AC companies
-
మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే..
ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది భారీగా వేసవి తాపం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ యాప్‌లు, రిటైల్ స్టోర్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐసెర్ రేటింగ్ కొందరు సరైన అవగాహన లేక పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుంది. ఇన్వర్టర్తో మేలు చాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్డోర్ యూనిట్‌లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది. ఇదీ చదవండి: 8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే.. ధరల మధ్య వ్యత్యాసం ఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. -
Andhra Pradesh: ఏసీ.. మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా మేడిన్ ఆంధ్రా ఏసీలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్ కండిషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలో తయారైందే ఉండనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఏసీ అమ్మకాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌లో తయారైనవే ఉండనున్నాయి. దేశంలోని దిగ్గజ ఏసీ తయారీ సంస్థలు మన రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీం) కింద మార్చినాటికి ఉత్పత్తి ప్రారంభించే విధంగా పనులను వేగంగా చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకిన్ తొలిదశలో ఏటా 10 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా రెండోదశలో మరో 15 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా విస్తరించనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లను పెట్టుబడి పెట్టనుంది. బ్లూస్టార్ ఏటా 12 లక్షల ఏసీలను తయారు చేసే విధంగా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే 10 వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా. శ్రీసిటీలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్న ఏసీ తయారీ కంపెనీలు, వాటి పెట్టుబడులు (రూ.కోట్లలో) ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రోత్సాహం రాష్ట్రాన్ని ఏసీ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏసీ తయారీలో వినియోగించే ఉపకరణాలను తయారు చేసే ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహిస్తోంది. శ్రీసిటీలో ఏర్పాటవుతున్న ఆరు ఏసీ తయారీ యూనిట్లకు ఉపకరణాలను సరఫరా చేసే ఐదు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అంతేగాకుండా ఇక్కడ ఏర్పాటవుతున్న యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూనిట్లు నిర్మాణ పనులు పూర్తిచేసుకునే సరికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టారు. -
ఏసీల తయారీ హబ్‌గా శ్రీ సిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ హబ్‌గా ఎదుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి ఏసీ తయారీ యూనిట్లు తిరుపతి జిల్లా శ్రీసిటీకి క్యూ కడుతున్నాయి. గత ఆరు నెలల్లోనే ఆరు అంతర్జాతీయ ఏసీ తయారీ, విడిభాగాల తయారీ సంస్థలు ఇక్కడకు వచ్చాయి. బ్లూస్టార్, డైకిన్ వంటి సంస్థలతో పాటు 20కిపైగా బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేసే ఆంబర్, హావెల్స్, ఈప్యాక్ డ్యూరబుల్స్, పానాసోనిక్–యాంకర్ సంస్థలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా రూ.3,755 కోట్ల పెట్టుబడులు రానుండగా, 9,700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇందులో బ్లూస్టార్ ఏడాదికి 12 లక్షల ఏసీల సామర్థ్యంతో, డైకిన్ 15 లక్షల యూనిట్ల సామర్థ్యంతో పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. పానాసోనిక్ యాంకర్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. మిగిలిన పరిశ్రమల నిర్మాణం వేగంగా జరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో భూమి పూజ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని బ్లూస్టార్ ప్రతినిధి ‘సాక్షి’కి వివరించారు. ఒక్క శ్రీ సిటీకే రూ.8,349 కోట్ల పెట్టుబడులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008 ఆగస్టు 8న ప్రారంభమైన శ్రీ సిటీలో ఇప్పటివరకు 28 దేశాలకు చెందిన 200కు పైగా సంస్థల పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50,000 మందికి ఉపాధి లభిస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీ సిటీ గత మూడేళ్లలో భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019 జూన్ నుంచి ఇప్పటివరకు 38 సంస్థలు కొత్త పరిశ్రమలను నెలకొల్పాయి. ఇందులో కింబెర్లీ క్లార్క్, ఆల్స్టామ్ రెండో దశ విస్తరణ చేపట్టాయి. సీఆర్ఆర్సీ, ఎల్జీ పాలిమర్స్, కాస్‌మాక్స్ బ్యాటరీస్, ఓజి ఇండియా ప్యాకేజింగ్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో 14 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కోవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేవలం 14 నెలల రికార్డు సమయంలో యూనిట్‌ను ప్రారంభించినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు తెలిపారు. 2020 డిసెంబర్ 18న పనులు ప్రారంభించి 2021 నవంబర్‌లో సీఎం చేతులు మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభించారు. ఇక్కడ 220 టన్నులు ఆక్సిజన్‌తో పాటు పారిశ్రామిక అవసరాలకు ఇతర వాయువులను తయారు చేస్తారు. పవన విద్యుత్‌కు తయరీలో కీలకమైన విండ్ మిల్ గేర్ బాక్స్‌లను తయారు చేసే చైనాకు చెందిన ఎన్జీసీ ట్రాన్స్మిషన్ పరిశ్రమ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం క్వాలిటీ ఆడిటింగ్ జరుగుతోందని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. శ్రీ సిటీలో ఈ మూడేళ్లలో కొత్తగా రూ.8,349 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 21,540 మందికి ఉపాధి లభిస్తోంది. మూడేళ్లలో రాష్ట్రంలో రూ.36,313 కోట్ల పెట్టుబడులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 96 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 56,681 మందికి ఉపాధి లభిస్తోంది. మరో 36,000 కోట్ల విలువైన పెట్టుబడులతో 52 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే మరో 77 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఆర్సిలర్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా, సెంచురీ ఫ్లైవుడ్స్, శ్రీ సిమెంట్స్, గ్రీన్కో ఎనర్జీ, అరబిందో వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ మూడేళ్లలో 26,922 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంస్‌ఈ) యూనిట్లు రాష్ట్రంలో రూ.7,550 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 1.76 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. -
ఈ కంపెనీ ఎయిర్ ఫిల్టర్‌తో కరోనా వైరస్ ఖతం..!
వాషింగ్టన్: ప్రస్తుత మానవాళిని వెంటాడుతున్న పెద్ద సమస్య కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అనేకమంది చనిపోయారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగానే కొనసాగుతుంది. కరోనా వైరస్ కూడా అంతేవేగంగా మ్యూటేషన్లకు గురై, కొత్త వేరియంట్లతో ఇబ్బంది పెడుతుంది. కరోనా వైరస్ ముప్పు నుంచి రక్షించడం కోసం ప్రముఖ ఏసీ తయారీ సంస్థ హనీవెల్ ఇంటర్నేషనల్ సరికొత్త ఏసీ ఎయిర్ ఫిల్టర్‌ను ఆవిష్కరించింది. ఎయిర్కండిషనర్ల ఎయిర్ ఫిల్టర్లకు ప్రత్యేకమైన కోటింగ్‌ను అమర్చడంతో సుమారు 97 శాతం వరకు కరోనా వైరస్‌ను నాశనం చేయవచ్చునని హనీవెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి కోటింగ్ చేయబడిన ఎయిర్‌ఫిల్టర్‌ను అందుబాటులోకి వస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డారియస్ ఆడమ్జిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీల ఏయిర్‌ఫిల్టర్లకు పూసే రసాయన కోటింగ్‌కు ఎన్విరానెమెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం హనీవెల్ టెక్సాస్ , నార్త్ కరోలినా రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకోవాలని కంపెనీ ఆశిస్తుందని డారియస్ బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొన్నారు. హనీవెల్ కంపెనీ ప్రయోగశాలలో నిర్వహించిన పరిశోధన ప్రకారం..కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో ఎయిర్ ఫిల్టర్లు 97 శాతం వరకు ప్రభావవంతంగా పనిచేశాయని డారియస్ వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, హనీవెల్ కంపెనీ N95 మాస్క్‌లు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసింది. హనీవెల్‌కు చెందిన రోబోట్లను ఉపయోగించి అల్ట్రా వైలెట్ కాంతితో విమానాలను శుభ్రం చేయడానికి ఉపయోగించారు. -
భారత్‌లో కొత్త ‘ఏసీ’ బ్రాండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల మార్కెట్లోకి కొత్త బ్రాండ్లు ఎంట్రీ ఇస్తున్నాయి. మరికొన్ని రీ–ఎంట్రీ చేస్తున్నాయి. దేశీయంగా ఏసీల అమ్మకాలు ఆకర్షణీయంగా ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటికే 12 దాకా బ్రాండ్లు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఏటా వందలాది మోడళ్లతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఇతర కంపెనీలకు సవాల్ విసురుతున్నాయి. ఇప్పుడు కొత్త బ్రాండ్ల రాకతో పోటీ తీవ్రతరం కానుంది. 2018–19లో దేశవ్యాప్తంగా 55 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో 15 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. వచ్చే అయిదేళ్లలో అమ్మకాలు రెండింతలకు చేరుకుంటాయని పరిశ్రమ ధీమాగా ఉంది. ఒకదాని వెంట ఒకటి.. యూరప్‌కు చెందిన ట్రూవిజన్ భారత్‌లో ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. ప్యానాసోనిక్ ఆన్లైన్ బ్రాండ్ అయిన సాన్యో ఏసీల విభాగంలోకి ప్రవేశించింది. రూ.24,490ల నుంచి మోడళ్లు లభ్యం అవుతున్నాయి. లివ్‌ప్యూర్ బ్రాండ్‌తో ఎయిర్, వాటర్ ప్యూరిఫయర్ల రంగంలో ఉన్న ఎస్ఏఆర్ గ్రూప్ ఏసీల విక్రయాల్లోకి రంగ ప్రవేశం చేస్తోంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫంక్షన్స్‌తో కూడిన స్మార్ట్ ఏసీలను ఏప్రిల్ చివరికల్లా ప్రవేశపెడతామని లివ్‌ప్యూర్ ఫౌండర్ రాకేశ్ మల్హోత్రా వెల్లడించారు. యురేకా ఫోర్బ్స్ హెల్త్ కండీషనర్ల పేరుతో ఈ విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రైవేట్ లేబుల్ బ్రాండ్ మార్క్యూ క్రమంగా ఏసీల శ్రేణిని విస్తరిస్తోంది. నూతనంగా ఇన్సిగ్నియా శ్రేణిని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్స్ సంస్థ షార్ప్ ఏసీల విపణిలోకి రీ–ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఎల్టెక్ అప్లయెన్సెస్‌తో డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం చేసుకుంది. పోటీలో లేని చైనా.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 14 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒక్క చైనా వాటా అత్యధికంగా 8 కోట్ల యూనిట్లు ఉంది. ఏసీల తయారీలో సామర్థ్యం పరంగా చైనా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. అయినప్పటికీ భారత్‌లో ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాయి. దీనికి కారణం దేశంలో అమలులో ఉన్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) కఠిన ప్రమాణాలే. విద్యుత్‌ను గణనీయంగా ఆదాచేసే ఉపకరణాలను తయారు చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకోసారి బీఈఈ ఈ ప్రమాణాలను సవరిస్తోంది. అంటే అంత క్రితం 5 స్టార్ ఉన్న ఏసీ కాస్తా కొత్త ప్రమాణాలతో 3 స్టార్ అవుతుంది. ఈ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందేనని బ్లూస్టార్ జేఎండీ బి.త్యాగరాజన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రెండేళ్లకోసారి సాంకేతిక మార్పులు చేపట్టడం భారీ తయారీ సామర్థ్యం ఉన్న చైనా కంపెనీలకు సాధ్యం కాదని.. ఇది అధిక వ్యయంతో కూడినదని అన్నారు. అందుకే చైనా కంపెనీలు ఇక్కడ ప్రవేశించలేకపోతున్నాయని వివరించారు. అమలులో ఈ–వేస్ట్ రూల్స్..: పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ–వేస్ట్ (మేనేజ్మెంట్, హ్యాండ్లింగ్స్) రూల్స్‌ను 2012 మే 1 నుంచి అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. ఇందులో ఏసీలకు 2017–18 నుంచి ఈ నిబంధనలు వర్తించాయి. దీని ప్రకారం 10 ఏళ్ల క్రితం ఒక కంపెనీ తాను విక్రయించిన యూనిట్లలో 10 శాతం తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలు చేయాల్సిన యూనిట్లు 2021–22 నాటికి 50 శాతం కానుంది. రీప్లేస్మెంట్ వేగంగా అయ్యేందుకు కంపెనీలు ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. -
కూలర్స్.. భలే హాట్ గురూ!!
► కంపెనీలకు కలిసొచ్చిన భానుడి ప్రతాపం ► ఎండలతో పాటే పెరిగిన అమ్మకాలు ఈ మార్కెట్లోకి బ్లూస్టార్ వంటి ఏసీల కంపెనీలు కూడా.. ► మున్ముందు ఆన్లైన్ విక్రయాల వాటా పెరుగుతుందని ధీమా సాక్షి, బిజినెస్ బ్యూరో:- ఏడాదికేడాది ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భానుడు మే నెలలో చూపించాల్సిన పవర్‌ను ఈసారి మార్చి నుంచే మొదలెట్టాడు. మరి పరిస్థితేంటి? ఏసీలు ఉన్నవారి సంగతి సరే!! లేని వారి మాటో!? అందుకే ఈసారి కూలర్లు హాట్ కేకులయ్యాయి. సింఫనీ, బజాజ్ ఎలక్ట్రికల్, వోల్టాస్, ఉషా ఇంటర్నేషనల్, మహారాజా వైట్‌లైన్ వంటి కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తాయి. బ్రాండింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పరిస్థితి చూసిన ఏసీ కంపెనీలు... రూ.3,000 కోట్ల ఎయిర్ కూలర్ల విపణిలోకి ప్రవేశించటం విశేషం. రెండింతలు నమోదైన విక్రయాలు... అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూలర్ల విక్రయాలు బాగా పెరిగినట్లు బజాజ్ ఎలక్ట్రికల్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మార్కెటింగ్ హెడ్ (కన్సూమర్ ప్రొడక్ట్స్) అమిత్ సేథి చెప్పారు. ఒడిశా, బెంగాల్‌తో పాటు దక్షిణాదిలో కూలర్ల విక్రయాలు జోరుగా ఉన్నట్లు ఉషా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (అప్లయెన్సెస్) హర్విందర్ సింగ్ తెలిపారు. మొత్తంగా ఈ సీజన్ విక్రయాల్లో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ‘‘గతేడాది మంచి పనితీరు కనబరిచాం. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తాం’’ అని మహారాజా వైట్‌లైన్ సీఈవో సునీల్ వాద్వా తె లియజేశారు. 2016లో 1.5 లక్షలకు పైగా కూలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారాయన. గత ఏడాదితో పోలిస్తే మార్చి, ఏప్రిల్‌లో ఊహించని స్థాయిలో భారీ అమ్మకాలు నమోదైనట్లు టీఎంసీ బేగంపేట మేనేజర్ కె.శ్రీనివాస్ తెలియజేశారు. ‘‘100 శాతం వృద్ధి నమోదైంది’’ అని చెప్పారాయన. కొడితే సీజన్లోనే కొట్టాలి... కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం... కూలర్లను ఆఫ్ సీజన్లో కొనటానికి జనం ఇష్టపడరు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడే వీటికి డిమాండ్. ఇదే పరిశ్రమకు సవాలుగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సీజనల్ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన కొత్త ఉత్పత్తులను విడుదల చేశాయి. ఐ-ప్యూర్ పేరిట ప్రపంచంలో తొలిసారిగా మల్టీ స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ కూలర్లను సింఫనీ ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీకి కంపెనీ పేటెంటు దరఖాస్తు కూడా చేసింది. ‘‘పరిశ్రమలో అత్యధిక డిజైన్లు, ట్రేడ్ మార్కులు మాకే ఉన్నాయి’’ అని సింఫనీ సీఎండీ ఆచల్ బకేరి వెల్లడించారు. ఉషా కంపెనీ విండో కూలర్స్, టవర్ కూలర్స్, పర్సనల్ కూలర్స్ వంటి పలు విభాగాల్లో కొత్త ఉత్పత్తుల్ని తెచ్చింది. ఇవి ఆరోగ్యకరమైన జీవనానికి అనువుగా ఉంటాయని పేర్కొంది. ఇక మహారాజా కూడా ఇంధన పొదుపు ఫీచర్‌తో పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. మహారాజా కూలర్ల నిర్వహణ వ్యయం గంటకు రూ.2 ఉంటుందని, ఇది ఏసీల విషయంలో రూ.10 అని వాద్వా తెలిపారు. సరౌండ్ కూల్ టెక్నాలజీతో బజాజ్ ఎలక్ట్రికల్ తన ఉత్పత్తులను బ్రాండింగ్ చేస్తోంది. దిగ్గజ ఏసీ కంపెనీలు సైతం... ఏసీల తయారీలో ఉన్న దిగ్గజ కంపెనీ బ్లూ స్టార్ కూలర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. మూడేళ్లలో కూలర్ల వార్షిక అమ్మకాలు రూ.150 కోట్లకు చేర్చాలన్నది తమ లక్ష్యమని బ్లూస్టార్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ విభాగం ప్రెసిడెంట్ బి.త్యాగరాజన్ చెప్పారు. మరో దిగ్గజ సంస్థ వోల్టాస్ సైతం ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018 నాటికి సంస్థ అమ్మకాల్లో కూలర్ల వాటా 10 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో వోల్టాస్ ఒక లక్ష కూలర్లను విక్రయించింది. ఈ ఏడాది 2.5 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విక్రయాలు బాగుండే అవకాశముందని వోల్టాస్ ప్రెసిడెంట్ ప్రదీప్ బక్షి చెప్పారు. ఐటీ విడిభాగాల తయారీలో ఉన్న జీబ్రానిక్స్ సైతం కూలర్స్ విపణిలోకి ప్రవేశించింది. ఇక టైర్-1, టైర్-2 వంటి పట్టణాల్లోని విక్రయాలదే కీలకపాత్ర అని కంపెనీలు చెబుతున్నాయి. కరువు ఛాయలు కొంత ఆందోళన కలిగిస్తున్నా, వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని చెప్పటంతో విక్రయాలపై ధీమాగా ఉన్నట్లు సింగ్ చెప్పారు. డిస్కౌంట్లతో ఆన్లైన్లో... తమ విక్రయాల్లో ఈ-కామర్స్ వాటా 10 శాతంగా ఉందని వాద్వా చెప్పారు. అయితే ఈ-కామర్స్ వ్యవస్థలో ఎయిర్ కూలర్ల రవాణా పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉషా కంపెనీ ఈ మధ్యనే ఈ-టెయిలింగ్‌లో అడుగుపెట్టింది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముతోంది. మున్ముందు వినూత్న ఉత్పత్తులతో ఆన్లైన్ విభాగంలో అధిక వాటా కైవసం చేసుకుంటామని హర్విందర్ సింగ్ చెప్పారు. కాగా, భారత ఎయిర్ కూలర్ల మార్కెట్ 15-20 శాతం వృద్ధి రేటుతో రూ.3,000 కోట్లు ఉన్నట్టు అంచనా. ఇందులో వ్యవస్థీకృత రంగ సంస్థల వాటా 30 శాతం. మొత్తం అమ్మకాల్లో 60 శాతం ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలవి కాగా... వ్యవస్థీకృత రంగంలో విలువ పరంగా 50 శాతం వాటా తమదేనని సింఫనీ చెబుతోంది.