soaps
-
గాడిద పాల సబ్బు.. డబ్బే డబ్బు
సాక్షి, అమరావతి: గాడిద పాలు లీటర్ రూ.3 వేలు. అదే లీటరు పాలతో సబ్బులు తయారు చేస్తే రూ.11,980 ఆదాయం. గాడిద పాలకంటే.. ఆ పాలతో తయారు చేసే ఉప ఉత్పత్తులు సైతం అధిక లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం గాడిద పాలకు ప్రపంచమంతా క్రేజ్ వచ్చింది. ఏపీలో తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని తోకాడ వద్ద ప్రారంభించిన అక్షయ డాంకీ ఫౌండేషన్ నాలుగేళ్లలోనే మంచి గుర్తింపు పొందింది. రూ.80 లక్షల వ్యయంతో 10 ఎకరాల్లో ప్రారంభించిన ఈ ఫామ్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాల ఉత్పత్తి చేస్తోంది. ఈ పాలతో సబ్బులు, పాల పౌడర్ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేస్తోంది. వారానికి 310 లీటర్ల పాల ఉత్పత్తిఅక్షయ డాంకీ ఫామ్‌లో దేశీయ నాటు గాడిదలతో పాటు అంతర్జాతీయంగా పేరొందిన హలారీ, కాట్వాడి, టోక్యో జాతులకు చెందిన గాడిదలున్నాయి. 80 గాడిదలతో ప్రారంభమైన ఈ ఫామ్‌లో ప్రస్తుతం వాటి సంఖ్య 120కు పెరిగింది. నాటు గాడిదలు రోజుకు సగటున 250–350 మిల్లీలీటర్ల పాలు ఇస్తుండగా, హలారి (గుజరాత్), కాట్వాడి (మహారాష్ట్ర), టోక్యో (ఇథియోఫియా) జాతి గాడిదలు రోజుకు 750 మిల్లీ లీటర్ల నుంచి 1.75 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ప్రారంభంలో వారానికి 240 లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా.. ప్రస్తుతం 310 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గాడిద పాలు పితికిన తర్వాత 3 గంటలకు మించి నిల్వ ఉండవు. పాశ్చురైజ్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే 3 రోజులు, డీప్ ఫ్రిజ్‌లో పెడితే 6 నెలలు, పౌడర్ రూపంలో అయితే రెండేళ్ల పాటు నిల్వ ఉంచొచ్చు. పిల్లలు తాగే పాలు లీటర్ రూ.3 వేలకు విక్రయిస్తుండగా.. కాస్మొటిక్ కంపెనీలకు రూ.5 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. మూత్రాన్ని లీటర్ రూ.450, పేడ కిలో రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువటగాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పాలలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ, ఈతోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వే ప్రొటీన్, కాసియన్ ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు దోహదపడుతుందని, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగçపడుతుందని పేర్కొంటున్నారు. గాడిద మూత్రాన్ని ఆయుర్వేద మందుల తయారీ, పేడను ధూప్‌స్టిక్స్, ఎరువులుగా వాడతారు.ఈ–కామర్స్‌లో అమ్మకాలుగాడిద పాల సబ్బులు, గాడిద పాల పౌడర్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. త్వరలో స్కిన్ లోషన్‌తో పాటు మరిన్ని ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు ఫ్లేవర్స్‌లో సబ్బుల తయారీక్లియోపాత్ర చర్మ సౌందర్యానికి గాడిద పాలే కారణమని చెబుతారు. గాడిద పాలతోనే స్నానం చేసేదాననని తన స్వీయ చరిత్రలో ఆమె రాసుకున్నారు. గాడిద పాలతో తయారు చేసే సబ్బులను మోడల్స్, సినీతారలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటి వాడకం వలన శరీరం కాంతివంతమవుతుందని, చర్మం త్వరగా ముడతలు పడదని చెబుతారు.అక్షయ డాంకీ ఫౌండేషన్ ఇటీవలే ఫామ్‌లో కొత్తగా సబ్బులు, పాల పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. లావెండర్, గులాబీ, హనీ–బెంటోనైట్ క్లే, అలోవెరా–ఫ్రెంచ్ గ్రీన్ క్లే వంటి నాలుగు రకాల సబ్బులను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల సబ్బు తయారీకి 50 మిల్లీలీటర్ల పాలను వినియోగిస్తున్నారు. ఒక్కో సబ్బును రూ.599 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ఫామ్‌లో ఏడాదికి సుమారు 6 వేల సబ్బులు తయారవుతాయి.మిల్క్ పౌడర్కూ భలే గిరాకీగాడిద పాలతో తయారు చేసే పాల పౌడర్‌ను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు, బ్యూటీ కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తుంటారు. ఒక స్పూన్ పౌడర్ లీటర్ నీటిలో కలుపుకుంటే అవన్నీ పాలుగా మారిపోతాయి. ఆస్తమా రోగులు ఎక్కువగా ఈ పాలను సేవిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో పాల పౌడర్ ధర రూ.85 వేల పైమాటే. 13 లీటర్ల పాలతో కిలో పౌడర్ తయారవుతుంది. ఈ ఫామ్‌లో ఏటా 200 కేజీల పాల పౌడర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల పౌడర్ రూ.8,500 చొప్పున విక్రయిస్తున్నారు. సబ్బులకు మంచి డిమాండ్నాలుగేళ్లలోనే ఫామ్‌ను విస్తరించాం. గాడిదల సంఖ్యతోపాటు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. సబ్బులు, పాల పౌడర్ తయారు చేస్తున్నాం. త్వరలో మరిన్ని ఉప ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ఎం.ప్రదీప్, మేనేజర్, అక్షయ ఫౌండేషన్ -
Bhargavi Pappuri: నా రోల్‌మోడల్ నేనే!
భార్గవి పప్పూరి... మన కళలను ఇష్టపడ్డారు. మన కళాకారులకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం కళాత్మకమైన వేదికను నేశారు. అది తన సృజనాత్మకతకే వేదికవుతుందనుకోలేదామె. ఆర్ట్ఎన్ వీవ్స్... కృషి ఆమెదే... కళ ఆమెదే. ఆర్ట్ అండ్ వీవ్స్ స్థాపించడానికి ముందు నా జర్నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అది సరదాగా సాగిపోయే ఓ సినిమాని తలపిస్తుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, వనస్థలి పురం దగ్గర ఆర్కే పురంలో. నాన్న పోస్ట్ మాస్టర్‌గా రిటైరయ్యారు. అమ్మ గృహిణి. బికామ్ చదివి చాలా కామ్‌గా ఉండేదాన్ని. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నోరు పెగిలేది కాదు. పెళ్లయిన తర్వాత మా వారు నన్ను మార్కెటింగ్ వైపు నడిపించారు. ఆయనది కూడా అదే ఫీల్డ్ కావడంతో నాకు మెళకువలు నేరి్పంచారు. మొదట క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లు మార్కెట్ చేశాను. మా వారికి కోల్‌కతాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కార్ లోన్ మార్కెటింగ్ చేశాను. కాలి నడకన కోల్‌కతా మొత్తం తిరిగాను. మళ్లీ బదలీ కోల్‌కతాలో మార్కెటింగ్ మీద పట్టు వచ్చేటప్పటికి మా వారికి మళ్లీ బదలీ. ఈ సారి విజయవాడ. అప్పుడు బాబు పుట్టడంతో నా కెరీర్లో విరామం తీసుకున్నాను. మళ్లీ బదలీలు. మొత్తానికి బాబు స్కూల్‌కెళ్లే వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్‌కొచ్చాం. బాబు పెద్దయ్యాడు కాబట్టి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ ఇక ఆ వయసుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరని ఫ్రెండ్‌తో కలిసి క్రెష్ నడిపించాను. కొంతకాలానికి ఇంట్లోనే ఉంటూ కేటరింగ్ మొదలుపెట్టాను. మేముండే వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎక్కువ మంది వయసు మళ్లిన దంపతులే. పిల్లలు విదేశాలకు వెళ్లిన తర్వాత పెద్ద దంపతులు విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని లంచ్, డిన్నర్ పంపించే ఏర్పాటు చేశాను. ఉదయం తొమ్మిదిలోపు ఆర్డర్ చేస్తే భోజనం సమయానికి ఒక బాయ్ సహాయంతో క్యారియర్ చేర్చాను. మా వారికి తరచూ బదలీలు, ఆయన కష్టమంతా ఎన్నో కంపెనీల అభివృద్ధికి దోహదం అవుతున్నాయి. మాకు మాత్రం ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం లేదు. మంచి జీతం వస్తోంది. కానీ మనకు మనంగా సాధించింది ఏమిటని చూసుకుంటే వెలితి కనిపించసాగింది. అప్పుడు పంథా మార్చుకున్నాం. ఇదంతా ఆర్డ్ అండ్ వీవ్స్ ప్రారంభానికి ముందు నా జీవితం. కళాకృతుల సేకరణ ఆర్ట్ అండ్ వీవ్స్ అనే ప్రాజెక్ట్ రూపొందించుకుని, దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో çకళలు, కళాకారులు, చేనేతకారులను స్వయంగా కలిశాం. భారతీయ కళలు ఒకదానికి మరొకటి పూర్తిగా భిన్నం. దేనికదే ప్రత్యేకం. అంతటి వైవిధ్యతను ఒక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఆ కళారూపాలను అభిరుచి ఉన్నవారికి దగ్గర చేయడం, కళాకృతుల తయారీదారులకు పని కలి్పంచడం మా ఉద్దేశం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేయించాం. ఒడిశా, రాజస్థాన్, బీహార్, కర్నాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకునే కళాకృతుల ఫొటోలను మా వెబ్సైట్లో పెట్టాం. మధుబని, బిద్రీ వంటి కళాఖండాలకు ఆదరణ బాగా వచ్చింది, ఆర్డర్లు కూడా వచ్చాయి. కానీ తయారీదారుల దగ్గర ఆ సమయానికి కస్టమర్ కోరుకున్న మధుబని ఆర్ట్ కానీ, చేనేత చీర కానీ ఉండేది కాదు. ఇవన్నీ చాలా సమయం తీసుకునే కళాకృతులు. అంత సమయం వేచి చూసే ఓపిక కస్టమర్లకు ఉండేది కాదు. కస్టమర్‌కి సకాలంలో అందించాలంటే తయారీదారులం మనమే అయి ఉండాలనుకున్నాను. టెర్రకోట కళాకృతులు నేర్చుకోవడానికి ప్రయతి్నంచాను. కానీ కుదరలేదు. అదే సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్లు హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్ వారం రోజుల కోర్సు ప్రకటించారు. నేర్చుకోవడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, పొరపాట్లను సరిదిద్దుకుంటూ 54 రకాల సబ్బుల తయారీలో నైపుణ్యం సాధించాను. నా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్ వచ్చింది. ఆర్గానిక్ హోమ్మేడ్ సబ్బులు, షాంపూ, బాత్ జెల్స్ చేస్తున్నాను. మా బ్రాండ్‌కు మౌత్ పబ్లిసిటీ వచి్చంది. విదేశాలకు వెళ్లే వాళ్లు తమ పిల్లల కోసం పచ్చళ్లు, పొడులతోపాటు మా దగ్గర నుంచి ఏడాదికి సరిపడిన సబ్బులు, షాంపూలు కూడా తీసుకెళ్తున్నారు. నా వర్క్ యూనిట్, ఆఫీస్, ఇల్లు ఒకే బిల్డింగ్‌లో. ఆర్డర్లు ఎక్కువున్నప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తాను. సాధారణంగా మధ్యాహ్నం రెండు వరకు పని చేస్తాను. ఓ గంట ధ్యానం, గార్డెనింగ్ నా డైలీ రొటీన్లో భాగం. ప్రకృతి సహకారం నా క్రియేటివిటీని నా బ్రాండ్ కోసమే ఉపయోగిస్తున్నాను. మరో నలుగురికి జీతం ఇవ్వగలుగుతున్నాను. మన సంకల్పం మంచిదై ఉండి, నిబద్ధతతో పని చేస్తే ప్రకృతి తన వంతుగా సహకారం అందిస్తుందని, అదే మనల్ని ఓ మార్గంలో నడిపిస్తుందని నమ్ముతాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)తో అనుసంధానమయ్యాను. ముద్ర లోన్ వచి్చంది. ఈ రోజు నేనిలా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏ పనికి గౌరవం ఎక్కువ, ఏ పనికి గౌరవం తక్కువ అని ఆలోచించకపోవడమే. అన్ని పనులూ గౌరవంతో కూడినవే. మహిళలకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటే. గొప్పవాళ్లు ప్రత్యేకంగా పుట్టరు. నిజాయితీగా కష్టపడే తత్వమే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతుంది. నాకు రోల్‌మోడల్ ఎవరూ లేరు. నాకు నేనే రోల్మోడల్ని. అలాగే నాకు నేనే కాంపిటీటర్ని. ఈ రోజు చేసిన పనిని రేపు మరింత మెరుగ్గా చేయాలనే లక్ష్యాన్ని మనకు మనమే నిర్దేశించుకోవాలి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. ఆర్థిక సవాళ్లతోపాటు ఆరోగ్యం పెట్టే పరీక్షలూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ఏకైక కర్తవ్యం. సంతోషంగా జీవించాలా దిగాలుగా రోజులు గడపాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. మనసు బాగాలేకపోతే ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావడం అనే చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది’’ అన్నారు భార్గవి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. సంతోషంగా జీవించాలా.. దిగాలుగా రోజులు గడపాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. – భార్గవి పప్పూరి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!
మాట్లాడే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతుంటారు. ఆదుకోవాలని మనసు ఉండాలేగానీ, సరికొత్త దారులు అనేకం కనిపిస్తాయని చేసి చూపెడుతోంది పదిహేడేళ్ల సీమర్ సంగ్లా. యాసిడ్ దాడి బాధితులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన సీమర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒకసారి పూనమ్ అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. దీంతో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. అయితే ఆమె మామూలు సబ్బులతో స్నానం చేస్తే యాసిడ్ దాడి జరిగిన ప్రదేశంలో బాగా మంట పుట్టేది. ఈ విషయం తెలిసిన యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే సీమర్ తల్లి... పూనమ్‌ను ఆదుకునే క్రమంలో ... మంట రాని సబ్బు తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే సీమర్ అమ్మ, అమ్మమ్మలు కలిసి, సబ్బు తయారు చేశారు. యాసిడ్ దాడికి కాలిపోయిన పూనంకు ఈ సబ్బు స్వాంతన కలిగించింది. వాడుకోవడానికి చాలా అనువుగా అనిపించింది. ఇదంతా దగ్గర నుంచి చూసిన సీమర్ యాసిడ్ బాధితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టింది. పూనమ్లా ఎంతోమంది యాసిడ్ దాడికి గురైనట్లు తెలుసుకుని, వాళ్లందరికి తాను ఏదోరకంగా సాయపడాలనుకుంది. గతేడాది యాసిడి బాధితుల అవసరాలకు తగినట్లుగా ‘సేఫ్ కేవ్’ పేరిట సబ్బులు తయారు చేయడం ప్రారంభించింది. అలోవెర, తేనెలతో సబ్బులు తయారు చేసి యాసిడ్ బాధితులకు ఇచ్చేది. ఈ సబ్బులు బాధితులకు సాంత్వననిచ్చేవి. వారి ఆసక్తిని గమనించిన సీమర్... సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. శిక్షణ తీసుకున్న వారంతా సబ్బులు తయారు చేసి మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో వాళ్లకంటూ ఒక గుర్తింపుతోపాటు, సాధారణ అమ్మాయిల్లా జీవించగలుగుతున్నారు. సీమర్.. ఇప్పటిదాక ఇరవైమందికిపైగా సబ్బుల తయారీలో శిక్షణ ఇచ్చింది. యాసిడ్ బాధితుల గురించి తన స్నేహితులు, ఇతర పిల్లలకు చెబుతూ వారికి సాయం చేయాలని కోరుతోంది. ఇది చిన్నపనే అయినప్పటికీ వారి జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకొస్తుంది సీమర్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన బాధితులంతా సీమర్ శిక్షణతో ధైర్యాన్ని కూడగట్టుకొంటూ జీవితంపై కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నారు. -
వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!
సాక్షి, ముంబై: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ధరలు మోత మోగనున్నాయి. ముఖ్యంగా ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్ (ఎస్ఎఫ్ఏ)’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాబోయే నెలల్లో సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల తయారీలో వినియోగించే కీలక ముడిపదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు కనున కేంద్రం ఆమోదం లభిస్తే ధరలు భారం తప్పదు. ఎస్ఎఫ్ఏ అనేది సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో కీలకమైంది. అలాగే ఈ పన్ను పెంపు ద్వారా ఇతర పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సోడియం లారెత్ సల్ఫేట్ (SLS) ఉత్పత్తిదారుపై ప్రభావాన్ని చూపుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఇండియాకుశాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది. దీంతో ఇప్పటికే మన దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున ఇది మరింత ధరల పెరుగుదలకు దారి తీస్తుందనే ఆందోళన ఉంది. ప్రతిపాదిత సుంకం సరుకు ఖర్చు, బీమా, సరుకువిలువలో 3 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) మరోవైపు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కొత్త టారిఫ్ నిర్మాణాన్ని వర్తింపజేయవద్దని ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ఐఎస్జీ) కన్వీనర్, మనోజ్ ఝా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ చర్యతో దిగువ ఉత్పత్తుల దిగుమతుల ధరలు పెరుగుతాయని, కంపెనీల లాభ దాయకతపై కూడా ప్రభావం చూపుతుందని, ఇది తదుపరి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చని పేర్కొన్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్!
దేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఉత్పత్తులలో.. ప్రొడక్ట్‌ని బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ముడిసరుకు ఖర్చుల మధ్య గత రెంవత్సరాలుగా ధరలను పెంచిన హెచ్‌యూఎల్ సంస్థ.. ఇటీవల ముడి సరుకు ధరలు అదుపులోకి రావడంతో పలు ప్రాడెక్ట్లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సామాన్యడికి కాస్త ఊరటనిస్తుంది. కాగా కరోనా మొదలుకొని అన్నీ రంగాలు డీలా పడడంతో దాని ప్రభావం చాలా వరకు సామాన్యలపై పడింది. ఈ క్రమంలో ఉద్యోగాల కోత, నిత్యవసరాలు, ఇంధన ధరలు ఇలా అన్ని పెరుగుతూ ప్రజలకు భారంగా మారిన సంగతి తెలిసిందే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ముడిసరుకు ధరలు గరిష్ట స్థాయిలో పెరిగాయి. దీంతో గత నాలుగు త్రైమాసికాల్లో, ఎఫ్ఎంసీజీ కంపెనీలు 8-15 శాతం మేర ధరలను పెంచాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తాజా ప్రకటనతో.. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, రిన్ డిటర్జెంట్ పౌడర్, లైఫ్‌బోయ్ సబ్బు, డోవ్ సోప్ వంటివి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. అయితే, కొందరి డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం, అన్ని ధర తగ్గించిన వస్తువులు ఇంకా మార్కెట్లోకి అందుబాటులో లేదని తెలిపారు. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం: 12వేల మంది ఉద్యోగులు ఇంటికి! -
Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే
Health Tips In Telugu: ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తలదురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు. ►దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. ►శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ►మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. చదవండి👉🏾 వయసు యాభై దాటిందా? పాలు,పెరుగు, చీజ్ తీసుకుంటే... -
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు!
ముంబై: దేశంలోని అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. గత నెలలో సబ్బులు & డిటర్జెంట్ల ధరలను పెంచిన కంపెనీ ఫిబ్రవరిలో మళ్లీ ధరలను పెంచినట్లు ఒక సంస్థ నివేదిక పేర్కొంది. మార్కెట్ ఎనలిస్ట్ సంస్థ ఎడెల్వీస్ ప్రకారం.. ఈ నెలలో సబ్బులు, డిటర్జెంట్లు & డిష్ వాష్ ఉత్పత్తుల ధరలను 3 నుండి 10 శాతం వరకు పెంచింది. "సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్, సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్, విమ్ బార్ & లిక్విడ్, లక్స్ & రెక్సోనా సబ్బులు, పాండ్స్ టాల్కమ్ పౌడర్, ఇతరులతో సహా అనేక ఉత్పత్తుల ధరలను పెంచినట్లు మా కంపెనీ తనిఖీలలో తేలింది" అని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్నీష్ రాయ్ చెప్పారు. దేశంలోని అతి పెద్ద కన్సుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ అక్టోబర్ నుంచి దాదాపు ప్రతి నెలా ఈ ఉత్పత్తుల ధరలను పెంచుతూ వస్తుంది. నవంబర్ నెలలో వీల్ డిటర్జెంట్ 1 కి.గ్రా ప్యాక్ ధరను 3.4 శాతం పెంచితే, డిసెంబర్ నెలలో లైఫ్ బోయి సబ్బులు, మీడ్-సెగ్మెంట్ లక్స్, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ కేక్, రిన్ డిటర్జెంట్ బార్ ధరలను 7 నుంచి 13 శాతం వరకు పెంచింది. గత నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది. ఎడెల్వీస్ అంచనాల ప్రకారం.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌యుఎల్ వివిద కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను సంవత్సరానికి 8 శాతం పెంచింది. ఈ ధరలు పెరగడటానికి ప్రధాన కారణం ముడిసరుకుల ధరల పెరగడమే అని కంపెనీ చెబుతూ వస్తుంది. (చదవండి: ఉబర్ రైడ్ చేసే కస్టమర్లకు గుడ్ న్యూస్..!) -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ల ధరలు
దేశంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద కూడా కనిపిస్తుంది. సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్), ఐటీసీ లిమిటెడ్ పేర్కొన్నాయి. దేశంలోని రెండు ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు ఇన్ పుట్ ఖర్చుల గణనీయంగా పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచినట్లు తెలిపాయి. హెచ్‌యుఎల్ తన 1 కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను 3.4 శాతం(రూ.2) పెంచింది. అలాగే, వీల్ పౌడర్ 500 గ్రాముల ప్యాక్ ధరను 2 రూపాయలు పెంచడంతో అంతిమ ధర రూ.28 నుంచి రూ.30కి పెరిగింది. ఇంకా, రిన్ బార్ 250 గ్రాముల ప్యాక్ ధరలను 5.8 శాతం పెంచింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం(రూ.25) పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ 100 గ్రాముల ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ వారి ప్యాక్ ధరలను 9 శాతం పెంచినట్లు సమాచారం. 150 మిలీ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 మిలీ బాటిల్ కు ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను కంపెనీ 7.1 శాతం పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. "ఇన్ పుట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో పరిశ్రమ ధరలను పెంచినట్లు" పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను మాత్రమే కంపెనీ పెంచినట్లు ఆయన తెలిపారు. మొత్తం ధరల పెంపును వినియోగదారుల మీద వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?) -
HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు సిద్ధంగా ఉంది. పామాయిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటగదిని దాటి బాత్రూమ్ని చేరాయి. ఇప్పటికే వంట నూనెల ధరతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు సబ్బులు మరో షాక్ ఇవ్వనున్నాయి. పామ్ ఆయిల్ ఎఫెక్ట్ సబ్బు తయారీలో పామ్ ఆయిల్ ఉత్పత్తులు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా పామ్ ఆయిల్ దిగుబడి తగ్గిపోయింది. దీంతో పామ్ ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఈ కారణాన్ని చూపుతూ స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. యూనీలీవర్ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తులపై రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు సీఎన్‌బీసీ పేర్కొంది. స్నానపు సబ్బులు, డిటర్జెంట్ సబ్బులు, పౌడర్ల ధరలను కనీసం 3.5 శాతం నుంచి 14 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. గ్రాముల్లో తగ్గింపు ప్రీమియం కేటగిరి, ఎక్కుడ డిమాండ్ ఉన్న ఐటమ్స్ విషయంలో ధరలు పెంచేందుకు హిందూస్థాన్ యూనిలీవర్ మొగ్గుచూపుతుండగా సాచెట్స్, తక్కువ ధరకు లభించే ఐటమ్స్ విషయంలో ధరల పెంపుకు సుముఖంగా లేదు. అయితే ధరల పెంపుకు బదులు ఆయా వస్తువుల సైజు తగ్గించాలని నిర్ణయించింది. అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారుడిపై నేరుగా భారం పడకుండా గ్రాముల్లో కోత విధించనుంది. చదవండి: ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!! -
అప్పటినుంచే వాడకం..ఆ సబ్బుపై నిషేధం
చేతులు శుభ్రంగా కడుక్కున్నావా ఈ మధ్య ప్రతీ ఇంట్లో వినిపిస్తున్న మాట. కరోనా కారణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తద్వారా ఏదైనా వస్తువును ముట్టుకున్నా, తినడానికి ముందు సబ్బుతో కానీ శానిటైజర్‌తో కానీ చేతులు శుభ్రపరుచుకోవడం అనివార్యం అయ్యింది. మన శరీరంలోనూ కొన్ని వేల సూక్షజీవులు ఉంటాయి. వాటి నుంచి అనారోగ్యానికి గురికాకుండా సబ్బుతో శుభ్రపరుచుకుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న సబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? దీన్ని ఎవరు కనుగొన్నారు ?సబ్బుల్లోనూ హానికారకమైనవి ఎలా గుర్తించాలి..ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లనే మనం ఫాలో అవుతున్నాం సబ్బును మొట్టమొదటగా పురాతన బాబీలోనియన్లు క్రీ.పూ. 2800 సంవత్సరంలోనే తయారుచేశారు. కలప, బూడిద, కొంచెం నీటిని వాడి సబ్బులా తయారుచేశారు. అయితే దీన్ని వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగించలేదు. కేవలం ఉన్ని, పత్తి లాంటి వాటిని శుభ్రపరిచేందుకు వినియోగించినట్లు తేలింది. అయితే ఆ తర్వాత బాబీలోనియన్లు ఉపయోగించిన పదార్థాలతోనే ఈజిప్టియన్లు సబ్బును తయారుచేసి పుండ్లు, చర్మ వ్యాధుల చికిత్స కోసం వినియోగించారు. రోమన్ శతాబ్దాం వరకు వ్యక్తిగత శుభ్రతకు సబ్బును వాడలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే దశాబ్దాలు మారినా బేసిక్ సబ్బు తయారీ విధానం మాత్రం మారలేదు. ఏ సబ్బు తయారీలో అయినా సాధారణంగా నీరు, నూనె ( వెజిటేబుల్ ఆయిల్ ) , బేసిక్ ఆల్కలీ, అయానిక్ ఉప్పు ను వాడతారు. సరైన నిష్పత్తిలో ఈ పదార్థాలన్నింటినీ కలపడం ద్వారా రసాయన ప్రక్రియ జరిగి సబ్బు తయారవుతుంది. ఈ పద్దతిని సోపోనిఫికేషన్ అంటారు. సబ్బు తయారీకి చల్లని ప్రక్రియ (కోల్డ్ ప్రాసెస్ ), వేడి ప్రక్రియ ( హాట్ ప్రాసెస్ ) అని రెండు పద్దతులను వాడతారు. అయితే వేడి ప్రక్రియ ద్వారానే సులభంగా సబ్బు చేయడానికి వీలుంటుందని రుజువైంది. ఆ సబ్బుపై నిషేదం నిత్యం ఎన్నో సూక్షజీవులతో మనం జీవిస్తున్నాం. సబ్బులో నీరు, నూనె వంటి గుణాలు ఉండటం వల్ల బాక్టీరియా, క్రిములు తొందరగా ఆకర్షించబడతాయి. దాదాపు 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవడం వల్ల క్రిములు నశిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..తడిచేతులను అలాగే వదిలేయరాదు. దీని వల్ల సూక్షజీవులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే టువాలు లేదా టిష్యూలు వాడి చేతులు తడిబారకుండా చూసుకోవాలి. అయితే అన్ని సూక్షజీవులు హానికారం కాదు. కొన్ని మనకు మేలుచేసేవి ఉంటాయి. ఏ సబ్బు అయినా క్రిములను చాలామేర తగ్గిస్తుంది కానీ మొత్తానికే వాటిని నాశనం చేయదు. అయితే యాంటీ బాక్టీరియల్ సబ్బులు మాత్రం బాక్టీరియా లోపలి కణ త్వచాలోకి వెళ్లి చంపేస్తుంది. ఈ సబ్బులోని ట్రైక్లోసన్ లేదా ట్రైక్లోకార్బన్ వంటి పదార్థాలు శరీరంపై దీర్ఘకాలిక దుష్ర్పభావాలను చూపిస్తుందని అధ్యయనంలో తేలడంతో 2016 నుంచి ఎఫ్‌డీఏ యాంటీ బాక్టీరియల్ సబ్బుల అమ్మకాలపై నిషేదం విధించింది. పీహెచ్ లెవల్ పెరిగితే చర్మ సమస్యలు ప్రస్తుతం శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే 60-95% ఆల్కహాల్ సాంద్రత కలిగిన హ్యాండ్ శానిటైజర్లు సూక్షజీవులను చంపడంలో ఎక్కువ శక్తిమంతమైనవి. అయితే ఎక్కువసార్లు శానిటైజర్ వాడటం వల్ల చేతులు పొడిబారే అవకాశం ఉంది. పీహెచ్ లెవర్ ఎక్కువగా ఉన్న సబ్బులు వాడటం వల్ల శరీరం దురద, మంట, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తక్కువ పీహెచ్ లెవల్ ఉన్న సబ్బులు వాడాలి. అంతే కాకుండా సబ్బులను డైరెక్ట్ గా వాడకుండా తప్పకుండా నీరు కలిపి వాడాలి. హెర్బల్, యాంటీ ఆక్నె, శరీరం చర్మ తత్వాన్ని బట్టి సబ్బులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
కరోనా : 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత
సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) కోవిడ్ -19 (కరోనా వైరస్) వ్యతిరేక పోరాటంలో తన వంతుగా ముందుకు వచ్చింది. భారతదేశంలో కరోనా వైరస్‌తో పోరాడటానికి రూ .100 కోట్లను సాయం అందిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది. వ్యక్తిగత, గృహ పరిశుభ్రతకు ఉపయోగించే ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించనున్నామని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్ధం ముఖ్యంగా లైఫ్‌బాయ్ శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్ వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరలను 15 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. తగ్గించిన ఈ ధరల ఉత్పత్తుల ఉత్పత్తిని వెంటనే ప్రారంభిస్తున్నామనీ, ఇవి రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లో లభిస్తాయని మీడియా ప్రకటనలో తెలిపింది. అంతేకాదు రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బులను ఉచితంగా పంపిణీ చేస్తామని హెచ్‌యుఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా తెలిపారు. లైఫ్‌బాయ్ శానిటైజర్స్, లైఫ్‌బాయ్ హ్యాండ్ వాష్ లిక్విడ్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ఉత్పత్తిని కూడా వేగవంతం చేశామనీ, రాబోయే వారాల్లో దీనిని మరింత పెంచడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తమలాంటి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందనీ, ప్రపంచ ఆరోగ్య విపత్తును అధిగమించేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. మరోవైపు సబ్బుల తయారీకి అవసరం అయ్యే ముడిసరుకుల ధరలు పెరిగినా సబ్బుల ధరలను తగ్గిస్తున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి. పతంజలి, గోద్రెజ్ తదితర సంస్థలు కూడా తమ సబ్బుల ధరలను 12.5 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపాయి. కాగా సరఫరా కంటే డిమాండ్ ఎక్కువ కాడంతో హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఈ ధరలపై నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం వీటి కొరత నేపథ్యంలో అక్రమాలను నిరోధించేందుకు వీటి ధరలపై ఆంక్షలు విధిస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. 200 మి.లీ బాటిల్ హ్యాండ్ శానిటైజర్ ధర రూ.100 మించరాదని, అలాగే సర్జికల్‌మాస్క్‌ల ధరలు, రూ. 8 రూ.10 మించకూడదని ఆయన వెల్లడించారు. 2020 జూన్ 30 వరకు ఈ ధరలను కట్టుబడి ఉండాలని,లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
అమెజాన్‌లో ఆవు పేడ సబ్బులు, మోదీ కుర్తాలు
ఆగ్రా : ఆవు పేడ సబ్బులు, మోదీ, యోగి కుర్తాలు ఎవరికైనా కావాలా? అయితే అవి ఇక నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో దొరుకుతాయట. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ఫార్మసీ, ఆవు పేడతో తయారు చేసిన డజన్ల కొద్దీ సహజ సౌందర్య, ఔషధ ఉత్పత్తులను అమెజాన్‌లోకి తీసుకొస్తుంది. ఆవు పేడ సబ్బుతో పాటు, మోదీ, యోగికి చెందిన కుర్తాలను కూడా వినియోగదారులకు అందిస్తుంది. దీన్ దయాల్ ధమ్ అనే సెంటర్‌ను ఆర్ఎస్ఎస్ మథురాలో నిర్వహిస్తోంది. ఇది తొలుత 30 వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్ట్‌లను, థెరఫెటిక్ ఉత్పత్తులను విక్రయించనుంది. వాటితో పాటు 10 స్టయిల్స్‌లో దుస్తులను డిజైన్ చేసి ఆన్‌లైన్‌గా అందించనుంది. తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌గా అందించే ముఖ్య ఉద్దేశ్యం, స్థానికంగా ఎక్కువ ఉద్యోగులను సృష్టించడమని, వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడమని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ చెప్పారు. ఆన్‌లైన్‌గా విక్రయాలు ప్రారంభమైతే, ఉత్పత్తి, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. లక్షకు పైగా వ్యక్తిగత సంరక్షణ, మెడికల్ ఉత్పత్తులను, దుస్తులను దీన్ దయాల్ ధమ్ విక్రయించనుంది. వీటి విలువ ప్రతి నెల రూ.3 లక్షలకు పైననే ఉండనుంది. తమ కామధేను లైన్లో ఆవు మూత్రం, కుర్తాలను, ఇతర ఖాదీ ఉత్పత్తులను త్వరలోనే అమెజాన్‌లో అందుబాటులోకి తెస్తామని దీన్ దయాల్ ధమ్ డిప్యూటీ సెక్రటరీ మనీష్ గుప్తా చెప్పారు. గన్వటి, తులసి, ఉసిరి, మిరియాలు, మధుమేహం, ఊబకాయం కోసం కామధేను మధునాశక్ చుర్, హారతీలు, షాంపులు, బాత్ షోపులు, ఫేస్ ప్యాక్, టూత్‌పేస్ట్ వంటి ఉత్పత్తులను అందించబోతుంది. తమ సోపులకు, ఫేస్‌ప్యాక్‌లకు ఆవు మూత్రం, ఆవు పేడ ప్రధానమైన పదార్థాలుగా వాడినట్టు మనీష్ తెలిపారు. ప్రస్తుతం 10 మంది వర్కర్లతో, 90 ఆవులు, దూడలతో ఈ ఫార్మసీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారు చేసిన ఉత్పత్తులను దీన్ దయాల్ ధమ్ లేదా ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లోనే విక్రయించేవారు. ఇక నుంచి వీటిని అమెజాన్ ద్వారా కూడా అందించబోతున్నారు. ఆన్లైన్ కస్టమర్లలో ఆవు మూత్ర ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, ఇదే ఉత్పత్తిని పెంచుతుందని ధమ్ డైరెక్టర్ రాజేంద్ర చెప్పారు. ధమ్కు చెందిన అన్ని ఉత్పత్తులు 10 రూపాయల నుంచి 230 రూపాయల మధ్యలోనే అందించనున్నట్టు పేర్కొన్నారు. మోదీ, యోగి కుర్తాలు కూడా ఒక్క పీస్ రూ.220నేనని తెలిపారు. వైట్, గ్రే, పింక్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. వీటిని కూడా 50 మంది వర్కర్లే తయారు చేస్తున్నారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. రెండు జతల ట్రౌజర్లు కుడితే రోజుకు రూ.120 ఆర్జించవచ్చు. -
సెల్‌ఫోన్ ఆర్డర్ చేస్తే...సబ్బు బిల్లలు వచ్చాయి
-
లారీ డ్రైవర్, క్లీనర్‌పై ఫిర్యాదు
సబ్బులు దొంగలించారని డ్రైవర్, క్లీనర్‌పై లారీ ఓనర్ నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కర్ణాటక నుంచి లారీలో సబ్బులు (సోప్) తీసుకువచ్చిన డ్రైవర్ కదిరప్ప, క్లీనర్ హాజీవలిలు వినియోగదారులకు చేర్చకుండా దొంగిలించారని యజమాని నీలకంఠ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. -
శతాబ్దాల సబ్బు
ఫ్లాష్‌బ్యాక్ ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు, సౌందర్య సాధనంగా కూడా రకరకాల సబ్బులను ఉపయోగిస్తున్నాం మనం. మన దేశంలో ఒకప్పుడు సబ్బుల వాడుక చాలా తక్కువ. పాశ్చాత్య వలస పాలకుల ద్వారానే ఇవి మనకు పరిచయమయ్యాయి. అలాగని సబ్బు ఆధునిక ఆవిష్కరణేమీ కాదు. క్రీస్తుపూర్వం నుంచే సబ్బు వంటి పదార్థాలు వాడుకలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన బాబిలోనియన్ ప్రజలు క్రీస్తుపూర్వం 2800 ఏళ్ల కిందటే సబ్బు వంటి పదార్థాన్ని వాడేవారు. నీరు, క్షార పదార్థం, కాసియా నూనెలతో సబ్బు వంటి పదార్థాన్ని తయారు చేసే ఫార్ములా రాసి ఉన్న బాబిలోనియన్ల రాతి పలక ఒకటి తవ్వకాల్లో బయటపడింది. అది క్రీస్తుపూర్వం 2200 ఏళ్ల నాటిదని పరిశోధకులు అంచనా వేశారు. ప్రాచీన ఈజిప్షియన్లు సైతం క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో క్షార పదార్థాలు, శాకాహార నూనెలు, జంతువుల కొవ్వులు ఉపయోగించి సబ్బువంటి పదార్థాన్ని తయారు చేసేవారు. అప్పట్లో చైనా వారు సబ్బుల తయారీలో నూనెలు, కొవ్వులు, క్షారాలతో పాటు మూలికలను కూడా వాడేవారు. క్రీస్తుశకం పదమూడో శతాబ్ది నాటికి పశ్చిమాసియా ప్రాంతంలో సబ్బుల తయారీ కుటీర పరిశ్రమ స్థాయికి ఎదిగింది. పదిహేనో శతాబ్ది ద్వితీయార్ధం నాటికి ఫ్రాన్స్‌లో సబ్బుల తయారీ పరిశ్రమ బాగా పుంజుకుంది. అయితే, పారిశ్రామిక విప్లవానికి ముందు సబ్బుల పరిశ్రమలు అక్కడక్కడా ఉన్నా, వాటి ఉత్పత్తి పరిమితంగానే ఉండేది. పారిశ్రామిక విప్లవం తర్వాత 19వ శతాబ్దిలో పలు పరిశ్రమలు భారీస్థాయిలో సబ్బుల తయారీ ప్రారంభించాయి. అప్పటి నుంచే రకరకాల ఆకారాలు, రంగులు, పరిమళాలతో ఆకర్షణీయమైన ప్యాకింగులతో బ్రాండెడ్ సబ్బులు మార్కెట్‌ను ముంచెత్తడం మొదలైంది. విస్తృత వ్యాపార ప్రచారం కూడా తోడవడంతో సబ్బుల వాడుక వెనుకబడిన దేశాలకూ పాకింది. -
ఆల్ దందా అక్రమం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పేరు ఒక్కటే ధరలోనే వ్యత్యాసం... తరచి చూస్తే సరుకు నాసిరకం. కాస్త ఆదమరిచారంటే దుకాణదారుడు నాణ్యతలేని వస్తువులను అంటగట్టి తీరుతాడు. సిగరెట్లు, టీ పొడి, సబ్బులు, నూనెడబ్బాల నకిలీల విక్రయాల తీరిది. మరోవైపు రోజుకు లక్షల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నా, ప్రభుత్వానికి చూపుతున్న లెక్కలు అంతంత మాత్రమే. బోధన్, నిజామాబాద్ ప్రాంతాల్లో నలుగురు (ఆ యిల్ దందా) వ్యాపారులు ఏటా రూ.15 కోట్ల పై బడిన వ్యాపారం చేస్తున్నా రూ.4 కోట్ల వరకే టర్నోవర్ చూపిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులు వాణిజ్య పన్నుల అధికారులకు పట్టడం లేదు. నిజామాబాద్ డీసీ కార్యాలయం పరిధిలోని నిజామాబాద్-1,2,3 లతో పాటు కామారెడ్డి, బోధన్ సీటీవో కార్యాలయాల పరిధిలో యథేచ్ఛగా దందా సాగుతున్నా పట్టించుకునేవారు లేరు. అక్రమ వ్యాపారాలను తని ఖీలతో నియంత్రించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా సరుకులు రవాణా అవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి వ్యాపార సంస్థలలో లెక్కలేనన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో వాణిజ్య పన్నుల శాఖ ఒక్క అక్రమాన్ని వెలికి తీసినట్లుగానీ, అపరాధ రుసుము వసూలు చేసినట్టుగానీ దాఖలాలుగానీ లేవు. ఆడిట్ మాత్ర మే పూర్తి చేస్తున్నారు. తెర వెనుక అక్రమాలు మా త్రం విచ్చల విడిగా సాగుతున్నాయి. కొనుగోలు చేసిన సరుకులకు రశీదులు ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్న సంస్థలు బహిరంగంగానే నడుస్తున్నాయి. కొన్ని వ్యాపారసంస్థలు ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి. చట్టపరంగా చెల్లించాల్సిన పన్నులను దొడ్డిదారిన కొంతమంది అధికారులకు ముట్ట చెబుతున్నారు. జేబులు నిండితే చాలు ప్రభుత్వ ఖజానాకు ఎందుకు దండగ అనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పండుగల సీజన్ రావడం తో కొత్త కొత్త ఆఫర్లు కొంతమంది అధికారులకు ధనలక్ష్మిని గుప్పిట్లో తెచ్చిపెడుతున్నాయి. నిబంధనల ప్రకారం 12 నెలల్లో రూ.40 లక్షల వ్యాపారం సాగితే వ్యాట్ పరిధిలోకి వస్తాయి. అంతకు ముందు తగిన పన్ను చెల్లించాలి. వాటిని నిశితంగా పరిశీ లించాల్సినఅధికారులు మాత్రం ఆదమరిచి వ్యవహరిస్తున్నారు. మి గతా విషయాలలో ఆవురావురంటున్నారు. ఫలితం ప్రజల సొమ్ముకు గండి. ఇందుకు నిదర్శనమే ఈ శాఖ కార్యాలయం పరిధి లో ఈ ఏడాది ఎలాంటి దాడులు జరపకపోవడం... కేసులు నమోద చేయకపోవడం. మార్గదర్శకాలకు మంగళం ఏ వ్యాపారైనా వాణిజ్య పన్నులశాఖ నిబంధనలకు లోబడి వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సి ఉంది. అయితే కొందరు అవినీతి అధికారుల అండదండలతో వ్యా పారులు ‘చీకటి’ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. రూ.40 లక్షల వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలు తప్పకుండా వ్యాట్ డీలర్ షిప్ పొందాలి. జిల్లాలోని నిజామా బాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఈ నిబంధనలను పాటిస్తున్న వ్యాపారులు చాలా అరుదు. దేశీయ వ్యాపార నిబంధనల ప్రకారం డీలర్లు సరుకుల దిగుమతి అర్హులు కాగా మహారాష్ట్ర నుంచి యధేచ్చగా బియ్యం, చక్కెర దిగుమతి జరుగుతోంది. వరి ధాన్యంతో పాటు పత్తి, సోయా, మొక్కజొన్న లతో పాటు ఇతర రాష్ట్రాలకు సరుకుల క్రయ, విక్రయాల సమయంలో కేంద్ర విక్రయ పన్ను చట్టం 1956 ప్రకారం చెల్లించాలన్న నిబంధనలకు మంగళం పాడేస్తున్నారు. ప్రతి విక్రయదారుడు రూ.100లు దాటిన సరుకులపై కొనుగోలుదారునికి బిల్లు రశీదు ఇవ్వాలన్న నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఇవన్నీ వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఖజానాకు పెద్ద మొత్తంలో గండి పడుతోంది. -
సం‘క్షామ’ హాస్టళ్లు !
సాక్షి, నెట్వర్క్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. వసతి గృహాలు శిథిలావస్థకు చేరడం, కిటికీలు, తలుపులు లేక మరుగుదొడ్లు కంపు కొడుతుండడం, ఉన్నవాటికి నీటి వసతి లేకపోవడం, కనీసం తాగడానికి కూడా మంచినీరు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇంకా పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు, సబ్బులు, నోట్ బుక్స్ అందలేదు. కొన్ని హాస్టళ్లలో గదులకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో దోమల బాధతో విద్యార్థులు జాగారం చేస్తున్నారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ, ఆశమ్ర పాఠశాలల్లో సరిపడా సరుకులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ చేసిన పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్లేట్లు, గ్లాసులు, సబ్బులు, దుప్పట్లు ఏమీ లేవు.. జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 77 ఉండగా ఇందులో 52 బాలురు, 25 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం 8 వేల సీట్లకు గాను 3,847 సీట్లు ప్రస్తుతం భర్తీ అయ్యాయి. బీసీ హాస్టళ్లు 67 ఉండగా.. 37 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో 5 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు పెట్టెలు, దుప్పట్లు అందజేసినట్లు అధికారులు చెబుతున్నా చాలా హాస్టళ్లకు ఇవి అందలేదు. ఇక బీసీ హాస్టళ్ల విద్యార్థులకు అసలు పెట్టెలు, దుప్పట్లు, ప్లేటు, గ్లాసులు, సబ్బులు ఇంకా రానే లేదు. ఐటీడీఏ, మైదాన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు 365, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 75, వసతి గృహాలు 45 ఉన్నాయి. వీటిలో 36 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా ఈ హాస్టళ్లలో భోజనం అందిచేందుకు సరిపడ సరుకులు లేవు. ప్రభుత్వం నుంచి రూ.2.50 కోట్లు రావాల్సిన బిల్లు పెండింగ్‌లో ఉండడమే దీనికి కారణం. దీంతో ఈ హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం సరిపోవడం లేదు. చాలా చోట్ల వార్డెన్లు లేకపోవడం, ఇన్చార్జులు పర్యవేక్షించాల్సి రావడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది. కొన్ని చోట్ల రెగ్యులర్‌గా కుక్‌లు లేకపోవడంతో ఏ రోజుకారోజు కూలీలను పెట్టి వండించి పెడుతున్నారు. ఇక ఎప్పటిలాగే రక్షిత మంచి నీటి వ్యవస్థ లేకపోవడం, టాయిలెట్లు సరిగా లేకపోవడం లాంటి సమస్యలు విద్యార్థులను పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే అనే రీతిలో సంక్షేమ హాస్టళ్లలో ఎదురవుతున్న సమస్యలు ఎప్పటికి తీరుతాయో ఆ పాలకులకే తెలియాలి. -
సబ్బులు తళతళ.. బతుకులు వెలవెల
కనీస వేతనాల్లేని గిరిజన కార్మికులు ఉద్యోగ భద్రత లేకున్నా ఊడిగం జీసీసీ సబ్బుల తయారీ కేంద్రంలో శ్రమ దోపిడీ అరకులోయ : శరీరాన్ని మెరిపించే సబ్బుల తయారీ కార్మికుల బతుకులు మాత్రం వెలవెలబోతున్నాయి. ఎన్నాళ్లు పనిచేసినా కనీస వేతనాలకు నోచుకోలేకపోతున్నాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు చేస్తున్న విజ్ఞప్తులు అరణ్య రోదనలవుతున్నాయి. 2007-2008 సంవత్సరంలో అరకులోయ జీసీసీ కార్యాలయానికి ఆనుకుని అలోవెరా(రీతు) సబ్బుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సబ్బుల తయారిలో ముందుగానే శిక్షణ పొందిన 27 మంది గిరిజన యువతకు ఇందులో ఉపాధి కల్పించారు. ఆరేళ్లయినా కనీస వేతనాల్లేవు ఈ కేంద్రాన్ని స్థాపించిన ఆరేళ్లయినా కనీస వేతనాలను అమలు చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కార్మికులు 35 గ్రాముల, 75 గ్రాములు, 100 గ్రాముల సబ్బులు 9 వేల నుంచి 13 వేల వరకు తయారు చేస్తారు. వీటి విలువ సుమారు రూ.1.70 లక్షలుంటుంది. వీరికి రోజుకు దక్కేది రూ.100 నుంచి రూ.120 మాత్రమే. 35 గ్రాముల సబ్బులు తయారు చేసిన రోజు ఒక్కొక్క సబ్బుపై 35 పైసల చొప్పున చెల్లిస్తారు. దీంతో ఇక్కడ పనిచేసే 27 మంది కార్మికులు పని పంచుకుంటే రోజువారి కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. విద్యుత్ కోత, ముడి సరుకులు అందుబాటులో లేనప్పుడు నెలలో సుమారు 20 రోజులు పని ఉంటుందని, మిగిలిన రోజులు ఖాళీగా ఉండటం వల్ల అన్ని రకాలుగా నష్టపోతున్నట్లు కార్మికులు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులకెళ్లినా, ఇంతకన్నా ఎక్కువ కూలీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్బుల తయారీతో జీసీసీకి నెలకు సుమారు రూ.25 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతున్నా కార్మికుల సంక్షేమం శూన్యం. ఉద్యోగులుగా గుర్తించాలి ఏళ్ల తరబడి నుంచి సబ్బుల తయారీ కేంద్రం లో పని చేస్తున్న కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలి. సబ్బుల పేర్ల ముద్రణలో గాయపడినా పట్టించుకునే వారే లేరు. సేఫ్టీ మెటీరి యల్, యూనిఫాంలు అందజేయలేదు. కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదు. జీసీసీ ఎమ్డీ మాకు న్యాయం చేయాలి. - వి.సింహాచలం, కార్యదర్శి, సబ్బుల తయారీ కార్మిక సంఘం ఎంత శ్రమించినా ప్రయోజనం లేదు సబ్బుల తయారీ కేంద్రంలో ఎంత శ్రమించినా ప్రయోజనం లేదు. రోజువారి కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీస వేతనాలను అమలు చేస్తే బావుంటుంది. - వి.సింహాద్రి, అధ్యక్షుడు, సబ్బుల తయారీ కార్మికుల సంఘం