ఏలేరు రిజర్వాయర్
సాక్షి, అమరావతి: ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణ రెండో దశ టెండర్లను తన సన్నిహితుడికి కట్టబెట్టి, రూ.40 కోట్లకు పైగా కమీషన్లు కొల్లగొల్లడానికి కీలక మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ పనులకు రూ.200 కోట్లు అంతర్గత అంచనా విలువ(ఐబీఎం)గా నిర్ణయించి శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. బిడ్ దాఖలు చేయడానికి ఈ నెల 25ను తుది గడువుగా నిర్ణయించారు. 26న టెక్నికల్(సాంకేతిక) బిడ్, 30న ప్రైస్(ఆర్థిక) బిడ్ తెరిచి టెండర్లను ఖరారు చేసి, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. జలవనరుల శాఖలో ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో నిర్వహించిన టెండర్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ టెండర్లలో ఈ నెల 19న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా ప్రీ బిడ్ సమావేశంలో బెదిరించి, సన్నిహితునికే పనులు కట్టబెట్టేందుకు కీలక మంత్రి స్కెచ్ వేసినట్లు సమాచారం.
సింగిల్ బిడ్‌ను ఆమోదించాలట!
తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కింద 67,614 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. దాంతో ఏలేరు ఆధునికకీరణ పనులను 2007లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ పనులకు ఇప్పటికే రూ.102.70 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కింద రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఆధునికకీరణ పనులకు గతేడాది మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను తనకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు కీలక మంత్రి వ్యూహం రచించారు. ఈపీసీ విధానంలో గతేడాది పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ కాంట్రాక్టర్లను బెదిరించారు. దాంతో కీలక మంత్రి సన్నిహితుడు మినహా ఇతరులెవరూ బిడ్‌లు దాఖలు చేయలేదు. తన సన్నిహితుడు దాఖలు చేసిన సింగిల్ బిడ్‌నే ఆమోదించాలని ఏలేరు రిజర్వాయర్ ఎస్‌ఈపై మంత్రి ఒత్తిడి తెచ్చారు. దాంతో సింగిల్ బిడ్‌ను ఆమోదించిన ఎస్‌ఈ.. ఆ పనులు అప్పగించడానికి అనుమతి కోరుతూ హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం
సింగిల్ బిడ్‌ను ఆమోదించాలని ఎలా ప్రతిపాదిస్తారని జలవనరుల శాఖ అధికారులపై హైపవర్ కమిటీ చైర్మన్, సీఎస్ దినేష్‌కుమార్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఆయనను ప్రభుత్వం ఇటీవల తప్పించింది. ఎల్‌ఎస్–ఓపెన్ విధానం తరహాలోనే ఈపీసీ విధానంలో నిర్వహించిన టెండర్లను ఖరారు చేసే బాధ్యతను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది.
పట్టువదలని అక్రమార్కుడు
హైపవర్ కమిటీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తప్పించిన నేపథ్యంలో సీవోటీకి ప్రతిపాదనలు పంపి.. సన్నిహిత కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని జలవనరుల శాఖపై కీలక మంత్రి ఒత్తిడి తెచ్చారు. నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాను సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. దాంతో అధికారులు విచిత్రమైన నిబంధనలు పెట్టారు. ఒకరి కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి(జాయింట్ వెంచర్) టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధనలు విధిస్తున్న జలవనరుల శాఖ.. ఏలేరు ఆధునికకీరణ టెండర్లలో మాత్రం ముగ్గురు కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి బిడ్‌లు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
విదేశీ కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేయడానికి అనర్హులని మెలిక పెట్టింది. మంత్రి బెదిరింపుల నేపథ్యంలో బిడ్‌లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. మంత్రి సన్నిహిత కాంట్రాక్టర్ మాత్రమే బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్ర లేకపోవడంతో ఈసారి సింగిల్ బిడ్‌నే ఆమోదించి, సదరు సన్నిహితుడికి పనులు కట్టబెట్టనున్నారు. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన మంత్రికి రూ.40 కోట్లకుపైగా కమీషన్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment