
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే అంతకుముందే తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి అభిమానులకు షాకిచ్చింది ముద్దుగుమ్మ.
ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ.. గతేడాది చివరిసారిగా ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా అనే మూవీలో కనిపించింది. ఈ చిత్రాన్ని గతంలో విడుదలైన హసీన్ దిల్‌రుబాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. అంతకుముందు షారూఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రంలోనూ కనిపించింది. ప్రస్తుతం గాంధారీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా హీరోయిన్ తాప్సీ తన మంచి మనసును చాటుకుంది. సినిమాలే కాదు సమాజ సేవలోనూ ముందుంటానని చెబుతోంది. వేసవికాలం కావడంతో ఎంతోమంది పేదలకు అండగా నిలిచింది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేసింది. తన భర్త మథియోస్ బోతో కలిసి వారి ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందించింది. దీంతో తాప్సీ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు తాప్సీ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే తన బయోలో లింక్ కూడా ఉందని ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్ తాప్సీ.