‘ఏలేరు’ లో లిఫ్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
Published Thu, Oct 13 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
గోకవరం :
మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంతో పాటు ఏజెన్సీలో సాగునీరు అందని పలు ప్రాంతాలకు నీరందించేందుకు ఏలేరు రిజర్వాయిర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఏపీఎస్‌ఐడీసీ ఎస్‌ఈ త్రివిక్రమరావుతో కలిసి స్థల పరిశీలన చేశారు. గోకవరం మండలం మల్లవరం, గంగవరం మండలం ట్యాంకుబీడు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు రిజర్వాయిర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు అనువుగా ఉన్న పులికొండ ప్రదేశాన్ని పరిశీలించి స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట మండలం గోవిందపురం, గోకవరం మండలం మల్లవరంతో పాటు, ఏజెన్సీ సరిహద్దు గ్రామాలైన మొల్లేరు, పిడతమామిడి గ్రామాలకు సాగునీరందించేందుకు ఈ లిఫ్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. లిఫ్ట్ ఏర్పాటు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి, ఇరిగేషన్ మంత్రికి చెప్పడంతో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిలో భాగంగా ఏలేరు రిజర్వాయిర్‌లో స్థల పరిశీలన చేశామన్నారు. త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే ఖరీఫ్‌కు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే పాములేరు వాగును సీతపల్లి వాగులోకి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడతోందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు ఎస్‌ఈ త్రివిక్రమరావు మాట్లాడుతూ ఏలేరు జలాశయంలో లిఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు ఆరు నుంచి ఏడువేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు జనపరెడ్డి బాబు, దొడ్డా విజయ్, ఉంగరాల రాము, ఎస్‌వీఎస్ అప్పలరాజు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం భూపతిపాలెం గ్రామంలో గోవిందపురానికి చెందిన రైతులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.
Advertisement