వత ప్రాతిపదికపై ‘స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌’ (సిట్‌) లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అలాగే ఉత్తరకాశి మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య కేసు విచారణను ప్రభుత్వం తక్షణం ‘సిట్‌’కు అప్పగించాలని, ‘సిట్‌’ నాలుగు వారాల్లోపు ఈ కేసులో చార్జిషీటును దాఖలు చేయాలని ఆదేశించింది.

బిహార్‌. భోజ్‌పూర్‌ జిల్లాలో బిమలేశ్‌ అనే 16 ఏళ్ల దామోదర్‌పూర్‌ గ్రామ విద్యార్థి, పన్నెండవ తరగతిలో చేరేందుకు దగ్గర్లోని బిహియా గ్రామానికి వెళ్లి, అక్కడి రెడ్‌ లైట్‌ ఏరియాలో.. మర్మావయవాల దగ్గర తీవ్ర గాయాలతో నిర్జీవంగా పడి ఉన్న ఘటనలో అక్కడి ఒక మహిళను అనుమానించి, ఆమెను నగ్నంగా ఊరేగించిన మూక ఘటనలో ఆర్‌.జె.డి. (రాష్ట్రీయ జనతా దళ్‌) కార్యకర్త సహా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళను వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతున్నప్పుడు సమయానికి వెళ్లి నిరోధించలేకపోయిన ఆరుగురు పోలీసులు కూడా సస్పెండ్‌ అయ్యారు. 

ఆఖరి నిముషంలో ప్రాజెక్టు నుండి తప్పుకున్నందుకు ప్రియాంకా చోప్రాపై ‘భారత్‌’ సినిమా డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఆగ్రహంతో ఉన్నారని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు అలీ నోరు విప్పారు. ‘‘ఆమె నా స్నేహితురాలు. తనపై నాకేం కోపం లేదు. ఆమె చేసిన పనికి బాధా లేదు. ‘భారత్‌’ సినిమా నుంచి చివరి నిముషంలో ప్రియాంక తప్పుకోవడం వల్ల టీమ్‌ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ, తను తప్పుకోడానికి ప్రియాంక చెప్పిన కారణాలన్నీ సబబుగానే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. 

ముఖేష్‌ ఛబ్రా డైరెక్ట్‌ చేస్తున్న రొమాంటిక్‌ ‘ట్రాజీకామెడీ’ ఫిల్మ్‌.. ‘కీజీ అవుర్‌ మ్యానీ’ షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిపోడానికి హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పు™Œ .. ఆ సినిమా హీరోయిన్‌ (ఫీల్డులోకి కొత్తగా వచ్చిన అమ్మాయి) అయిన సంజనా సంఘీతో మితిమీరిన చనువు ప్రదర్శించడమే కారణం అని తెలుస్తోంది. గత నెలలో జంషెడ్‌పూర్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సుశాంత్‌ ‘ఎక్స్‌ట్రా–ఫ్రెండ్లీ’ ప్రవర్తనకు అసౌకర్యానికి గురయిన సంజనా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారని, వెంటనే వారు ‘నీకు ఇష్టమైతేనే చెయ్యి’ అనడంతో.. అప్పట్నుంచీ ఆమె షూటింగ్‌కి అందుబాటులో లేరని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement