ఎచ్చెర్ల: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం.. ప్రభుత్వాలు మారడం సహజం. వాటితోపాటు కొన్ని విధానాలూ మారుతుంటాయి. అంతేకానీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజె క్టులు అటకెక్కుతాయా?.. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు ఆగిపోవలసిందేనా??.. గత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రాజెక్టు పరిస్థితి ఈ సందేహాలను రేపుతోంది. ఆందోళన కలిగిస్తోంది. అదే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నీలిట్ ప్రాజెక్టు.
విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు గత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు కోసం ఇక్కడి విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి అవుతున్నా దాని గురించి ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు మనుగడప అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ-2 ప్రభుత్వం చివరినాళ్లలో శ్రీకాకుళం జిల్లాకు నీలిట్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) సంస్థను మంజూరు చేసింది.
రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టే దీని నిర్మాణానికి ఎచ్చెర్ల మండలం కుశాలపురం సమీపంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శంకుస్థాపన చేశారు. అదే ప్రాజెక్టుకు తిరిగి అదే ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత కోటబొమ్మాళి మండలం తర్లికొండపై మరోసారి శంకుస్థాపన చేయించారు. అయితే తర్లికొండ గ్రామీణ ప్రాంతం కావడం, జిల్లా కేంద్రం సమీపంలో అయితే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని భావించి శ్రీకాకుళం పాలిటెక్నిక్ సమీపంలోని స్థలాన్నే ఖరారు చేశారు.
దేశంలో 24వ ప్రాజెక్టు
దేశంలో ప్రస్తుతం 23 నీలిట్ సంస్థలు ఉన్నాయి. 24వ సంస్థను శ్రీకాకుళానికి కేంద్ర ఐటీ శాఖ మంజూరు చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేటు రంగంలో ఉఫాది కల్పించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం వంటి గ్రామీణ జిల్లాల యువతకు ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ సంస్థ నిర్మాణం పూర్తి అయ్యి శిక్షణలు ప్రారంభమైతే ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత ఆశతో ఎదురుచూస్తుండగా ఎన్నికలు జరిగి కేంద్రా, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి.
కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయే తప్ప శిలాఫలకం పడిన నీలిట్ ప్రాజెక్టు గురించి నామమాత్రంగానైనా ప్రస్తావించడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆర్థిక అనుమతులు సైతం లభించాయని శంకుస్థాపన సమయంలో కృపారాణి ప్రకటించినా.. ఏడాది గడుస్తున్నా దీని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. దాంతో ఆ ప్రాజెక్టు దాదాపు అటకెక్కినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ, జిల్లా మంత్రి చొరవ తీసుకొని జిల్లాకు మంజూరైన ఈ ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని విద్యావంతులు కోరుతున్నారు.
నీలిట్.. అవుట్!
Published Sat, Jan 31 2015 9:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM
Advertisement
Advertisement