గాడిద పాలతో సబ్బులు, మిల్క్ పౌడర్
దక్షిణాది రాష్ట్రాల్లోనే ‘తూర్పు’న తొలి ప్రయోగం
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌లైన్ అమ్మకాలు
విదేశాలకూ ఎగుమతి
సాక్షి, అమరావతి: గాడిద పాలు లీటర్ రూ.3 వేలు. అదే లీటరు పాలతో సబ్బులు తయారు చేస్తే రూ.11,980 ఆదాయం. గాడిద పాలకంటే.. ఆ పాలతో తయారు చేసే ఉప ఉత్పత్తులు సైతం అధిక లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం గాడిద పాలకు ప్రపంచమంతా క్రేజ్ వచ్చింది.
ఏపీలో తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని తోకాడ వద్ద ప్రారంభించిన అక్షయ డాంకీ ఫౌండేషన్ నాలుగేళ్లలోనే మంచి గుర్తింపు పొందింది. రూ.80 లక్షల వ్యయంతో 10 ఎకరాల్లో ప్రారంభించిన ఈ ఫామ్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాల ఉత్పత్తి చేస్తోంది. ఈ పాలతో సబ్బులు, పాల పౌడర్ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేస్తోంది.
వారానికి 310 లీటర్ల పాల ఉత్పత్తి
అక్షయ డాంకీ ఫామ్‌లో దేశీయ నాటు గాడిదలతో పాటు అంతర్జాతీయంగా పేరొందిన హలారీ, కాట్వాడి, టోక్యో జాతులకు చెందిన గాడిదలున్నాయి. 80 గాడిదలతో ప్రారంభమైన ఈ ఫామ్‌లో ప్రస్తుతం వాటి సంఖ్య 120కు పెరిగింది.
నాటు గాడిదలు రోజుకు సగటున 250–350 మిల్లీలీటర్ల పాలు ఇస్తుండగా, హలారి (గుజరాత్), కాట్వాడి (మహారాష్ట్ర), టోక్యో (ఇథియోఫియా) జాతి గాడిదలు రోజుకు 750 మిల్లీ లీటర్ల నుంచి 1.75 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ప్రారంభంలో వారానికి 240 లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా.. ప్రస్తుతం 310 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గాడిద పాలు పితికిన తర్వాత 3 గంటలకు మించి నిల్వ ఉండవు.
పాశ్చురైజ్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే 3 రోజులు, డీప్ ఫ్రిజ్‌లో పెడితే 6 నెలలు, పౌడర్ రూపంలో అయితే రెండేళ్ల పాటు నిల్వ ఉంచొచ్చు. పిల్లలు తాగే పాలు లీటర్ రూ.3 వేలకు విక్రయిస్తుండగా.. కాస్మొటిక్ కంపెనీలకు రూ.5 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. మూత్రాన్ని లీటర్ రూ.450, పేడ కిలో రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు.
వ్యాధి నిరోధక శక్తి ఎక్కువట
గాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పాలలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ, ఈతోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వే ప్రొటీన్, కాసియన్ ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు దోహదపడుతుందని, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగçపడుతుందని పేర్కొంటున్నారు. గాడిద మూత్రాన్ని ఆయుర్వేద మందుల తయారీ, పేడను ధూప్‌స్టిక్స్, ఎరువులుగా వాడతారు.
ఈ–కామర్స్‌లో అమ్మకాలు
గాడిద పాల సబ్బులు, గాడిద పాల పౌడర్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. త్వరలో స్కిన్ లోషన్‌తో పాటు మరిన్ని ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నాలుగు ఫ్లేవర్స్‌లో సబ్బుల తయారీ
క్లియోపాత్ర చర్మ సౌందర్యానికి గాడిద పాలే కారణమని చెబుతారు. గాడిద పాలతోనే స్నానం చేసేదాననని తన స్వీయ చరిత్రలో ఆమె రాసుకున్నారు. గాడిద పాలతో తయారు చేసే సబ్బులను మోడల్స్, సినీతారలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటి వాడకం వలన శరీరం కాంతివంతమవుతుందని, చర్మం త్వరగా ముడతలు పడదని చెబుతారు.
అక్షయ డాంకీ ఫౌండేషన్ ఇటీవలే ఫామ్‌లో కొత్తగా సబ్బులు, పాల పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. లావెండర్, గులాబీ, హనీ–బెంటోనైట్ క్లే, అలోవెరా–ఫ్రెంచ్ గ్రీన్ క్లే వంటి నాలుగు రకాల సబ్బులను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల సబ్బు తయారీకి 50 మిల్లీలీటర్ల పాలను వినియోగిస్తున్నారు. ఒక్కో సబ్బును రూ.599 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ఫామ్‌లో ఏడాదికి సుమారు 6 వేల సబ్బులు తయారవుతాయి.
మిల్క్ పౌడర్‌కూ భలే గిరాకీ
గాడిద పాలతో తయారు చేసే పాల పౌడర్‌ను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు, బ్యూటీ కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తుంటారు. ఒక స్పూన్ పౌడర్ లీటర్ నీటిలో కలుపుకుంటే అవన్నీ పాలుగా మారిపోతాయి.
ఆస్తమా రోగులు ఎక్కువగా ఈ పాలను సేవిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో పాల పౌడర్ ధర రూ.85 వేల పైమాటే. 13 లీటర్ల పాలతో కిలో పౌడర్ తయారవుతుంది. ఈ ఫామ్‌లో ఏటా 200 కేజీల పాల పౌడర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల పౌడర్ రూ.8,500 చొప్పున విక్రయిస్తున్నారు.
సబ్బులకు మంచి డిమాండ్
నాలుగేళ్లలోనే ఫామ్‌ను విస్తరించాం. గాడిదల సంఖ్యతోపాటు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. సబ్బులు, పాల పౌడర్ తయారు చేస్తున్నాం. త్వరలో మరిన్ని ఉప ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ఎం.ప్రదీప్, మేనేజర్, అక్షయ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment