coolers
-
ముందుంది ఎండలు మండే కాలం! కిటికీలకు ఈ ఫిల్మ్‌లు అతికిస్తే! కూల్‌కూల్!
విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు ఇళ్లలోకి అతినీలలోహిత కిరణాలు చొరబడకుండా కాపాడే విండో ఫిల్మ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కాంతిని నిరోధించకుండానే గదిని చల్లబరచగ లగటం దీని ప్రత్యేకత. ‘పారదర్శక రేడియేటివ్ కూలర్లు’గా పిలిచే ఈ ఫిల్మ్‌ను కిటికీలకు వినియోగిస్తే.. ఒక్క వాట్ విద్యుత్ కూడా వాడక్కర్లేకుండా భవనాల లోపలి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ ఫిల్మ్‌లు మన దేశీయ మార్కెట్లోనూ లభ్యమవుతున్నాయి. సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన విధానంలో అనేక మార్పులొస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే సరికొత్త వ్యాపారాలూ పుట్టుకొస్తున్నాయి. కిటికీ అద్దాలకు విండో ఫిల్మ్‌ను అతికిస్తే ఇల్లు మొత్తం కూల్‌గా మారిపోయే విండో ఫిల్మ్ మార్కెట్లోకి వచ్చేసింది. విద్యుత్ బిల్లులను తగ్గించడంతోపాటు ఆల్ట్రా వయొలెట్ (అతినీలలోహిత) కిరణాల నుంచి రక్షణ కల్పించేలా దీనిని అభివృద్ధి చేశారు. ట్రాన్స్పరెంట్ రేడియేటివ్ కూలర్లుగా పిలుస్తున్న ఈ ఫిల్మ్‌లను వినియోగించటం వల్ల ఏసీలు, కూలర్లతో పని లేకుండా గదులన్నీ కూల్ అయిపోతాయి. ప్రపంచంలో దాదాపు 15 శాతం విద్యుత్‌ను కేవలం గదుల శీతలీకరణకే వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికత వల్ల ఒక్క యూనిట్ విద్యుత్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా భవనాల లోపల ఉష్ణోగ్రతను తగ్గించగలదు. అమెరికన్ కెమికల్ సొసైటీ ఎనర్జీ లెటర్స్ నివేదిక ప్రకారం.. భవనాలు, వాహనాల్లో చల్లదనం కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ‘ట్రాన్సపరెంట్ రేడియేటివ్ కూలర్లు’ విండో మెటీరియల్‌గా ఉపయోగపడతాయి. ఇవి వాతావరణ మార్పులను పరిష్కరించడంలోనూ తోడ్పడతాయి. ప్రయోజనాలెన్నో..! విండో ఫిల్మ్ అనేది ఒక సన్నని పదార్థం. దీనిని పాలిస్టర్ పొరలతో తయారు చేస్తారు. ప్రతిబింబం కనిపించేలా పూత పూస్తారు. ఇలా తయారైన విండో ఫిల్మ్‌ను కిటికీలకు అమర్చడం వల్ల సూర్యరశ్మిని గదిలోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. సూర్య కిరణాల్లో ఉండే హానికరమైన అతినీలలోహిత (ఆల్ట్రా వయొలెట్) కిరణాలను ఈ ఫిల్మ్ 97 శాతం అడ్డుకుంటుంది. సాధారణ గ్లాస్ కిటికీలకు కూడా ఈ ఫిల్మ్ వేస్తే బ్రాండెడ్ కిటికీల్లా మారతాయి. భవనంలోకి ప్రవేశించే సౌరశక్తిలో 80 శాతం వరకూ నిరోధించడానికి ఈ ఫిల్మ్‌లను రూపొందించారు. ఇవి సాధారణ కిటికీల కంటే 31 శాతం ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి. చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి. గదికి, ఇంటికి కొత్త కళ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫిల్మ్‌ను కిటికీ అద్దాలకు అతికించడం వల్ల ఇంటిలో వేడి వాతావరణం తగ్గి గది చల్లబడుతుంది. తద్వారా ఫ్యాన్లు, ఏసీల వినియోగం తగ్గి విద్యుత్ ఆదా అవుతుంది. శీతాకాలంలో ఇంట్లోని వేడిని బయటకు పోనివ్వకుండా నిలుపుదల చేస్తూ.. బయట వాతావరణంలోని చల్లదనాన్ని ఇంట్లోకి రానివ్వకుండా చేసి గృహస్తుల ఆరోగ్యానికి కారణమవుతుంది. భారీగా పెరుగుతున్న మార్కెట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రచురించిన గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ నివేదిక ప్రకారం.. బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఖర్చులు 2019లో ప్రపంచవ్యాప్తంగా 152 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2018తో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ. దీంతో ఇంధన సామర్థ్యం, సమర్థ వినియోగం చేయగల భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. అదే విండో ఫిల్మ్ మార్కెట్ వృద్ధికి కారణమవుతోంది. విండో ఫిల్మ్ మార్కెట్ ఆసియా–పసిఫిక్, పశ్చిమ యూరప్, తూర్పు యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో బాగా విస్తరించింది. భారత్ సహా 30 దేశాల మార్కెట్లను అధ్యయనం చేసిన తరువాత విండో ఫిల్మ్ గ్లోబల్ మార్కెట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కెట్ 2021లో 13.08 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2022లో 13.90 బిలియన్ డాలర్లకు చేరింది. 2026 నాటికి 6.40 శాతం వార్షిక వృద్ధితో 17.79 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫిల్మ్‌లు ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్లైన్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. ధరలు కూడా కనిష్టంగా ఒక్కో ఫిల్మ్ కేవలం రూ.150 నుంచే మొదలవుతున్నాయి. ఆన్లైన్లో కొనే ముందు నాణ్యత తెలుసుకుంటే మంచిది. -
ఈ 'కూలింగ్ పేపర్' ఉంటే చాలు ఇంట్లో ఏసీ అక్కర్లేదు!
భూమి మీద రోజు రోజుకి భారీగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏసీ, కూలర్లు వారి ఇంట్లో వాడుతున్నారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో దీని ప్రభావం వాతావరణం మీద పడుతుంది. ఇలా ఏసీలు, కూలర్ల వల్ల డబ్బు వృదా కావడంతో పాటు వాతావరణం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, ఈ సమస్యకు చైనాకు చెందిన ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యీ జెంగ్(Yi Zheng) పరిష్కారం కనుగొన్నారు. సంప్రదాయ కూలింగ్ వ్యవస్థలపై ఆధారపడకుండా భవనాలు, ఇతర వస్తువులను చల్లగా ఉంచడానికి ఉపయోగించే ఒక స్థిరమైన మెటీరియల్ ను రూపొందించారు. దీనిని యి జెంగ్ తన మెటీరియల్ ను "కూలింగ్ పేపర్" అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఏదో ఒక రోజు ఈ కూలింగ్ పేపర్ అమార్చుకోవాలని తను ఆశిస్తున్నారు. ఈ "కూలింగ్ పేపర్" సూర్యుని నుంచి వచ్చే వేడిని గ్రహించుకొని తిరిగి పరావర్తనం చేస్తుంది. దీని వల్ల గది ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు తగ్గించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. "కూలింగ్ పేపర్"కు ఎలాంటి విద్యుత్ అవసరం లేదు, దీనిని 100శాతం రీసైకిల్ చేయవచ్చు. ఈ కూలింగ్ పేపర్ రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు. ఇది మీ ఇంటిపై ఉన్నంతసేపు ఇంట్లోని ఉష్ణోగ్రతలు లాగేసుకుని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది. "కూలింగ్ పేపర్" ఎలా తయారు చేయాలి? ముందుగా న్యూస్‌ప్రింట్‌ను నానబెట్టాలి, బ్లెండర్లో ముక్కలు ముక్కలు చేసి తర్వాత నీటిని తీసేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టెఫ్లాన్ తయారు చేసే పదార్థంను కలపాలి. కూలింగ్ పేపర్ లోపల ఉండే "సహజ ఫైబర్ల రంధ్రాల సూక్ష్మ నిర్మాణం" వేడిని శోషించుకొని ఇంటి నుంచి దూరంగా బదిలీ చేస్తుంది. ఆ తర్వాత అవసరం లేనప్పుడు కూలింగ్ పేపర్ తీసెసీ తర్వాత జెంగ్ కూలింగ్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయడానికి కొత్త షీట్ ను రీమేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ప్రక్రియలో అది ఎటువంటి శీతలీకరణ శక్తిని కోల్పోలేదని కనుగొన్నాడు. "తను వచ్చిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు" జెంగ్ చెప్పాడు. బహుశా రీసైక్లింగ్ తర్వాత 10 శాతం, 20 శాతం నష్టం జరుగుతుందని అనుకున్నాడు, కానీ అలా ఏమి జరగలేదు. -
వాటిని కొనేవారు లేక వెలవెలబోతున్న షాప్స్
న్యూఢిల్లీ: సాదారణంగా ప్రతి ఏడాది ఎండ కాలంలో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే, ఈ ఏడాది కూడా డిమాండ్ భారీగానే ఉంటుందని కంపెనీలు భావించాయి. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. ఏప్రిల్‌లో కోవిడ్ కేసుల విపరీతంగా పెరగడం వల్ల దాని ప్రభావం ఎయిర్ కండిషనర్లు, కూలర్ల వ్యాపారం మీద పడినట్లు బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలిపింది. 70శాతం పైగా ఎయిర్ కండీషనర్ అమ్మకాలు జనవరి నుంచి జూన్ మధ్య జరుగుతాయని నివేదికలో తెలిపారు. వాస్తవానికి, "మార్చి నుంచి మే వరకు గల మూడు నెలల కాలంలో 50 శాతం అమ్మకాలు జరుగుతాయి. ఈ కాలంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఆ ప్రభావం పరిశ్రమలపై భారీగానే ఉంటుంది. ఏసీ కొనుగోలు చేయడం వల్ల సాంకేతిక నిపుణులు వచ్చి వాటిని బిగించాలి కాబట్టి, ప్రస్తుత పరిస్థితిలో ఏసీలను కొనుగోలు చేయడానికి సాంకేతిక కారణాలతో వినియోగదారులు వెనుకాడుతున్నారని" అని నివేదిక తెలిపింది. భారతదేశంలోని ప్రాంతాల్లో వేడి వేసవిని అంచనా వేయడంతో పాటు ఏడాది క్రితం నుంచి వచ్చిన డిమాండ్‌ను బట్టి కంపెనీలు సీజన్‌కు సిద్ధమయ్యాయి. అలాగే, వేసవి ప్రారంభంలోనే వీటి ధరలను పరిశ్రమలు అధికంగా పెంచేసాయి. ఒకవైపు లాక్ డౌన్ ప్రభావం, మరోవైపు అధిక ధరలు అమ్మకాల మీద ప్రభావం చూపాయి. అనుకున్నంత స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా తగ్గించాయి. చదవండి: బ్రేకింగ్: 5జీ ట్రయల్స్ కు కేంద్రం ఆమోదం -
చల్లగా.. హాయిగా..!
లక్డీకాపూల్: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. షోరూమ్‌లకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. దీంతో నగరంలోని ఆయా ఎలక్ట్రానిక్ షాపులు కిటకిటలాడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన ఇవి ఆంక్షల సడలింపుతో మళ్లీ కొత్త కళను సంతరించుకున్నాయి. రోహిణి కార్తె అరుదెంచిన నేపథ్యంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉక్కపోత, వేడిని తట్టుకోవడం కష్టతరంగా తయారైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా ఇంటిల్లిపాదీ ఇంటికి పరిమితమయ్యారు. కార్యాలయాలు, పాఠశాలలు మూతపడడంతో పిల్లలు సహా ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఉపశమనం కోసం ఒక్కసారిగా ఏసీలు, కూలర్లకు గిరాకీ పెరిగింది. ఎండను సైతం లెక్క చేయక.. గ్రేటర్ ప్రజలు సోమవారం నగరంలోని ఎలక్ట్రానిక్ షోరూమ్‌ల ఎదుట ఎండను సైతం లెక్కడ చేయకుండా బారులు తీరారు. ఈ క్రమంలో పంజగుట్ట, చందానగర్, మియార్పూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ముషీరాబాద్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లోని ఎలక్ట్రానిక్ షోరూమ్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ షాపులు సైతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. -
ఎయిర్ కూలర్.. ఎయిర్ కండీషన్..ఏది బెస్ట్ ?
వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూయిస్తున్నాడు. ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవిని ఎదుర్కొనేందుకు నగరవాసులు ముందస్తు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూలర్లు, ఏసీలకు డిమాండ్ పెరిగింది. ఏసీల వినియోగం ఇతరత్రా అంశాలపై ఆన్ డిమాండ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ అర్బన్ క్లాప్ అనే సంస్థ చేసిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సాక్షి సిటీబ్యూరో: వేసవిలో వినియోగించి ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు. చాలా నెలల తర్వాత తిరిగి వినియోగించే ముందు కూలర్ ఏసీలకు సర్వీసింగ్ తప్పనిసరి. ఇప్పటికే ఇళ్లలో ఉన్నవారు వాటి మరమ్మతుల కోసం చూస్తున్నారు. కూలరైనా, ఏసీ అయినా 90 శాతంపైగా మంది వేసవిలోనే వాడుతున్నారు. నగరంలో ఏసీల వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటికే ఏసీ మెయిన్టెనెన్స్ కోసం ఎలక్ట్రీషియన్ని పిలిపించిన వారు కొందరైతే, ఆ లైన్లో ఉన్నవారు మరికొందరు. ఏసీల వినియోగం ఏ విధంగా ఉంటుందన్న అంశమై ఆన్ డిమాండ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ అర్బన్ క్లాప్ అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. దాదాపు 84 శాతం మంది తాము ప్రతి వేసవిలోనూ కనీసం ఒక్కమారైనా ఏసీ మరమ్మతు సేవలను వినియోగించుకుంటున్నారని తేలింది. దేశవ్యాప్తంగా ఏసీలను అధికంగా వినియోగిస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. అందుకే పేరొందిన బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తి తొలి ఆవిష్కరణలూ ఇక్కడే చేయడం ఎక్కువైంది. ఎయిర్ కూలర్.. ఎయిర్ కండీషన్..ఏది బెస్ట్ అంటే... ఎయిర్ కూలర్.. ఎయిర్ కండీషన్.. ఏది బెస్ట్ అంటే నగరవాసులు మాత్రం ఎయిర్ కండీషన్కే ఓటేస్తున్నారు. దాదాపు 19 శాతం మంది ఈ వేసవిలో ఏసీ కొనుగోలు చేస్తామంటుంటే, 5 మంది మాత్రం అద్దెకు తీసుకుంటామంటున్నారు. అయితే, ఏసీ కండీషన్లో ఉంటేనే విద్యుత్ బిల్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. నగరంలో గత వేసవిలో ప్రతి ఒక్కరూ తాము సాధారణంగా వేసవిలో చెల్లించే కరెంట్ బిల్లుతో పోలిస్తే చాలా ఎక్కువగానే చెల్లించామంటున్నారు. దాదాపు 37 శాతం మంది రూ. రూ. 1,500 నుంచి రూ. 3 వేలు కరెంట్ బిల్లు చెల్లిస్తే, 17 శాతం మంది రూ. 3 వేల నుంచి రూ. 5 వేల బిల్లు చెల్లించారు. 10 శాతం మంది రూ. 5 వేలకు పైగానే బిల్లు చెల్లించామని చెబుతున్నారు. ప్రతి పదిళ్లలో మూడింట ఏసీలు.. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది ఒక ఏసీ ఉందని చెప్పారు. రెండు ఏసీలు ఉన్నాయన్నవారు 25 శాతం కాగా, మూడు ఏసీలున్న వారు 15 శాతం మంది ఉన్నారు. మూడు కన్నా ఎక్కువ ఏసీలు వాడుతున్న వారు 14 శాతం ఉన్నారు. అద్దెకు ఏసీలను తీసుకునే వారు 10 శాతం వరకు ఉంటారని తేలింది. నగరం మొత్తం మీద 40 శాతం ఇళ్లలో కనీసం ఒక్క ఏసీ కామన్‌గా మారిం దని అర్బన్ క్లాప్ అధ్యయనం వెల్లడిస్తోంది. ఏడు గంటలు ఏసీ వినియోగం నగరంలో 29 శాతం మంది రాత్రంతా అంటే సుమారు 7 గంటలు ఏసీ వాడుతున్నామని చెబుతున్నారు. అందువల్లే మరమ్మతులు కూడా అధికంగానే ఉంటున్నాయని చెబుతోంది అర్బన్ క్లాప్ అధ్యయనం. తమ అధ్యయనంలో 31 శాతం మంది వేసవి సీజన్లో తమ ఏసీ ఒకటికన్నా ఎక్కువసార్లే బ్రేక్ డౌన్ అయిందంటున్నారు. 82 శాతం మంది అయితే సీజన్ ప్రారంభానికి ముందే మరమ్మతులు చేయించుకుంటున్నారు. నాణ్యమైన ఏసీ సర్వీసింగ్‌కు రూ. వెయ్యి వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. దాదాపు 26 శాతం మంది ఈ తరహాలోనే ఆలోచిస్తున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. తక్కువ కరెంట్‌కే ఓటు.. కరెంట్ వినియోగం తక్కువగా ఉండాలి. ఎక్కువ చల్లదనం అందించాలనుకునే వారు నగరంలో ఎక్కువే. దీంతో 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీలకు నగరంలో డిమాండ్ అధికంగా ఉంది. సంవత్సరానికి 750 యూనిట్ల విద్యుత్ దాటకూడదని కోరుకుంటున్న నగరవాసులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. దాదాపు 50 శాతం మంది కాస్త ఉక్కపోత వస్తే చాలు ఏసీ ఆన్ చేస్తున్నారని లెక్క తేలింది. 15 శాతం మంది రోజుకు 4–6 గంటలు వినియోగిస్తున్నామని చెప్పారు. -
సమ్మర్లో కూల్ కూల్‌గా...
సాక్షి, తానూరు(ముథోల్): ఎండాకాలం రాగానే మనందరికీ గుర్తొచ్చేవి కూలర్లే. ఎండ నుంచి ఉపశమనానికి, వేసవి తాపం నుంచి రక్షణకు ప్రతీ ఇంట్లో కూలర్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో కూలర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుంచే ఎండలు తమ ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో కూలర్లకోసం ప్రత్యేకమైన దుకాణాలు వెలుస్తుండగా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రికల్ షాపులో వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. వీటి ధర రూ.1600 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి. గత పక్షం రోజులుగా ఎండలు అధికం కావడంతో వీటి కొనుగోళ్లు అధికమయ్యాయి. ఎక్కడ చూసిన కూలర్ల దుకాణాలే.. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూలర్ షాపులు అధికంగా కనిపిస్తున్నాయి. గతంలో వాడిన కూలర్లకు మరమ్మతు చేయడంతోపాటు కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల బాట పడుతున్నారు. కొంతమంది ఎండలు ముదిరితే కూలర్ల రేట్లు పెరుగుతాయని ముందుగానే కొంటున్నారు. ఫైబర్, ఇనుప కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కూలర్లను మహారాష్ట్రలోని నాగపూర్, ఔరంగాబాద్, నాందేడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు నెలలే వ్యాపారం.. ఎండాకాలంలో నాలుగు నెలలు కూలర్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఏటా సీజన్లో 10 నుంచి 20వేల కూలర్లు అమ్ముడవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో పక్క పెళ్లిళ్ల సీజన్ కావడం.. కట్నకానుకల జాబితాలో కూడా కూలర్ చేరడంతో వేసవిలో వీటికి డిమాండ్ పెరిగింది. టేబుల్‌పై ఉంచుకునే పర్సనల్ కూలర్‌తోపాటు పెళ్లిళ్ల సందర్భంలో ఫంక్షన్హాల్లో, హోటళ్లలో వినియోగించే జంబో కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువకులకు ఉపాధి.. ఎండాకాలం రావడంతో పట్టణాల్లో ఉన్న షాపు యాజమాన్యాలు దుకాణాల్లో మరమ్మతు కోసం యువకులను పెట్టుకుంటున్నారు. దీంతో ఉపాధి లభిస్తోంది. నాలుగు నెలలపాటు ఈ వ్యాపారం కొనసాగడంతో యువకులు దుకాణాల్లో వ్యాపారం సాగిస్తున్నారు. నాలుగు నెలలపాటు ఉపాధి లభిస్తుందని యువకులు చెబుతున్నారు. ఇనుప కూలర్ల తయారీ.. పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వ్యాపారులు ఇనుప కూలర్లు తయారు చేస్తున్నారు. కూలర్ల తయారీలో వినియోగించే ముడి సరుకును హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, పూణే నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కూలర్ల తయారీకి ఐరన్ స్డాండ్, ఐరన్ ఫీల్స్, పంపులు, మోటార్, గడ్డి, కలర్ స్విచ్‌లు, వాటర్ సప్లై పైపులు వాడుతున్నారు. స్టాండర్ట్ ఐరన్ వాడటంతో రెడీమేడ్ కూలర్ల కన్నా అవి నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. వీటి ధర నాణ్యతను బట్టి రూ.3 వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. -
ఓటర్లకు ‘కూల్’ గాలం
సాక్షి, కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో శనివారం ఎయిర్ కూలర్లను నిల్వ చేయడం వివాదస్పదంగా మారింది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు వార్డుసభ్యుడిగా పోటీ చేస్తున్న ఓ నాయకుడు కూలర్లను లారీలో తీసుకొచ్చాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో అధికారులు విచారణ జరిపారు. ఇరుకుల్ల గ్రామంలో శనివారం మధ్యాహ్నం లారీలో వచ్చిన 160 ఎయిర్ కూలర్లను స్ధానికంగా ఉన్న రైసుమిల్లు గోదాంలో నిల్వ చేశారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు కూలర్లను తీసుకొచ్చారనే అనుమానంతో గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆందోళకు దిగారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై శ్రీనివాస్‌రావు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. వేసవికాలంలో కూలర్లను విక్రయించేందుకు వీలుగా ఇక్కడికి స్టాక్ తీసుకొచ్చినట్లు కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను చూపించడంతో ఎస్సై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానంటూ వెళ్లిపోయారు. అయితే ఉపసర్పంచు పదవికోసం వార్డుసభ్యుడిగా పోటీ చేస్తున్న ఓ నాయకుడు ఓటర్లకు పంపిణీ చేసేందుకు కూలర్లను తీసుకొచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ఏమి హాయిలే..
బహదూర్‌పురా: ఎండలు మండిపోతున్నాయి.. నీటి విరజిమ్మే స్పింకర్లు, చల్లదనాన్ని ఇచ్చే గ్రీన్ పరదాలు.. కూలర్లు.. నీటి ఫాంట్లు.. ఫాగర్స్ వన్యప్రాణులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించనున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో వీటిని ఏర్పాటు చేశారు. జూలో వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైభాగంలో గ్రీన్ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. ఓపెన్ ఎన్‌క్లోజర్‌లో ఉండే వన్యప్రాణులకు చుట్టూ నీటిని స్ప్రింక్లర్లతో విరజిమ్ముతున్నారు. ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నీటి ఫాంట్లతో నీటిని విరజిమ్ముతూ వేసవితాపం నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ల వద్ద కూలర్ల ద్వారా చల్లనిగాలి, మధ్య మధ్యలో పైపుల ద్వారా నీటిని విరజిమ్ముతూ హాయిగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పక్షుల ఎన్క్లోజర్ల వద్ద నీటి బిందువులను పొగ రూపంలో విరజిమ్మే ఫాగర్స్లను ఏర్పాటు చేశారు. నిశాచర జంతువుశాల, సరీసృపాల జగత్తులో ఎండ వేడిమిని ఉపశమనం కల్పించేందుకు ఏసీలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు అదనంగా బలవర్ధకమైన ఆహారం, విటమిన్స్, మినరల్స్‌ను అందజేస్తున్నారు. -
కూలర్స్.. భలే హాట్ గురూ!!
► కంపెనీలకు కలిసొచ్చిన భానుడి ప్రతాపం ► ఎండలతో పాటే పెరిగిన అమ్మకాలు ఈ మార్కెట్లోకి బ్లూస్టార్ వంటి ఏసీల కంపెనీలు కూడా.. ► మున్ముందు ఆన్లైన్ విక్రయాల వాటా పెరుగుతుందని ధీమా సాక్షి, బిజినెస్ బ్యూరో:- ఏడాదికేడాది ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భానుడు మే నెలలో చూపించాల్సిన పవర్‌ను ఈసారి మార్చి నుంచే మొదలెట్టాడు. మరి పరిస్థితేంటి? ఏసీలు ఉన్నవారి సంగతి సరే!! లేని వారి మాటో!? అందుకే ఈసారి కూలర్లు హాట్ కేకులయ్యాయి. సింఫనీ, బజాజ్ ఎలక్ట్రికల్, వోల్టాస్, ఉషా ఇంటర్నేషనల్, మహారాజా వైట్‌లైన్ వంటి కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తాయి. బ్రాండింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పరిస్థితి చూసిన ఏసీ కంపెనీలు... రూ.3,000 కోట్ల ఎయిర్ కూలర్ల విపణిలోకి ప్రవేశించటం విశేషం. రెండింతలు నమోదైన విక్రయాలు... అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూలర్ల విక్రయాలు బాగా పెరిగినట్లు బజాజ్ ఎలక్ట్రికల్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మార్కెటింగ్ హెడ్ (కన్సూమర్ ప్రొడక్ట్స్) అమిత్ సేథి చెప్పారు. ఒడిశా, బెంగాల్‌తో పాటు దక్షిణాదిలో కూలర్ల విక్రయాలు జోరుగా ఉన్నట్లు ఉషా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (అప్లయెన్సెస్) హర్విందర్ సింగ్ తెలిపారు. మొత్తంగా ఈ సీజన్ విక్రయాల్లో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ‘‘గతేడాది మంచి పనితీరు కనబరిచాం. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తాం’’ అని మహారాజా వైట్‌లైన్ సీఈవో సునీల్ వాద్వా తె లియజేశారు. 2016లో 1.5 లక్షలకు పైగా కూలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారాయన. గత ఏడాదితో పోలిస్తే మార్చి, ఏప్రిల్‌లో ఊహించని స్థాయిలో భారీ అమ్మకాలు నమోదైనట్లు టీఎంసీ బేగంపేట మేనేజర్ కె.శ్రీనివాస్ తెలియజేశారు. ‘‘100 శాతం వృద్ధి నమోదైంది’’ అని చెప్పారాయన. కొడితే సీజన్లోనే కొట్టాలి... కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం... కూలర్లను ఆఫ్ సీజన్లో కొనటానికి జనం ఇష్టపడరు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడే వీటికి డిమాండ్. ఇదే పరిశ్రమకు సవాలుగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సీజనల్ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన కొత్త ఉత్పత్తులను విడుదల చేశాయి. ఐ-ప్యూర్ పేరిట ప్రపంచంలో తొలిసారిగా మల్టీ స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ కూలర్లను సింఫనీ ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీకి కంపెనీ పేటెంటు దరఖాస్తు కూడా చేసింది. ‘‘పరిశ్రమలో అత్యధిక డిజైన్లు, ట్రేడ్ మార్కులు మాకే ఉన్నాయి’’ అని సింఫనీ సీఎండీ ఆచల్ బకేరి వెల్లడించారు. ఉషా కంపెనీ విండో కూలర్స్, టవర్ కూలర్స్, పర్సనల్ కూలర్స్ వంటి పలు విభాగాల్లో కొత్త ఉత్పత్తుల్ని తెచ్చింది. ఇవి ఆరోగ్యకరమైన జీవనానికి అనువుగా ఉంటాయని పేర్కొంది. ఇక మహారాజా కూడా ఇంధన పొదుపు ఫీచర్‌తో పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. మహారాజా కూలర్ల నిర్వహణ వ్యయం గంటకు రూ.2 ఉంటుందని, ఇది ఏసీల విషయంలో రూ.10 అని వాద్వా తెలిపారు. సరౌండ్ కూల్ టెక్నాలజీతో బజాజ్ ఎలక్ట్రికల్ తన ఉత్పత్తులను బ్రాండింగ్ చేస్తోంది. దిగ్గజ ఏసీ కంపెనీలు సైతం... ఏసీల తయారీలో ఉన్న దిగ్గజ కంపెనీ బ్లూ స్టార్ కూలర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. మూడేళ్లలో కూలర్ల వార్షిక అమ్మకాలు రూ.150 కోట్లకు చేర్చాలన్నది తమ లక్ష్యమని బ్లూస్టార్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ విభాగం ప్రెసిడెంట్ బి.త్యాగరాజన్ చెప్పారు. మరో దిగ్గజ సంస్థ వోల్టాస్ సైతం ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018 నాటికి సంస్థ అమ్మకాల్లో కూలర్ల వాటా 10 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో వోల్టాస్ ఒక లక్ష కూలర్లను విక్రయించింది. ఈ ఏడాది 2.5 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విక్రయాలు బాగుండే అవకాశముందని వోల్టాస్ ప్రెసిడెంట్ ప్రదీప్ బక్షి చెప్పారు. ఐటీ విడిభాగాల తయారీలో ఉన్న జీబ్రానిక్స్ సైతం కూలర్స్ విపణిలోకి ప్రవేశించింది. ఇక టైర్-1, టైర్-2 వంటి పట్టణాల్లోని విక్రయాలదే కీలకపాత్ర అని కంపెనీలు చెబుతున్నాయి. కరువు ఛాయలు కొంత ఆందోళన కలిగిస్తున్నా, వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని చెప్పటంతో విక్రయాలపై ధీమాగా ఉన్నట్లు సింగ్ చెప్పారు. డిస్కౌంట్లతో ఆన్లైన్లో... తమ విక్రయాల్లో ఈ-కామర్స్ వాటా 10 శాతంగా ఉందని వాద్వా చెప్పారు. అయితే ఈ-కామర్స్ వ్యవస్థలో ఎయిర్ కూలర్ల రవాణా పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉషా కంపెనీ ఈ మధ్యనే ఈ-టెయిలింగ్‌లో అడుగుపెట్టింది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముతోంది. మున్ముందు వినూత్న ఉత్పత్తులతో ఆన్లైన్ విభాగంలో అధిక వాటా కైవసం చేసుకుంటామని హర్విందర్ సింగ్ చెప్పారు. కాగా, భారత ఎయిర్ కూలర్ల మార్కెట్ 15-20 శాతం వృద్ధి రేటుతో రూ.3,000 కోట్లు ఉన్నట్టు అంచనా. ఇందులో వ్యవస్థీకృత రంగ సంస్థల వాటా 30 శాతం. మొత్తం అమ్మకాల్లో 60 శాతం ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలవి కాగా... వ్యవస్థీకృత రంగంలో విలువ పరంగా 50 శాతం వాటా తమదేనని సింఫనీ చెబుతోంది. -
పేదల కూలర్ బహు బాగు!
బంగ్లాదేశ్ : చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. జీవితాలేమో కానీ ఓ చిన్న ఐడియా పైసా ఖర్చు లేకుండా గుడిసెలకు కూలర్లను తీసుకొచ్చింది. బంగ్లాదేశ్‌లో వేసవితాపాన్ని తీర్చింది. ‘గే ఢాకా’, ‘గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్’ సంస్థలు అభివృద్ధి చేసిన ఎకో కూలర్ కరెంట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకునేందుకు మీ ఇంటి కిటికీ సైజుండే కార్డ్‌బోర్డు అట్ట, ప్లాస్టిక్ సీసాలు ఉంటే చాలు చల్లచల్లని కూలర్ రెడీ! అయితే దీని పనితీరు తెలుసుకోవాలంటే మీరు చిన్న ప్రయోగం చేయాల్సి ఉంటుంది. మీ చేతిని నోటికి కొంత దూరంలో నోరు తెరిచి గట్టిగా గాలి ఊదండి.. వెచ్చటి గాలి మీ చేతులను తాకుతుంది కదా..? సరే ఇప్పుడు పెదవులను గుండ్రంగా చుట్టి ఇంకోసారి ఊదండి.. తేడా తెలిసిందా.. గాలి కొంచెం చల్లగా మారడం గమనించారా.. ఎకో కూలర్ కూడా పనిచేసేది ఇలాగే. ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి రంధ్రాలు చేసిన కార్డ్‌బోర్డుకు బిగిస్తే చాలు. ఇంటి లోపలకి వచ్చే గాలి ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. చిన్న మార్గాల గుండా ప్రయాణించేందుకు గాలి పీడనానికి లోనవుతుంది. ఈ క్రమంలో గాలి ఉష్ణోగ్రత కూడా తగ్గి చల్లబడుతుంది. భలే ఐడియా కదూ..! -
’జూ’లోజంతువులకు కూలర్లు
-
రహదారిపై తగలబడిన ఏసీ కూలర్ల కంటైనర్
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాదగిరి చౌరస్తా వద్ద మంగళవారం ఏసీ కూలర్లతో వెళ్తున్న ఓ కంటైనర్ దగ్ధమైంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలార్పేందుకు యత్నించారు. అయితే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికి కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కంటైనర్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి కూలర్లతో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
ఒళ్లంత చల్లంత..
వేసవి తాపాన్ని తగ్గించే పనిలో ఇంట్లో కూలర్లు.. ఏసీలు.. నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉండగా భానుడి భగభగల నుంచి తప్పించుకున్నా.. బయటకు వెళ్లినప్పుడు మాత్రం మండుటెండకు మాడక తప్పదు. వడగాలికి వాడిపోకుండా కూల్‌గా ఉండేలా మొబైల్ కూలర్‌ను కనుగొన్నాడు మల్కాజిగిరికి చెందిన పోసూరి రవికిరణ్. బస్‌లో, కారులో వెళ్లేటప్పుడు ఈ ట్రావెల్ కూలర్ మీకు చల్లదనాన్ని అందిస్తుంది. అరచేతిలో ఇమిడే బుల్లి కూలర్ లో అరగ్లాస్ నీరు పోస్తే చాలు. బ్యాటరీతో నడిచే ఈ కూలర్‌ను పీవీసీ పైపు, బుల్లి ఫ్యాన్ బ్లేడ్ వంటి ఇతర పరికరాలతో రూపొందించాడు. దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు రూ.150 మాత్రమే. - అల్వాల్ -
వేసవి మోత విద్యుత్ కోత
అనధికారిక కోతలతో సిటీజనులకు ఇక్కట్లు దోమల మోతతో కునుకు కరువు కాలిపోతున్న ఫ్రిజ్‌లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఊపందుకున్న ఇన్వర్టర్ల విక్రయాలు సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఇష్టం వచ్చినట్లు కోతలు అమలవుతున్నాయి. అసలే వేసవి.. పైగా పరీక్షల సమయం.. అయినా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు అమలు చేస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటల పాటు కోతలు అమలు చేస్తామని అధికారికంగా ప్రకటించిన సీపీడీసీఎల్.. ముందస్తు సమాచారం లేకుండా అనధికారికంగా మరో మూడు గంటలు కరెంటు కట్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు పగటి పూటకే పరిమితమైన ఈ కోతలు... తాజాగా విద్యార్థులు చదువుకునే కీలకమైన రాత్రి సమయంలోనూ అమలు చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 48 మిలియన్ యూనిట్లు అవసరం ప్రస్తుతం గ్రేటర్ వాసుల అవసరాలు తీర్చాలంటే ప్రతి రోజూ కనీసం 48 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా.. 43 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావడం లేదు. ఫలితంగా కోతలు తప్పవని ప్రకటించిన సీపీడీ సీఎల్... ఆ మాటకైనా కట్టుబడి ఉండటం లేదు. ఉదాహరణకు మెహిదీపట్నం, అజామాబాద్, గ్రీన్‌ల్యాండ్స్, రాజేంద్రనగర్, చంపాపేట్ డి విజన్లలో ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 5 నుంచి 6.30 గంటల వరకు అధికారిక కోతలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అనధికారికంగా ఇక్కడ మరో మూడు గంటలు కోత విధిస్తోంది. అలాగే బేగంబజార్, చార్మినార్, ఆస్మాన్‌ఘడ్, హబ్సిగూడ, మేడ్చల్ డివిజన్ల పరిధిలో ఉదయం 9.30 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత విధిస్తున్నట్లు చెప్పినా.. అనధికారికంగా మరో రెండు గంటలు కట్ చేస్తోంది. కనీసం రాత్రి పూటైన ప్రశాంతంగా నిద్రపోదామని భావించే వారికి ఆ భాగ్యం దక్కనీయడం లేదు. దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుడే మొదలైన ఉక్కపోతకు దోమలు కూడా తోడవుతున్నాయి. ఈ సమయంలో ఇంట్లోని ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పనిచేయక పోవడంతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సమయం సందర్భం లేకుండా ఎడాపెడా కరెంట్‌ను కట్ చేస్తుండటంతో ఇంట్లో విలువైన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ యంత్రాలు కాలిపోతున్నాయి. ఈ విషయంపై సమీపంలోని అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోవ డం లేదు. ఈ కోతలను తట్టుకోలేక కొంతమంది తల్లితండ్రులు ముందస్తు జాగ్రత్త కోసం ఇన్వర్టర్లు కొనుగోలు చేస్తుండటంతో ఇటీవ ల వీటి విక్రయాలు ఊపందుకున్నాయి. సంక్షోభం దిశగా పరిశ్రమలు వరుస ఆందోళనలతో అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమలు.. తాజా అధికారిక సెలవులతో మరిన్ని నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఆర్డర్లు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు ఇంతకాలం వాటినే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్న కార్మికుల జీవితాలు మళ్లీ రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉండనుందోనని యజమానులతో పాటు కార్మికులూ ఆందోళన చెందుతున్నారు. మంత్రుల క్వార్టర్స్‌కు కరెంట్ కట్ బిల్లు కట్టలేదనే నేపంతో ఇటీవల గోల్కొండకోటకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన డిస్కం.. తాజాగా ఇదే కారణంతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మంత్రుల నివాస సముదాయానికి బుధవారం విద్యుత్ సరఫరా నిలిపి వేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్వార్టర్లకు కరెంటు లేకపోవడంతో మాజీ మంత్రుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ సముదాయం రెండు మాసాల కాలానికి రూ.24 లక్షలు బకాయిపడింది. మూడుసార్లు నోటీసులిచ్చినా ఆర్అండ్బి అధికారులు స్పందించలేదు. దీంతో ఫిలింనగర్ ట్రాన్స్‌కో ఏఈ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కరెంటు నిలిపివేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో 8 గంటల తర్వాత కరెంటును పునరుద్ధరించారు. -
భగ్గుమంటున్న భానుడు
సిటీలో పగలు సెగలు అనారోగ్యం పాలవుతున్న సిటిజన్లు సాక్షి, సిటీబ్యూరో: భానుడు భగ్గున మండుతున్నాడు. ఉదయం 10 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు వేడికి అల్లాడుతున్నారు. మండె ఎండలకు ఉక్కపోత తోడవ్వడంతో సిటిజన్లు అసౌకర్యానికి గురవుతున్నారు. పగలు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండటంతో ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు పనిచేయక పోవడంతో ఇరుకైన అపార్ట్‌మెంటుల్లో నివాసం ఉండేవారు ఉక్కకు తట్టుకోలేక పోతున్నారు. తాజాగా సోమవారం గరిష్ట 35.6, కనిష్ట 21.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ తర్వాత మరెలా ఉంటుందోనని సిటిజన్లు భయపడుతున్నారు. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న వాహన, పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చమట పొక్కులతో చికాకే..: ఎండ తీవ్రతకు చిన్నారులు,వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, టూవీలర్స్‌పై ప్రయాణించే మా ర్కెటింగ్ ఉద్యోగులు, యువ తీయువకులు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారు జామున చలి, మధ్యాహ్నం ఎండ వల్ల చర్మం పొడిబారుతోంది. ఉక్కపోత వల్ల మెడ, కాళ్లు, చేతులపై పొక్కులు వస్తున్నాయి. ముఖం వాడిపోవడంతో పాటు నుదురు, బుగ్గలపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి. మానసికంగా ఎంతో అలసి పోవడంతో పాటు వడదెబ్బ, జ్వరం బారిన పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎండలో భయటికి వెళ్లక పోవడమే ఉత్తమం. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్, గొడుగు విధిగా వెంట తీసుకెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టైట్ జీన్స్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సూర్యుని వైపు చూడటం వల్ల కిరణాల తాకిడికి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. టైట్ జీన్స్, బిగుతు లోదుస్తులు వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. చిన్నారులకు చెమట పొక్కులు రాకుండా కూల్ పౌడర్లు వాడాలి. చన్నీటితో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. - డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, నిలోఫర్ చిన్నపిల్లల వైద్యశాల సన్‌లోషన్స్ రాసుకోవాలి చిన్నారులు, వద్ధులు, గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకూడదు. ఏమైన పనులు ఉంటే ఉదయం పూర్తి చేసుకుని ఎండ ముదిరే సమయానికి ఇంటికి చేరుకోవాలి. స్కిన్ గ్లో తగ్గకుండా ఉండాలంటే బయటికి వెళ్లే ముందు చర్మానికి సన్‌లోషన్స్ అప్లైయ్ చేయాలి. - డాక్టర్ మన్మోహన్, ప్రొఫెసర్ ఉస్మానియా మెడికల్ కళాశాల మసాలా ఫుడ్డు వద్దేవద్దు మసాలా ఫుడ్డుకు బదులు, సులభంగా జీర్ణం అయ్యే పెరుగు అన్నం తీసుకోవాలి. కలుషిత నీరు కాకుండా శుభ్రమైన ఫ్యూరిఫైడ్ మంచి నీటిని వాడాలి. శీతల పానీయాలకు బదులు పండ్ల రసాలు, కొబ్బారి బొండాలు తాగాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు రోజుకు కనీసం ఐదు లీటర్ల మంచి నీరు తాగాలి. - డాక్టర్ సంగీత, అపోలో, డీఆర్డీఎల్ చలువ అద్దాల ఎంపికలో జాగ్రత్త సూర్యుని వైపు చూడటం వల్ల కిరణాల తాకిడికి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. రోడ్డుసైడ్ లభించే కూలింగ్ గ్లాసులు కంటికి మేలు చేయక పోగా మరింత హాని చేస్తాయి. యాంటి రిఫ్లెక్షన్ బ్లాక్, బ్రౌన్ కలర్ గ్లాసులు ఎంపిక చేసుకోవాలి. ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి కళ్లను శుభ్రం చేసుకోవాలి. - డాక్టర్ రవీందర్, ప్రముఖ కంటి వైద్యనిపుణుడు