Window Film Has Entered Market To Cooling For House - Sakshi
Sakshi News home page

ముందుంది ఎండలు మండే కాలం! కిటికీలకు ఈ ఫిల్మ్‌లు అతికిస్తే! ఇల్లు ‘చిల్‌’! ధరలు కూడా అందుబాటులో..

Published Mon, Feb 13 2023 2:55 AM | Last Updated on Mon, Feb 13 2023 1:12 PM

Window film has entered market to cooling for house - Sakshi

విండో ఫిల్మ్‌ వేసిన గ్లాస్, విండో ఫిల్మ్‌ వేయని గ్లాస్‌

విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు ఇళ్లలోకి అతినీలలోహిత కిరణాలు చొరబడకుండా కాపాడే విండో ఫిల్మ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కాంతిని నిరోధించకుండానే గదిని చల్లబరచగ లగటం దీని ప్రత్యేకత. ‘పారదర్శక రేడియేటివ్‌ కూలర్లు’గా పిలిచే ఈ ఫిల్మ్‌ను కిటికీలకు వినియోగిస్తే.. ఒక్క వాట్‌ విద్యుత్‌ కూడా వాడక్కర్లేకుండా భవనాల లోపలి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ ఫిల్మ్‌లు మన దేశీయ మార్కెట్‌లోనూ లభ్యమవుతున్నాయి. 

సాక్షి, అమరావతి:  ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన విధానంలో అనేక మార్పులొస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే సరికొత్త వ్యాపారాలూ పుట్టుకొస్తున్నాయి. కిటికీ అద్దాలకు విండో ఫిల్మ్‌ను అతికిస్తే ఇల్లు మొత్తం కూల్‌గా మారిపోయే విండో ఫిల్మ్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది. విద్యుత్‌ బిల్లులను తగ్గించడంతోపాటు ఆల్ట్రా వయొలెట్‌ (అతినీలలోహిత) కిరణాల నుంచి రక్షణ కల్పించేలా దీనిని అభివృద్ధి చేశారు. ట్రాన్స్‌పరెంట్‌ రేడియేటివ్‌ కూలర్లుగా పిలుస్తున్న ఈ ఫిల్మ్‌లను వినియోగించటం వల్ల ఏసీలు, కూలర్లతో పని లేకుండా గదులన్నీ కూల్‌ అయిపోతాయి.

ప్రపంచంలో దాదాపు 15 శాతం విద్యుత్‌ను కేవలం గదుల శీతలీకరణకే వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికత వల్ల ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కూడా వాడాల్సిన అవసరం లేకుండా భవనాల లోపల ఉష్ణోగ్రతను తగ్గించగలదు. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ ఎనర్జీ లెటర్స్‌ నివేదిక ప్రకారం.. భవనాలు, వాహనాల్లో చల్లదనం కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ‘ట్రాన్సపరెంట్‌ రేడియేటివ్‌ కూలర్లు’ విండో మెటీరియల్‌గా ఉపయోగపడతాయి. ఇవి వాతావరణ మార్పులను పరిష్కరించడంలోనూ తోడ్పడతాయి.   

ప్రయోజనాలెన్నో..! 
విండో ఫిల్మ్‌ అనేది ఒక సన్నని పదార్థం. దీనిని పాలిస్టర్‌ పొరలతో తయారు చేస్తారు. ప్రతిబింబం కనిపించేలా పూత పూస్తారు. ఇలా తయారైన విండో ఫిల్మ్‌ను కిటికీలకు అమర్చడం వల్ల సూర్యరశ్మిని గదిలోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. సూర్య కిరణాల్లో ఉండే హానికరమైన అతినీలలోహిత (ఆల్ట్రా వయొలెట్‌) కిరణాలను ఈ ఫిల్మ్‌ 97 శాతం అడ్డుకుంటుంది. సాధారణ గ్లాస్‌ కిటికీలకు కూడా ఈ ఫిల్మ్‌ వేస్తే బ్రాండెడ్‌ కిటికీల్లా మారతాయి.

భవనంలోకి ప్రవేశించే సౌరశక్తిలో 80 శాతం వరకూ నిరోధించడానికి ఈ ఫిల్మ్‌లను రూపొందించారు. ఇవి సాధారణ కిటికీల కంటే 31 శాతం ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి. చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి. గదికి, ఇంటికి కొత్త కళ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫిల్మ్‌ను కిటికీ అద్దాలకు అతికించడం వల్ల ఇంటిలో వేడి వాతావరణం తగ్గి గది చల్లబడుతుంది.

తద్వారా ఫ్యాన్లు, ఏసీల వినియోగం తగ్గి విద్యుత్‌ ఆదా అవుతుంది. శీతాకాలంలో ఇంట్లోని వేడిని బయటకు పోనివ్వకుండా నిలుపుదల చేస్తూ.. బయట వాతావరణంలోని చల్లదనాన్ని ఇంట్లోకి రానివ్వకుండా చేసి గృహస్తుల ఆరోగ్యానికి కారణమవుతుంది.  

భారీగా పెరుగుతున్న మార్కెట్‌ 
యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రచురించిన గ్లోబల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ ఆఫ్‌ బిల్డింగ్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ నివేదిక ప్రకారం.. బిల్డింగ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఖర్చులు 2019లో ప్రపంచవ్యాప్తంగా 152 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 2018తో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ. దీంతో ఇంధన సామర్థ్యం, సమర్థ వినియోగం చేయగల భవనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. అదే విండో ఫిల్మ్‌ మార్కెట్‌ వృద్ధికి కారణమవుతోంది.

విండో ఫిల్మ్‌ మార్కెట్‌ ఆసియా–పసిఫిక్, పశ్చిమ యూరప్, తూర్పు యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో బాగా విస్తరించింది. భారత్‌ సహా 30 దేశాల మార్కెట్లను అధ్యయనం చేసిన తరువాత విండో ఫిల్మ్‌ గ్లోబల్‌ మార్కెట్‌ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కెట్‌ 2021లో 13.08 బిలియన్‌ డాలర్లుగా ఉంటే.. 2022లో 13.90 బిలియన్‌ డాలర్లకు చేరింది.

2026 నాటికి 6.40 శాతం వార్షిక వృద్ధితో 17.79 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫిల్మ్‌లు ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌ మార్కెట్‌లోనూ దొరుకుతున్నాయి. ధరలు కూడా కనిష్టంగా ఒక్కో ఫిల్మ్‌ కేవలం రూ.150 నుంచే మొదలవుతున్నాయి.  ఆన్‌లైన్‌లో కొనే ముందు నాణ్యత  తెలుసుకుంటే మంచిది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement