బుడమేరు తరహాలోనే ఏలూరు వరదలు
ప్రభుత్వానికి సమాచారం ఉన్న ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్
ప్రజలు ఇబ్బంది పడాలనే చంద్రబాబు తాపత్రయం
ఏలేరు ఆధునీకరణపైనా చంద్రబాబు అబద్ధాలు
మా హయాంలోనే అందుకే ఏలేరు పనులు జరగలేదు
ఏలేరు బాధితుల పరామర్శలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు
కాకినాడ, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ ఆయన పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వరదనీటి నియంత్రణలో పూర్తిగా విఫలయం అయ్యారు. భారీగా వర్షాలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి ఆగష్టు 31వ తేదీనే సమాచారం అందింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఇలాంటి అలర్ట్ రాగానే ప్రభుత్వం సమీక్ష చేయాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ సెక్రటరీలతో సమీక్ష జరపాలి. కానీ, చంద్రబాబు కనీసం కలెక్టర్లతో కూడా రివ్యూ చేయలేదు. ఆయనకు ఏమాత్రం మానవతా విలువలు ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించేవారు..
ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆ మాత్రం తెలియదా?
.. వచ్చే వరదకు అనుగుణంగా ఏలేరు రిజర్వాయర్‌లో ఫ్లడ్ కుషన్ ఉంచుకోవాలి. ప్రభుత్వానికి ఇంత సమాచారం ఉన్నా తగిన చర్యలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్‌మెంట్‌ను చేయలేదు. ఏలేరు పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు అయితే, ఆగస్టు 31 నాటికే దాదాపుగా 18 టీఎంసీలు ఉంది. సెప్టెంబరు 1 నాటికి 9,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఏలేరు ఔట్‌ఫ్లో కాల్వ కెపాసిటీ 14వేల క్యూసెక్కులు కాబట్టి, వచ్చిన నీరు వచ్చినట్టు వదిలేయాలి.
కానీ, 300 క్యూసెక్కులు మాత్రమే ఉంది. తర్వాత మూడు నాలుగు రోజుల్లో వదర వచ్చినా అవుట్‌ఫ్లో కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే ఉంది. పై నుంచి నీళ్లు వస్తున్నా, లెక్క చేయకుండా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించారు. క్రమంగా రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. సెప్టెంబరు 9న 45వేలు క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తే 21,500 క్యూసెక్కులు వదిలారు. సెప్టెంబరు 10న 27,275 క్యూసెక్కులు వదిలారు. ఇది మానవ తప్పిదంతో జరిగింది. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడంలేదు.
ఏలేరూ రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫ్లోను ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు. రిజర్వాయర్ నిండేవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత కిందకు వదిలారు. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఇది మ్యాన్‌మేడ్ ఫ్లడ్స్ కాక ఇంకేంటి?.
అందుకే ఏలేరు ఆధునీకరణ పనులు చేయలేకపోయాం
.. ఒకవైపు ఈ వాస్తవాలు ఇలా ఉంటే.. ఏలేరు ఆధునికీకరణపైనా చంద్రబాబు అబద్దాలు చెప్పారు. ఏ కెనాల్ ఆధునికీకరణ అయినా, అందులో నీళ్లు లేనప్పుడు, క్రాప్ హాలీడే ప్రకటిస్తే తప్ప, అది సాధ్యం కాదు. ఏలేరుకు ఆధునీకరణ పనులను 2008లో నిధులు కేటాయించి మరీ దివంగత మహానేత వైఎస్సార్ ప్రారంభించారు. ఆయన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2014లో ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక, అంచనాలు పెంచారు తప్ప, పనులు మాత్రం చేయలేదు.
.. నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు కూడా పెద్దగా లేవు. 2015లో అంచనాలు రూ.295 కోట్లకు పెంచినా, పనులు పూర్తి చేయలేదు. మా హయాంలో ప్రతీ సంవత్సరం వర్షాలు పడి రిజర్వాయర్‌లు నిండుగా ఉన్నాయి. ఆ టైంలో క్రాప్ హాలీడే ప్రకటించడం ఇబ్బంది అవుతుందనే.. కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. మరి చంద్రబాబు హయాంలో నిత్యం కరువే కదా. ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు?. చేయాల్సింది చేయకపోగా.. గత ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారు’’ అని జగన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment