పెట్టుబడుల ఆకర్షణకు.. త్వరలో జపాన్‌లో రోడ్‌ షో | Andhra Pradesh Govt Plans Road show in Japan investments | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల ఆకర్షణకు.. త్వరలో జపాన్‌లో రోడ్‌ షో

Published Sat, May 14 2022 4:28 AM | Last Updated on Sat, May 14 2022 3:12 PM

Andhra Pradesh Govt Plans Road show in Japan investments - Sakshi

సాక్షి, అమరావతి: జపాన్‌ పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని, ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టగా.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో త్వరలో జపాన్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నట్లు ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) సీఈఓ జవ్వాది సుబ్రమణ్యం వెల్లడించారు. జపాన్‌కు చెందిన పారిశ్రామిక, బ్యాంకింగ్‌ రంగ ప్రతినిధుల బృందం శుక్రవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సుబ్రమణ్యంను కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తిని వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా జవ్వాది మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో త్వరలో జపాన్‌లో రోడ్‌షోను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జపాన్‌ కంపెనీల సీఈఓలతో త్వరలో రాష్ట్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామన్నారు. అంతేకాక.. విశాఖపట్నంలో జపాన్‌కు చెందిన యొకొహమ గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్స్‌ భారీ టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తుండటమే కాకుండా ఆ యూనిట్‌కు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కదుర్చుకున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. జైకా, జెట్రో తదితర జపాన్‌ సంస్థలతో కలిసి ప్రయాణిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

జపనీస్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు
మరోవైపు.. శ్రీసిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ (జిట్‌)ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. ప్రత్యేకంగా జపాన్‌ కంపెనీలకే హెల్ప్‌డెస్క్‌ వెసులుబాటుతో పాటు శ్రీసిటీలో జపనీస్‌ భాష అనువాదకులనూ ఏర్పాటుచేశామన్నారు. ఇక దక్షిణాదిలో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికి అనువైన రాష్ట్రంగా ఎంయూఎఫ్‌జీ బ్యాంకు చెన్నై బ్రాంచ్‌ అధ్యక్షులు యుకిహిరో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌ ఢిల్లీ బ్రాంచ్‌ ఉపాధ్యక్షులు కజుయోషి షిబటని, జపనీస్‌ కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ డివిజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లు సహిల్‌ అగర్వాల్, సందీప్‌ వర్మ, ఏపీఈడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌ సవరపు ప్రసాద్‌ హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement