విక్రయాలలో సైట్‌ ఆఫీస్‌ కీలకం | 50 percent growth in sales with site office | Sakshi
Sakshi News home page

విక్రయాలలో సైట్‌ ఆఫీస్‌ కీలకం

Published Sat, Dec 25 2021 12:54 AM | Last Updated on Sat, Dec 25 2021 12:54 AM

50 percent growth in sales with site office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు మన చూపు అందంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దిన డిస్‌ప్లే వస్తువులపై పడుతుంది. వెంటనే ఆయా వస్తువుల కొనేందుకు లేదా ఎంక్వైరీకి ప్రయత్నిస్తాం. ఇదే తరహాలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లోనూ సైట్‌ ఆఫీస్‌ డిస్‌ ప్లే లాంటిది. శక్తివంతమైన మార్కెటింగ్‌ సాధనమిది. లగ్జరీ గృహాలతో పాటూ అఫర్డబుల్, మిడ్‌ సైజ్‌ గృహాల విక్రయాలలోనూ సైట్‌ ఆఫీస్‌ అనేది అత్యంత కీలకంగా మారింది.

మన దేశంలో గృహ విక్రయాలు పోర్టా క్యాబిన్స్‌ లేదా నమూనా ఫ్లాట్‌ ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తుంటారు. సేల్స్‌ ఆఫీస్‌ అనేది ముందుగా లగ్జరీ ప్రాజెక్ట్‌లలో డెవలపర్లు అనుభవం, ప్రాజెక్ట్‌ ఆఫర్ల గురించి ఏర్పాటు చేసేవాళ్లు. తర్వాతి కాలంలో ఈ కాన్సెప్ట్‌ అఫర్డబుల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లకు కూడా పాకింది. ఎక్కువ మంది కస్టమర్లకు వసతి కల్పించడానికి, విక్రయాలను క్రమబద్దీకరించడానికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

ప్రతి కొత్త ప్రాజెక్ట్‌ సైట్‌లో సేల్స్‌ ఆఫీస్‌ ఉంటుంది. సేల్స్, సైట్‌ ఆఫీస్‌ లేదా సేల్స్‌ గ్యాలరీ అనేది మొత్తం రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలో సమగ్రమైన, కీలకమైన విభాగం. ఆకర్షణీయమైన, సమగ్ర నిర్వహణ సేల్స్‌ ఆఫీస్‌ లేకపోతే విక్రయాలు కూడా గణనీయంగా క్షీణిస్తాయి. ప్రాజెక్ట్‌లోని ఉత్తమ ఫీచర్ల ప్రదర్శన, ప్రయోజనాల డిస్‌ప్లే, వాకిన్స్, సైట్‌ విజిట్స్‌ నిర్వహణ వంటివి సేల్స్‌ ఆఫీస్‌ ప్రత్యేకత.

మార్కెటింగ్‌లో కీలకం..
ప్రాపర్టీల మార్కెటింగ్‌లో సేల్స్‌ ఆఫీస్‌ కీలకమైన విభాగంగా మారింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌పై కొనుగోలుదారులలో మంచి అభిప్రాయం కలిగేది సైట్‌ ఆఫీస్‌ నుంచే మొదలవుతుంది. మార్కెటింగ్‌ బృందానికి అప్పటికే చేతిలోకి రాని ప్రాజెక్ట్‌లోని ఫీచర్లు, ప్రయోజనాలు కస్టమర్లకు అనుభవపూర్వకం చేసే అవకాశం కలుగుతుంది. అభివృద్ధి పనులు జరుగుతున్న దశల వారీగా సైట్‌ ఆఫీస్‌లో ప్రదర్శించే వీలుంటుంది.  

ఆయా ప్రాజెక్ట్‌లో తాము భాగస్వామ్యమైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే ఓ ఊహాజనిత చిత్రాన్ని చూపించేదే సైట్‌ ఆఫీస్‌. కొందరు కస్టమర్లు పలుమార్లు సైట్‌ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలం ప్రభావవంతంగా, క్రియాత్మకంగా ఉండాలి. రియల్టీ ప్రాజెక్ట్‌ ప్రారంభమైన రోజు నుంచి 2–3 ఏళ్ల పాటు సాగుతాయి. ప్రాజెక్ట్‌లోని ఇన్వెంటరీలో 90 శాతం విక్రయాలయ్యే వరకూ సేల్స్‌ ఆఫీస్‌ ఉంటుందని అనరాక్‌ గ్రూప్‌ స్ట్రాటర్జీ హెడ్‌ సునీల్‌ మిశ్రా తెలిపారు.

► ప్రాజెక్ట్‌ నిర్మాణం, విక్రయాలు పూర్తయ్యే వరకూ సేల్స్‌ ఆఫీస్‌ ఉంటుంది. నిర్మాణ సంస్థకు, కొనుగోలుదారులకు మధ్య వారధి లాంటివి సేల్స్‌ ఆఫీస్‌. ఇక్కడి నుంచే కస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడంతో పాటూ ప్రాజెక్ట్‌ ఫీచర్లను ప్రదర్శిస్తారు. దీంతో పాటు ధర నిర్ణయం, లావాదేవీలు కూడా జరుగుతాయి. ప్రవాస కస్టమర్లు మినహా వంద శాతం ప్రాపర్టీ లావాదేవీలు సైట్‌ ఆఫీస్‌ల నుంచే జరుగుతాయి.

సేల్స్‌ ఆఫీస్‌ అనేది డెవలపర్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మాత్రమే కాదు.. కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్, 80–85 శాతం కస్టమర్ల ఫిజికల్‌ ప్రాపర్టీ అనుభవం ఇక్కడ్నుంచే జరుగుతాయి. మంచి సేల్స్‌ ఆఫీస్‌ కారణంగా కస్టమర్ల అంతర్గత ప్రచారంతో సైట్‌ విజిట్స్‌ పెరుగుతాయి. విక్రయాల నిష్పత్తి 4–5% వరకు వృద్ధి చెందుతాయి. కొత్త మార్కెట్లలో కూడా డెవలపర్‌ బ్రాండ్‌ను తెలిపేది సైట్‌ ఆఫీసులే. గ్రేడ్‌–ఏ, బీ డెవలపర్లు సేల్స్‌ ఆఫీస్‌ల నిర్వహణతో 50% విక్రయాలను మెరుగుపర్చుకుంటున్నారు.

సేల్స్‌ ఆఫీస్‌ క్లబ్‌ హౌస్‌గా..
మంచి సేల్స్‌ ఆఫీస్‌ నిర్మాణం, నిర్వహణ మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో 0.5 శాతం అవుతుంది. చాలా మంది డెవలపర్లు తాత్కాలిక సేల్స్‌ ఆఫీస్‌ను ఏర్పాటు కంటే శాశ్వత నిర్మాణాన్ని చేపడతారు. వాస్తవానికి ఇది మంచి నిర్ణయం. ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక సేల్స్‌ ఆఫీస్‌ను క్లబ్‌ హౌస్‌గా మార్చేసి.. హౌసింగ్‌ సొసైటీకి అప్పగిస్తారు. దీంతో సైట్‌ ఆఫీస్‌ నిర్మాణం, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాధారణంగా సేల్స్‌ ఆఫీస్‌ పరిమాణం 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటుంది. కొన్ని టౌన్‌షిప్‌లలో 8 వేల నుంచి 10 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి కూడా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement