nielit
-
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం
కేంద్రం పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అందుకు అనువుగా కేంద్రం తాజాగా సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. ఈ సెంటర్లను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కేంద్రాల్లో రానున్న రోజుల్లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఈసీటీ)కు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఈ రెండు కేంద్రాలు నీలిట్-చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఈ సంస్థల్లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులతో టెక్నాలజీ కంపెనీలకు మానవ వనరుల కొరత తీరనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రాబోయే 3 ఏళ్లలో ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 5,000 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. -
Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్ఐఈఎల్ఐటీ..
తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగా అవతరిస్తోంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది. ఇప్పుడు సరికొత్తగా మానవ వనరుల అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడం, యువతకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో రాణించేలా వివిధ కోర్సులు అందించడమే లక్ష్యంగా నైలెట్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వెంకన్న పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ఎన్ఐఈఎల్ఐటీ బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఐఐడీటీ కేంద్రాన్ని బృందం పరిశీలించింది. తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కమిటీ చైర్మన్, సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు. నైలెట్ అంటే ఏంటి? దాని ముఖ్యఉద్దేశాలు ► ఎన్ఐఈఎల్ఐటీ(నైలెట్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం. ► ఎన్ఐఈఎల్ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మానవనరులు అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలు అందుకు ఉపయోగపడే కోర్సులు అందించడం ముఖ్య ఉద్దేశం. ► ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో కూడిన శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఐఈఎల్ఐటీ అందిస్తున్న కోర్సులు ఫార్మల్ కోర్సుల్లో భాగంగా మూడేళ్ల బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ, వి.ఎల్.ఎస్.ఐ డిజైన్, నాన్ ఫార్మల్ రంగంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్‌వేర్, సైబర్ చట్టం, సైబర్ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటరింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ – మ్యానుఫ్యాక్చరింగ్, ఇ–వ్యర్థాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇ–గవర్నెన్స్ వంటి కోర్సులు అందిస్తుంది. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ప్రాచుర్యం పొందిన కోర్సులను ఉమ్మడి భాగస్వామ్యంలో అందుబాటులోకి తీసుకురావడం నైలెట్ ప్రత్యేకత. ఎన్ఐఈఎల్ఐటీ తిరుపతిలో నెలకొల్పడం ద్వారా వృత్తి విద్య కోర్సుల తోపాటు అనుదినం మారూతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం అందుకు అవసరమైన కోర్సులు నేర్చుకోనేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తగిన నైపుణ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అర్హతలను బట్టి అవకాశాలను కూడా కల్పిస్తుంది. తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉండడంతో విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లాలో త్వరలో ఐటీ కాన్సెప్ట్ సిటీ నెలకొల్పబోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీసిటీ, రేణిగుంటలో ఈఎంసీ, మేనకూరు పారిశ్రామికవాడలో నెలకొల్పిన దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. – మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
నీలిట్.. అవుట్!
ఎచ్చెర్ల: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం.. ప్రభుత్వాలు మారడం సహజం. వాటితోపాటు కొన్ని విధానాలూ మారుతుంటాయి. అంతేకానీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజె క్టులు అటకెక్కుతాయా?.. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు ఆగిపోవలసిందేనా??.. గత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రాజెక్టు పరిస్థితి ఈ సందేహాలను రేపుతోంది. ఆందోళన కలిగిస్తోంది. అదే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నీలిట్ ప్రాజెక్టు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు గత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు కోసం ఇక్కడి విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి అవుతున్నా దాని గురించి ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు మనుగడప అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ-2 ప్రభుత్వం చివరినాళ్లలో శ్రీకాకుళం జిల్లాకు నీలిట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సంస్థను మంజూరు చేసింది. రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టే దీని నిర్మాణానికి ఎచ్చెర్ల మండలం కుశాలపురం సమీపంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శంకుస్థాపన చేశారు. అదే ప్రాజెక్టుకు తిరిగి అదే ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత కోటబొమ్మాళి మండలం తర్లికొండపై మరోసారి శంకుస్థాపన చేయించారు. అయితే తర్లికొండ గ్రామీణ ప్రాంతం కావడం, జిల్లా కేంద్రం సమీపంలో అయితే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని భావించి శ్రీకాకుళం పాలిటెక్నిక్ సమీపంలోని స్థలాన్నే ఖరారు చేశారు. దేశంలో 24వ ప్రాజెక్టు దేశంలో ప్రస్తుతం 23 నీలిట్ సంస్థలు ఉన్నాయి. 24వ సంస్థను శ్రీకాకుళానికి కేంద్ర ఐటీ శాఖ మంజూరు చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేటు రంగంలో ఉఫాది కల్పించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం వంటి గ్రామీణ జిల్లాల యువతకు ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ సంస్థ నిర్మాణం పూర్తి అయ్యి శిక్షణలు ప్రారంభమైతే ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత ఆశతో ఎదురుచూస్తుండగా ఎన్నికలు జరిగి కేంద్రా, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయే తప్ప శిలాఫలకం పడిన నీలిట్ ప్రాజెక్టు గురించి నామమాత్రంగానైనా ప్రస్తావించడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆర్థిక అనుమతులు సైతం లభించాయని శంకుస్థాపన సమయంలో కృపారాణి ప్రకటించినా.. ఏడాది గడుస్తున్నా దీని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. దాంతో ఆ ప్రాజెక్టు దాదాపు అటకెక్కినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ, జిల్లా మంత్రి చొరవ తీసుకొని జిల్లాకు మంజూరైన ఈ ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని విద్యావంతులు కోరుతున్నారు.