yeleru reservoir lift
-
బుడమేరు-ఏలేరు.. చంద్రబాబు పాపాలే: వైఎస్ జగన్
కాకినాడ, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ ఆయన పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వరదనీటి నియంత్రణలో పూర్తిగా విఫలయం అయ్యారు. భారీగా వర్షాలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి ఆగష్టు 31వ తేదీనే సమాచారం అందింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఇలాంటి అలర్ట్ రాగానే ప్రభుత్వం సమీక్ష చేయాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ సెక్రటరీలతో సమీక్ష జరపాలి. కానీ, చంద్రబాబు కనీసం కలెక్టర్లతో కూడా రివ్యూ చేయలేదు. ఆయనకు ఏమాత్రం మానవతా విలువలు ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించేవారు..ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆ మాత్రం తెలియదా?.. వచ్చే వరదకు అనుగుణంగా ఏలేరు రిజర్వాయర్‌లో ఫ్లడ్ కుషన్ ఉంచుకోవాలి. ప్రభుత్వానికి ఇంత సమాచారం ఉన్నా తగిన చర్యలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ను చేయలేదు. ఏలేరు పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు అయితే, ఆగస్టు 31 నాటికే దాదాపుగా 18 టీఎంసీలు ఉంది. సెప్టెంబరు 1 నాటికి 9,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఏలేరు ఔట్‌ఫ్లో కాల్వ కెపాసిటీ 14వేల క్యూసెక్కులు కాబట్టి, వచ్చిన నీరు వచ్చినట్టు వదిలేయాలి. కానీ, 300 క్యూసెక్కులు మాత్రమే ఉంది. తర్వాత మూడు నాలుగు రోజుల్లో వదర వచ్చినా అవుట్‌ఫ్లో కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే ఉంది. పై నుంచి నీళ్లు వస్తున్నా, లెక్క చేయకుండా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించారు. క్రమంగా రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. సెప్టెంబరు 9న 45వేలు క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తే 21,500 క్యూసెక్కులు వదిలారు. సెప్టెంబరు 10న 27,275 క్యూసెక్కులు వదిలారు. ఇది మానవ తప్పిదంతో జరిగింది. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడంలేదు.ఏలేరూ రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫ్లోను ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు. రిజర్వాయర్ నిండేవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత కిందకు వదిలారు. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఇది మ్యాన్‌మేడ్ ఫ్లడ్స్ కాక ఇంకేంటి?.అందుకే ఏలేరు ఆధునీకరణ పనులు చేయలేకపోయాం.. ఒకవైపు ఈ వాస్తవాలు ఇలా ఉంటే.. ఏలేరు ఆధునికీకరణపైనా చంద్రబాబు అబద్దాలు చెప్పారు. ఏ కెనాల్ ఆధునికీకరణ అయినా, అందులో నీళ్లు లేనప్పుడు, క్రాప్ హాలీడే ప్రకటిస్తే తప్ప, అది సాధ్యం కాదు. ఏలేరుకు ఆధునీకరణ పనులను 2008లో నిధులు కేటాయించి మరీ దివంగత మహానేత వైఎస్సార్ ప్రారంభించారు. ఆయన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2014లో ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక, అంచనాలు పెంచారు తప్ప, పనులు మాత్రం చేయలేదు. .. నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు కూడా పెద్దగా లేవు. 2015లో అంచనాలు రూ.295 కోట్లకు పెంచినా, పనులు పూర్తి చేయలేదు. మా హయాంలో ప్రతీ సంవత్సరం వర్షాలు పడి రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయి. ఆ టైంలో క్రాప్ హాలీడే ప్రకటించడం ఇబ్బంది అవుతుందనే.. కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. మరి చంద్రబాబు హయాంలో నిత్యం కరువే కదా. ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు?. చేయాల్సింది చేయకపోగా.. గత ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారు’’ అని జగన్ మండిపడ్డారు. -
మంత్రి చెబితే అంతేమరి!
సాక్షి, అమరావతి: ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణ రెండో దశ టెండర్లను తన సన్నిహితుడికి కట్టబెట్టి, రూ.40 కోట్లకు పైగా కమీషన్లు కొల్లగొల్లడానికి కీలక మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ పనులకు రూ.200 కోట్లు అంతర్గత అంచనా విలువ(ఐబీఎం)గా నిర్ణయించి శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. బిడ్ దాఖలు చేయడానికి ఈ నెల 25ను తుది గడువుగా నిర్ణయించారు. 26న టెక్నికల్(సాంకేతిక) బిడ్, 30న ప్రైస్(ఆర్థిక) బిడ్ తెరిచి టెండర్లను ఖరారు చేసి, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. జలవనరుల శాఖలో ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో నిర్వహించిన టెండర్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ టెండర్లలో ఈ నెల 19న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా ప్రీ బిడ్ సమావేశంలో బెదిరించి, సన్నిహితునికే పనులు కట్టబెట్టేందుకు కీలక మంత్రి స్కెచ్ వేసినట్లు సమాచారం. సింగిల్ బిడ్‌ను ఆమోదించాలట! తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కింద 67,614 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. దాంతో ఏలేరు ఆధునికకీరణ పనులను 2007లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ పనులకు ఇప్పటికే రూ.102.70 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కింద రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఆధునికకీరణ పనులకు గతేడాది మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను తనకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు కీలక మంత్రి వ్యూహం రచించారు. ఈపీసీ విధానంలో గతేడాది పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ కాంట్రాక్టర్లను బెదిరించారు. దాంతో కీలక మంత్రి సన్నిహితుడు మినహా ఇతరులెవరూ బిడ్లు దాఖలు చేయలేదు. తన సన్నిహితుడు దాఖలు చేసిన సింగిల్ బిడ్‌నే ఆమోదించాలని ఏలేరు రిజర్వాయర్ ఎస్ఈపై మంత్రి ఒత్తిడి తెచ్చారు. దాంతో సింగిల్ బిడ్‌ను ఆమోదించిన ఎస్ఈ.. ఆ పనులు అప్పగించడానికి అనుమతి కోరుతూ హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం సింగిల్ బిడ్‌ను ఆమోదించాలని ఎలా ప్రతిపాదిస్తారని జలవనరుల శాఖ అధికారులపై హైపవర్ కమిటీ చైర్మన్, సీఎస్ దినేష్‌కుమార్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఆయనను ప్రభుత్వం ఇటీవల తప్పించింది. ఎల్ఎస్–ఓపెన్ విధానం తరహాలోనే ఈపీసీ విధానంలో నిర్వహించిన టెండర్లను ఖరారు చేసే బాధ్యతను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పట్టువదలని అక్రమార్కుడు హైపవర్ కమిటీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తప్పించిన నేపథ్యంలో సీవోటీకి ప్రతిపాదనలు పంపి.. సన్నిహిత కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని జలవనరుల శాఖపై కీలక మంత్రి ఒత్తిడి తెచ్చారు. నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాను సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. దాంతో అధికారులు విచిత్రమైన నిబంధనలు పెట్టారు. ఒకరి కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి(జాయింట్ వెంచర్) టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధనలు విధిస్తున్న జలవనరుల శాఖ.. ఏలేరు ఆధునికకీరణ టెండర్లలో మాత్రం ముగ్గురు కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విదేశీ కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేయడానికి అనర్హులని మెలిక పెట్టింది. మంత్రి బెదిరింపుల నేపథ్యంలో బిడ్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. మంత్రి సన్నిహిత కాంట్రాక్టర్ మాత్రమే బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్ర లేకపోవడంతో ఈసారి సింగిల్ బిడ్‌నే ఆమోదించి, సదరు సన్నిహితుడికి పనులు కట్టబెట్టనున్నారు. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన మంత్రికి రూ.40 కోట్లకుపైగా కమీషన్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది. -
‘ఏలేరు’ లో లిఫ్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
గోకవరం : మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంతో పాటు ఏజెన్సీలో సాగునీరు అందని పలు ప్రాంతాలకు నీరందించేందుకు ఏలేరు రిజర్వాయిర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఏపీఎస్ఐడీసీ ఎస్ఈ త్రివిక్రమరావుతో కలిసి స్థల పరిశీలన చేశారు. గోకవరం మండలం మల్లవరం, గంగవరం మండలం ట్యాంకుబీడు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు రిజర్వాయిర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు అనువుగా ఉన్న పులికొండ ప్రదేశాన్ని పరిశీలించి స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట మండలం గోవిందపురం, గోకవరం మండలం మల్లవరంతో పాటు, ఏజెన్సీ సరిహద్దు గ్రామాలైన మొల్లేరు, పిడతమామిడి గ్రామాలకు సాగునీరందించేందుకు ఈ లిఫ్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. లిఫ్ట్ ఏర్పాటు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి, ఇరిగేషన్ మంత్రికి చెప్పడంతో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిలో భాగంగా ఏలేరు రిజర్వాయిర్‌లో స్థల పరిశీలన చేశామన్నారు. త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే ఖరీఫ్‌కు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే పాములేరు వాగును సీతపల్లి వాగులోకి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడతోందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు ఎస్ఈ త్రివిక్రమరావు మాట్లాడుతూ ఏలేరు జలాశయంలో లిఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు ఆరు నుంచి ఏడువేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు జనపరెడ్డి బాబు, దొడ్డా విజయ్, ఉంగరాల రాము, ఎస్వీఎస్ అప్పలరాజు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం భూపతిపాలెం గ్రామంలో గోవిందపురానికి చెందిన రైతులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.