
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ మూవీతో బిజీగా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తి కావడంతో ప్యాకప్ చెప్పేశారు. దీంతో చిత్రబృందంతో పాటు ప్రియాంక చోప్రా ముంబయికి ప్రయాణమైంది.
అయితే తాజాగా ఇవాళ షూటింగ్ లోకేషన్ నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా దారిలో ప్రకృతి అందాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అందులో ప్రియాంక చోప్రా ఓ వీడియోను కూడా పంచుకుంది. ఓ మహిళను చూసి తాను ఇన్‌స్పైర్ అయ్యానని తెలిపింది. ఆమె తనలో స్ఫూర్తి నింపిందని కొనియాడింది. అందుకే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవాలనిపించిందని తెలిపింది.
(ఇది చదవండి: SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్)
వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను ఇలా తరచుగా చేయను. కానీ ఈరోజు ఎందుకో నాకు చాలా స్ఫూర్తినిచ్చే సంఘటన ఎదురైంది. నేను ముంబయికి వెళ్లేక్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తున్నా. వైజాగ్ ట్రాఫిక్‌లో ఓ మహిళ జామపండ్లు అమ్ముతుండటం చూశాను. నాకు కచ్చా (పచ్చి) జామపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెంటనే ఆమెను ఆపి మీ జామపండ్లన్నింటికీ ఖరీదు ఎంత? అని అడిగాను. ఆమె 150 రూపాయలు అని చెప్పింది. నేను తనకు 200 రూపాయల నోటు ఇచ్చా. కానీ ఆమె నాకు చిల్లర ఇవ్వడానికి ప్రయత్నించింది. వద్దు.. దయచేసి మీరే ఉంచుకోండి అని తనతో అన్నా. ఎందుకంటే జీవనోపాధి కోసం ఆమె జామపండ్లు అమ్మింది. కానీ ట్రాఫిక్‌లో గ్రీన్ సిగ్నల్ పడేలోపే ఆమె తిరిగి వచ్చి నాకు మరో రెండు జామపండ్లు ఇచ్చింది. అంటే ఆ మహిళ నా నుంచి ఎలాంటి దాతృత్వాన్ని కోరుకోలేదు. ఆమె తీరు నిజంగా నన్ను కదిలించింది' అని పంచుకుంది.
ఈ వీడియోతో పాటు ఎస్ఎస్ఎంబీ29 సెట్‌లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇది 2019 లో విడుదలైంది. ఇటీవల సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు మూవీలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment