
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ ప్రియాంక నటిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి అందాల సుందరి కిరీటం అందుకున్నవారిలో ప్రియాంక చోప్రా స్థాయిలో తారా పధానికి చేరుకున్నవారు లేరనే చెప్పాలి. ఇంతింతై ఎదిగిన ఆమె విజయాల వెనుక ఆమె కష్టం ఎంత ఉందో...ఆమె తల్లి మధు చోప్రా కష్టం కూడా అంతే ఉందని అంటుంటారు బాలీవుడ్ జనాలు.
సినిమా రంగంలో ప్రియాంక అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆమెని అనుక్షణం కంటికి రెప్పలా కాచుకున్నారు ఆమె తల్లి మధుచోప్రా. అందంతో పాటు ప్రతిభ కూడా ఉన్న తన కూతురు టాప్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు. మధ్యలో కొందరి వల్ల ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైనప్పుడు కూడా కూతురికి అండా దండా తానై ప్రియాంక కృంగిపోకుండా వెన్నంటి ఉన్నారు. సినీ హీరోయిన్లను వారి తల్లులు నీడలా అనుసరించడం కొత్త విషయం కాకపోయినా... ప్రియాంక తల్లి మధుచోప్రా.. అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించారు. తన కష్టం ఫలించి అంతర్జాతీయ స్థాయిలో తన కూతురు పేరు తెచ్చుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవడంతో మధు చోప్రా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.
ఈ నేపధ్యంలో ఇటీవల పలు ఇంటర్వ్యూల సందర్భంగా ప్రియాంక సినిమా కెరీర్ గురించి మధుచోప్రా పంచుకున్నారు. అదే సమయంలో దోస్తానీ (ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం) దర్శకుడు తరుణ్ మన్షుఖానీ అప్పట్లో ఎలా ప్రవర్శించారో కూడా గుర్తు చేసుకున్నారు. దోస్తానా చిత్రంలో ప్రియాంక తరుణ్‌తో కలిసి పనిచేసినప్పుడు కొన్ని కారణాల వల్ల వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని మధు చోప్రా చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఒక రోజు ప్రియాంక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిందని, జ్వరంతో వణికిపోయిందని గుర్తుచేసుకున్నారు.
తాను ఆమెకు మందులు ఇచ్చానని, అయితే మాత్రలు వేసుకున్న తర్వాత సినిమా షూటింగ్‌కు వెళదామని ప్రియాంక ప్రయత్నించగా తాను వారించానని చెప్పారు. కాస్త సమయం తీసుకో అని చెప్పానని, గంట తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో ప్రియాంక సూచనల మేరకు తాను దర్శకుడు తరుణ్‌కి ఫోన్ చేశానని వెల్లడించారు. తరుణ్‌కి ఫోన్ చేసి ప్రియాంకకు హై టెంపరేచర్ ఉన్నందున ఆ రోజు షూటింగ్‌కు రావడం కుదరదని చెప్పగా, ‘‘ మీ అమ్మాయి ఎంత సౌకర్యంగా ఉందో చెప్పండి’’ అని తరుణ్ వ్యంగ్యంగా బదులిచ్చాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు తనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చిందని దాంతో తాను అతనికి చాలా పరుషంగా మాట్లాడానని వెల్లడించారు. ‘‘ఆమె మీ షూటింగ్ సెట్‌లో చనిపోవాలని మీరు కోరుకుంటే, సరే... నేను ఆమెను పంపుతాను. కానీ ఆమెకు ఏదైనా జరిగితే, దానికి మీరే బాధ్యులవుతారు’’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించానన్నారు. ఇదంతా గుర్తు చేసుకున్న మధుచోప్రా... అయితే అదంతా గతమని తరుణ్, తాను ఇప్పుడు మంచి స్నేహితులమని, ఇప్పటికీ తాను తరుణ్‌ని కలిసినప్పుడల్లా అప్పటి నా కోపాన్ని గుర్తు చేస్తూ తనను ఆటపట్టిస్తుంటాడంటూ మధుచోప్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment