లక్డీకాపూల్: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. షోరూమ్‌లకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. దీంతో నగరంలోని ఆయా ఎలక్ట్రానిక్ షాపులు కిటకిటలాడుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన ఇవి ఆంక్షల సడలింపుతో మళ్లీ కొత్త కళను సంతరించుకున్నాయి. రోహిణి కార్తె అరుదెంచిన నేపథ్యంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉక్కపోత, వేడిని తట్టుకోవడం కష్టతరంగా తయారైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇంటిల్లిపాదీ ఇంటికి పరిమితమయ్యారు. కార్యాలయాలు, పాఠశాలలు మూతపడడంతో పిల్లలు సహా ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఉపశమనం కోసం ఒక్కసారిగా ఏసీలు, కూలర్లకు గిరాకీ పెరిగింది.
ఎండను సైతం లెక్క చేయక..
గ్రేటర్ ప్రజలు సోమవారం నగరంలోని ఎలక్ట్రానిక్ షోరూమ్‌ల ఎదుట ఎండను సైతం లెక్కడ చేయకుండా బారులు తీరారు. ఈ క్రమంలో పంజగుట్ట, చందానగర్, మియార్‌పూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ముషీరాబాద్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఎలక్ట్రానిక్ షోరూమ్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ షాపులు సైతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment