site visit
-
Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్ఐఈఎల్ఐటీ..
తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగా అవతరిస్తోంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది. ఇప్పుడు సరికొత్తగా మానవ వనరుల అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడం, యువతకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో రాణించేలా వివిధ కోర్సులు అందించడమే లక్ష్యంగా నైలెట్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వెంకన్న పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ఎన్ఐఈఎల్ఐటీ బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఐఐడీటీ కేంద్రాన్ని బృందం పరిశీలించింది. తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కమిటీ చైర్మన్, సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు. నైలెట్ అంటే ఏంటి? దాని ముఖ్యఉద్దేశాలు ► ఎన్ఐఈఎల్ఐటీ(నైలెట్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం. ► ఎన్ఐఈఎల్ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మానవనరులు అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలు అందుకు ఉపయోగపడే కోర్సులు అందించడం ముఖ్య ఉద్దేశం. ► ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో కూడిన శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఐఈఎల్ఐటీ అందిస్తున్న కోర్సులు ఫార్మల్ కోర్సుల్లో భాగంగా మూడేళ్ల బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ, వి.ఎల్.ఎస్.ఐ డిజైన్, నాన్ ఫార్మల్ రంగంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్‌వేర్, సైబర్ చట్టం, సైబర్ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటరింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ – మ్యానుఫ్యాక్చరింగ్, ఇ–వ్యర్థాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇ–గవర్నెన్స్ వంటి కోర్సులు అందిస్తుంది. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ప్రాచుర్యం పొందిన కోర్సులను ఉమ్మడి భాగస్వామ్యంలో అందుబాటులోకి తీసుకురావడం నైలెట్ ప్రత్యేకత. ఎన్ఐఈఎల్ఐటీ తిరుపతిలో నెలకొల్పడం ద్వారా వృత్తి విద్య కోర్సుల తోపాటు అనుదినం మారూతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం అందుకు అవసరమైన కోర్సులు నేర్చుకోనేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తగిన నైపుణ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అర్హతలను బట్టి అవకాశాలను కూడా కల్పిస్తుంది. తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉండడంతో విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లాలో త్వరలో ఐటీ కాన్సెప్ట్ సిటీ నెలకొల్పబోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీసిటీ, రేణిగుంటలో ఈఎంసీ, మేనకూరు పారిశ్రామికవాడలో నెలకొల్పిన దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. – మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
విక్రయాలలో సైట్ ఆఫీస్ కీలకం
సాక్షి, హైదరాబాద్: షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు మన చూపు అందంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దిన డిస్ప్లే వస్తువులపై పడుతుంది. వెంటనే ఆయా వస్తువుల కొనేందుకు లేదా ఎంక్వైరీకి ప్రయత్నిస్తాం. ఇదే తరహాలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ సైట్ ఆఫీస్ డిస్ ప్లే లాంటిది. శక్తివంతమైన మార్కెటింగ్ సాధనమిది. లగ్జరీ గృహాలతో పాటూ అఫర్డబుల్, మిడ్ సైజ్ గృహాల విక్రయాలలోనూ సైట్ ఆఫీస్ అనేది అత్యంత కీలకంగా మారింది. మన దేశంలో గృహ విక్రయాలు పోర్టా క్యాబిన్స్ లేదా నమూనా ఫ్లాట్ ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తుంటారు. సేల్స్ ఆఫీస్ అనేది ముందుగా లగ్జరీ ప్రాజెక్ట్‌లలో డెవలపర్లు అనుభవం, ప్రాజెక్ట్ ఆఫర్ల గురించి ఏర్పాటు చేసేవాళ్లు. తర్వాతి కాలంలో ఈ కాన్సెప్ట్ అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు కూడా పాకింది. ఎక్కువ మంది కస్టమర్లకు వసతి కల్పించడానికి, విక్రయాలను క్రమబద్దీకరించడానికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి కొత్త ప్రాజెక్ట్ సైట్లో సేల్స్ ఆఫీస్ ఉంటుంది. సేల్స్, సైట్ ఆఫీస్ లేదా సేల్స్ గ్యాలరీ అనేది మొత్తం రియల్ ఎస్టేట్ లావాదేవీలో సమగ్రమైన, కీలకమైన విభాగం. ఆకర్షణీయమైన, సమగ్ర నిర్వహణ సేల్స్ ఆఫీస్ లేకపోతే విక్రయాలు కూడా గణనీయంగా క్షీణిస్తాయి. ప్రాజెక్ట్‌లోని ఉత్తమ ఫీచర్ల ప్రదర్శన, ప్రయోజనాల డిస్ప్లే, వాకిన్స్, సైట్ విజిట్స్ నిర్వహణ వంటివి సేల్స్ ఆఫీస్ ప్రత్యేకత. మార్కెటింగ్‌లో కీలకం.. ప్రాపర్టీల మార్కెటింగ్‌లో సేల్స్ ఆఫీస్ కీలకమైన విభాగంగా మారింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌పై కొనుగోలుదారులలో మంచి అభిప్రాయం కలిగేది సైట్ ఆఫీస్ నుంచే మొదలవుతుంది. మార్కెటింగ్ బృందానికి అప్పటికే చేతిలోకి రాని ప్రాజెక్ట్‌లోని ఫీచర్లు, ప్రయోజనాలు కస్టమర్లకు అనుభవపూర్వకం చేసే అవకాశం కలుగుతుంది. అభివృద్ధి పనులు జరుగుతున్న దశల వారీగా సైట్ ఆఫీస్‌లో ప్రదర్శించే వీలుంటుంది. ఆయా ప్రాజెక్ట్‌లో తాము భాగస్వామ్యమైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే ఓ ఊహాజనిత చిత్రాన్ని చూపించేదే సైట్ ఆఫీస్. కొందరు కస్టమర్లు పలుమార్లు సైట్ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలం ప్రభావవంతంగా, క్రియాత్మకంగా ఉండాలి. రియల్టీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రోజు నుంచి 2–3 ఏళ్ల పాటు సాగుతాయి. ప్రాజెక్ట్‌లోని ఇన్వెంటరీలో 90 శాతం విక్రయాలయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుందని అనరాక్ గ్రూప్ స్ట్రాటర్జీ హెడ్ సునీల్ మిశ్రా తెలిపారు. ► ప్రాజెక్ట్ నిర్మాణం, విక్రయాలు పూర్తయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుంది. నిర్మాణ సంస్థకు, కొనుగోలుదారులకు మధ్య వారధి లాంటివి సేల్స్ ఆఫీస్. ఇక్కడి నుంచే కస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడంతో పాటూ ప్రాజెక్ట్ ఫీచర్లను ప్రదర్శిస్తారు. దీంతో పాటు ధర నిర్ణయం, లావాదేవీలు కూడా జరుగుతాయి. ప్రవాస కస్టమర్లు మినహా వంద శాతం ప్రాపర్టీ లావాదేవీలు సైట్ ఆఫీస్‌ల నుంచే జరుగుతాయి. సేల్స్ ఆఫీస్ అనేది డెవలపర్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మాత్రమే కాదు.. కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్, 80–85 శాతం కస్టమర్ల ఫిజికల్ ప్రాపర్టీ అనుభవం ఇక్కడ్నుంచే జరుగుతాయి. మంచి సేల్స్ ఆఫీస్ కారణంగా కస్టమర్ల అంతర్గత ప్రచారంతో సైట్ విజిట్స్ పెరుగుతాయి. విక్రయాల నిష్పత్తి 4–5% వరకు వృద్ధి చెందుతాయి. కొత్త మార్కెట్లలో కూడా డెవలపర్ బ్రాండ్‌ను తెలిపేది సైట్ ఆఫీసులే. గ్రేడ్–ఏ, బీ డెవలపర్లు సేల్స్ ఆఫీస్‌ల నిర్వహణతో 50% విక్రయాలను మెరుగుపర్చుకుంటున్నారు. సేల్స్ ఆఫీస్ క్లబ్ హౌస్‌గా.. మంచి సేల్స్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 0.5 శాతం అవుతుంది. చాలా మంది డెవలపర్లు తాత్కాలిక సేల్స్ ఆఫీస్‌ను ఏర్పాటు కంటే శాశ్వత నిర్మాణాన్ని చేపడతారు. వాస్తవానికి ఇది మంచి నిర్ణయం. ప్రాజెక్ట్ పూర్తయ్యాక సేల్స్ ఆఫీస్‌ను క్లబ్ హౌస్‌గా మార్చేసి.. హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తారు. దీంతో సైట్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాధారణంగా సేల్స్ ఆఫీస్ పరిమాణం 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటుంది. కొన్ని టౌన్‌షిప్‌లలో 8 వేల నుంచి 10 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి కూడా ఉంటాయి. -
‘ఏలేరు’ లో లిఫ్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
గోకవరం : మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంతో పాటు ఏజెన్సీలో సాగునీరు అందని పలు ప్రాంతాలకు నీరందించేందుకు ఏలేరు రిజర్వాయిర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఏపీఎస్ఐడీసీ ఎస్ఈ త్రివిక్రమరావుతో కలిసి స్థల పరిశీలన చేశారు. గోకవరం మండలం మల్లవరం, గంగవరం మండలం ట్యాంకుబీడు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు రిజర్వాయిర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు అనువుగా ఉన్న పులికొండ ప్రదేశాన్ని పరిశీలించి స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట మండలం గోవిందపురం, గోకవరం మండలం మల్లవరంతో పాటు, ఏజెన్సీ సరిహద్దు గ్రామాలైన మొల్లేరు, పిడతమామిడి గ్రామాలకు సాగునీరందించేందుకు ఈ లిఫ్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. లిఫ్ట్ ఏర్పాటు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి, ఇరిగేషన్ మంత్రికి చెప్పడంతో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిలో భాగంగా ఏలేరు రిజర్వాయిర్‌లో స్థల పరిశీలన చేశామన్నారు. త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే ఖరీఫ్‌కు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే పాములేరు వాగును సీతపల్లి వాగులోకి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడతోందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు ఎస్ఈ త్రివిక్రమరావు మాట్లాడుతూ ఏలేరు జలాశయంలో లిఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు ఆరు నుంచి ఏడువేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు జనపరెడ్డి బాబు, దొడ్డా విజయ్, ఉంగరాల రాము, ఎస్వీఎస్ అప్పలరాజు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం భూపతిపాలెం గ్రామంలో గోవిందపురానికి చెందిన రైతులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.