కూలర్స్.. భలే హాట్ గురూ!! | high sales in coolers for online market in summer fever | Sakshi
Sakshi News home page

కూలర్స్.. భలే హాట్ గురూ!!

Published Thu, May 26 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

కూలర్స్.. భలే హాట్ గురూ!!

కూలర్స్.. భలే హాట్ గురూ!!

కంపెనీలకు కలిసొచ్చిన భానుడి ప్రతాపం
ఎండలతో పాటే పెరిగిన అమ్మకాలు  ఈ మార్కెట్లోకి బ్లూస్టార్ వంటి ఏసీల కంపెనీలు కూడా..
మున్ముందు ఆన్‌లైన్ విక్రయాల వాటా పెరుగుతుందని ధీమా

 
సాక్షి, బిజినెస్ బ్యూరో:-  ఏడాదికేడాది ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భానుడు మే నెలలో చూపించాల్సిన పవర్‌ను ఈసారి మార్చి నుంచే మొదలెట్టాడు. మరి పరిస్థితేంటి? ఏసీలు ఉన్నవారి సంగతి సరే!! లేని వారి మాటో!? అందుకే ఈసారి కూలర్లు హాట్ కేకులయ్యాయి. సింఫనీ, బజాజ్ ఎలక్ట్రికల్, వోల్టాస్, ఉషా ఇంటర్నేషనల్, మహారాజా వైట్‌లైన్ వంటి కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తాయి. బ్రాండింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పరిస్థితి చూసిన ఏసీ కంపెనీలు... రూ.3,000 కోట్ల ఎయిర్ కూలర్ల విపణిలోకి ప్రవేశించటం విశేషం.


 రెండింతలు నమోదైన విక్రయాలు...
అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూలర్ల విక్రయాలు బాగా పెరిగినట్లు బజాజ్ ఎలక్ట్రికల్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మార్కెటింగ్ హెడ్ (కన్సూమర్ ప్రొడక్ట్స్) అమిత్ సేథి చెప్పారు. ఒడిశా, బెంగాల్‌తో పాటు దక్షిణాదిలో కూలర్ల విక్రయాలు జోరుగా ఉన్నట్లు ఉషా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (అప్లయెన్సెస్) హర్విందర్ సింగ్ తెలిపారు. మొత్తంగా ఈ సీజన్  విక్రయాల్లో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ‘‘గతేడాది మంచి పనితీరు కనబరిచాం. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తాం’’ అని మహారాజా వైట్‌లైన్ సీఈవో సునీల్ వాద్వా తె లియజేశారు. 2016లో 1.5 లక్షలకు పైగా కూలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారాయన. గత ఏడాదితో పోలిస్తే మార్చి, ఏప్రిల్‌లో ఊహించని స్థాయిలో భారీ అమ్మకాలు నమోదైనట్లు టీఎంసీ బేగంపేట మేనేజర్ కె.శ్రీనివాస్ తెలియజేశారు. ‘‘100 శాతం వృద్ధి నమోదైంది’’ అని చెప్పారాయన.


కొడితే సీజన్‌లోనే కొట్టాలి...
కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం... కూలర్లను ఆఫ్ సీజన్లో కొనటానికి జనం ఇష్టపడరు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడే వీటికి డిమాండ్. ఇదే  పరిశ్రమకు సవాలుగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సీజనల్ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన కొత్త ఉత్పత్తులను విడుదల చేశాయి. ఐ-ప్యూర్ పేరిట ప్రపంచంలో తొలిసారిగా మల్టీ స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ కూలర్లను సింఫనీ ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీకి కంపెనీ పేటెంటు దరఖాస్తు కూడా చేసింది. ‘‘పరిశ్రమలో అత్యధిక డిజైన్లు, ట్రేడ్ మార్కులు మాకే ఉన్నాయి’’ అని సింఫనీ సీఎండీ ఆచల్ బకేరి వెల్లడించారు. ఉషా కంపెనీ విండో కూలర్స్, టవర్ కూలర్స్, పర్సనల్ కూలర్స్ వంటి పలు విభాగాల్లో కొత్త ఉత్పత్తుల్ని తెచ్చింది. ఇవి ఆరోగ్యకరమైన జీవనానికి అనువుగా ఉంటాయని పేర్కొంది. ఇక మహారాజా కూడా ఇంధన పొదుపు ఫీచర్‌తో పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. మహారాజా కూలర్ల నిర్వహణ వ్యయం గంటకు రూ.2 ఉంటుందని, ఇది ఏసీల విషయంలో రూ.10 అని వాద్వా తెలిపారు. సరౌండ్ కూల్ టెక్నాలజీతో బజాజ్ ఎలక్ట్రికల్  తన ఉత్పత్తులను బ్రాండింగ్ చేస్తోంది.


 దిగ్గజ ఏసీ కంపెనీలు సైతం...
ఏసీల తయారీలో ఉన్న దిగ్గజ కంపెనీ బ్లూ స్టార్ కూలర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. మూడేళ్లలో కూలర్ల వార్షిక అమ్మకాలు రూ.150 కోట్లకు చేర్చాలన్నది తమ లక్ష్యమని బ్లూస్టార్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ విభాగం ప్రెసిడెంట్ బి.త్యాగరాజన్ చెప్పారు. మరో దిగ్గజ సంస్థ వోల్టాస్ సైతం ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018 నాటికి సంస్థ అమ్మకాల్లో కూలర్ల వాటా 10 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో వోల్టాస్ ఒక లక్ష కూలర్లను విక్రయించింది. ఈ ఏడాది 2.5 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విక్రయాలు బాగుండే అవకాశముందని వోల్టాస్ ప్రెసిడెంట్ ప్రదీప్ బక్షి చెప్పారు. ఐటీ విడిభాగాల తయారీలో ఉన్న జీబ్రానిక్స్ సైతం కూలర్స్ విపణిలోకి ప్రవేశించింది. ఇక టైర్-1, టైర్-2 వంటి పట్టణాల్లోని విక్రయాలదే కీలకపాత్ర అని కంపెనీలు చెబుతున్నాయి. కరువు ఛాయలు కొంత ఆందోళన కలిగిస్తున్నా, వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని చెప్పటంతో విక్రయాలపై ధీమాగా ఉన్నట్లు సింగ్ చెప్పారు.  
 
 
డిస్కౌంట్లతో ఆన్‌లైన్‌లో...

తమ విక్రయాల్లో ఈ-కామర్స్ వాటా 10 శాతంగా ఉందని వాద్వా చెప్పారు. అయితే ఈ-కామర్స్ వ్యవస్థలో ఎయిర్ కూలర్ల రవాణా పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉషా కంపెనీ ఈ మధ్యనే ఈ-టెయిలింగ్‌లో అడుగుపెట్టింది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులను ఆన్‌లైన్లో అమ్ముతోంది. మున్ముందు వినూత్న ఉత్పత్తులతో ఆన్‌లైన్ విభాగంలో అధిక వాటా కైవసం చేసుకుంటామని హర్విందర్ సింగ్ చెప్పారు. కాగా, భారత ఎయిర్ కూలర్ల మార్కెట్ 15-20 శాతం వృద్ధి రేటుతో రూ.3,000 కోట్లు ఉన్నట్టు అంచనా. ఇందులో వ్యవస్థీకృత రంగ సంస్థల వాటా 30 శాతం. మొత్తం అమ్మకాల్లో 60 శాతం ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలవి కాగా... వ్యవస్థీకృత రంగంలో విలువ పరంగా 50 శాతం వాటా తమదేనని సింఫనీ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement