Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్‌ఐఈఎల్‌ఐటీ.. | Tirupati: Site Inspection For Establishment of NIELIT | Sakshi
Sakshi News home page

Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్‌ఐఈఎల్‌ఐటీ..

Published Tue, Nov 15 2022 7:16 PM | Last Updated on Tue, Nov 15 2022 7:19 PM

Tirupati: Site Inspection For Establishment of NIELIT - Sakshi

ఎస్వీయూనివర్సిటీలో సిమెన్స్‌ భవనాన్ని పరిశీలిస్తున్న ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి, నైలెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణమూర్తి, సభ్యులు

తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగా అవతరిస్తోంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది. ఇప్పుడు సరికొత్తగా మానవ వనరుల అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడం, యువతకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించడం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో రాణించేలా వివిధ కోర్సులు అందించడమే లక్ష్యంగా నైలెట్‌ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  


సాక్షి ప్రతినిధి, తిరుపతి:
వెంకన్న పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ఎన్‌ఐఈఎల్‌ఐటీ బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఐఐడీటీ కేంద్రాన్ని బృందం పరిశీలించింది. తిరుపతిలో ఎన్‌ఐఈఎల్‌ఐటీ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కమిటీ చైర్మన్, సంస్థ డైరెక్టర్‌ స్పష్టం చేశారు. 


నైలెట్‌ అంటే ఏంటి? దాని ముఖ్యఉద్దేశాలు 

► ఎన్‌ఐఈఎల్‌ఐటీ(నైలెట్‌) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం.

► ఎన్‌ఐఈఎల్‌ఐటీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో మానవనరులు అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలు అందుకు ఉపయోగపడే కోర్సులు అందించడం ముఖ్య ఉద్దేశం.

► ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో కూడిన శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తుంది. 
 
ఎన్‌ఐఈఎల్‌ఐటీ అందిస్తున్న కోర్సులు 
ఫార్మల్‌ కోర్సుల్లో భాగంగా మూడేళ్ల బ్యాచిలర్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్, బీఎస్సీ హానర్స్‌ కంప్యూటర్‌ సైన్స్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎలక్ట్రానిక్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, వి.ఎల్‌.ఎస్‌.ఐ డిజైన్, నాన్‌ ఫార్మల్‌ రంగంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్, హార్డ్‌వేర్, సైబర్‌ చట్టం, సైబర్‌ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్‌ కంప్యూటరింగ్, ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ – మ్యానుఫ్యాక్చరింగ్, ఇ–వ్యర్థాలు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బిగ్‌ డేటా, బ్లాక్‌ చైన్, డేటా అనలిటిక్స్, ఇ–గవర్నెన్స్‌ వంటి కోర్సులు అందిస్తుంది.  దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ప్రాచుర్యం పొందిన కోర్సులను ఉమ్మడి భాగస్వామ్యంలో అందుబాటులోకి తీసుకురావడం నైలెట్‌ ప్రత్యేకత. 

ఎన్‌ఐఈఎల్‌ఐటీ తిరుపతిలో నెలకొల్పడం ద్వారా వృత్తి విద్య కోర్సుల తోపాటు అనుదినం మారూతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం అందుకు అవసరమైన కోర్సులు నేర్చుకోనేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తగిన నైపుణ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అర్హతలను బట్టి అవకాశాలను కూడా కల్పిస్తుంది. తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉండడంతో విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం 
మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లాలో త్వరలో ఐటీ కాన్సెప్ట్‌ సిటీ నెలకొల్పబోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీసిటీ, రేణిగుంటలో ఈఎంసీ, మేనకూరు పారిశ్రామికవాడలో నెలకొల్పిన దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. 
– మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement