ఏసీల తయారీ హబ్‌గా శ్రీ సిటీ | Sri City as manufacturing hub for ACs Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏసీల తయారీ హబ్‌గా శ్రీ సిటీ

Published Tue, Jun 7 2022 4:22 AM | Last Updated on Tue, Jun 7 2022 2:59 PM

Sri City as manufacturing hub for ACs Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎయిర్‌ కండిషనర్ల (ఏసీ) తయారీ హబ్‌గా ఎదుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి ఏసీ తయారీ యూనిట్లు తిరుపతి జిల్లా శ్రీసిటీకి క్యూ కడుతున్నాయి. గత ఆరు నెలల్లోనే ఆరు అంతర్జాతీయ ఏసీ తయారీ, విడిభాగాల తయారీ సంస్థలు ఇక్కడకు వచ్చాయి.

బ్లూస్టార్, డైకిన్‌ వంటి సంస్థలతో పాటు 20కిపైగా బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేసే ఆంబర్, హావెల్స్, ఈప్యాక్‌ డ్యూరబుల్స్, పానాసోనిక్‌–యాంకర్‌ సంస్థలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా రూ.3,755 కోట్ల పెట్టుబడులు రానుండగా, 9,700 మందికి ఉపాధి లభిస్తుంది.

ఇందులో బ్లూస్టార్‌ ఏడాదికి 12 లక్షల ఏసీల సామర్థ్యంతో, డైకిన్‌ 15 లక్షల యూనిట్ల సామర్థ్యంతో పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. పానాసోనిక్‌ యాంకర్‌ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. మిగిలిన పరిశ్రమల నిర్మాణం వేగంగా జరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో భూమి పూజ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని బ్లూస్టార్‌ ప్రతినిధి ‘సాక్షి’కి వివరించారు. 

ఒక్క శ్రీ సిటీకే రూ.8,349 కోట్ల పెట్టుబడులు 
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008 ఆగస్టు 8న ప్రారంభమైన శ్రీ సిటీలో ఇప్పటివరకు 28 దేశాలకు చెందిన 200కు పైగా సంస్థల పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50,000 మందికి ఉపాధి లభిస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీ సిటీ గత మూడేళ్లలో భారీగా పెట్టుబడులను ఆకర్షించింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు 38 సంస్థలు కొత్త పరిశ్రమలను నెలకొల్పాయి. ఇందులో కింబెర్లీ క్లార్క్, ఆల్‌స్టామ్‌ రెండో దశ విస్తరణ చేపట్టాయి. సీఆర్‌ఆర్‌సీ, ఎల్‌జీ పాలిమర్స్, కాస్‌మాక్స్‌ బ్యాటరీస్, ఓజి ఇండియా ప్యాకేజింగ్, ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్స్‌ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో 14 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

కోవిడ్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేవలం 14 నెలల రికార్డు సమయంలో యూనిట్‌ను ప్రారంభించినట్లు నోవా ఎయిర్‌ ప్రతినిధులు తెలిపారు. 2020 డిసెంబర్‌ 18న పనులు ప్రారంభించి 2021 నవంబర్‌లో సీఎం చేతులు మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభించారు. ఇక్కడ 220 టన్నులు ఆక్సిజన్‌తో పాటు పారిశ్రామిక అవసరాలకు ఇతర వాయువులను తయారు చేస్తారు.

పవన విద్యుత్‌కు తయరీలో కీలకమైన విండ్‌ మిల్‌ గేర్‌ బాక్స్‌లను తయారు చేసే చైనాకు చెందిన ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్‌ పరిశ్రమ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం క్వాలిటీ ఆడిటింగ్‌ జరుగుతోందని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. శ్రీ సిటీలో ఈ మూడేళ్లలో కొత్తగా రూ.8,349 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 21,540 మందికి ఉపాధి లభిస్తోంది.

మూడేళ్లలో రాష్ట్రంలో రూ.36,313 కోట్ల పెట్టుబడులు
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 96 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 56,681 మందికి ఉపాధి లభిస్తోంది. మరో 36,000 కోట్ల విలువైన పెట్టుబడులతో 52 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే మరో 77 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

ఆర్సిలర్‌ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా, సెంచురీ ఫ్లైవుడ్స్, శ్రీ సిమెంట్స్, గ్రీన్‌కో ఎనర్జీ, అరబిందో వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ మూడేళ్లలో 26,922 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంస్‌ఈ) యూనిట్లు రాష్ట్రంలో రూ.7,550 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 1.76 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement