సబ్బులు తళతళ.. బతుకులు వెలవెల
- కనీస వేతనాల్లేని గిరిజన కార్మికులు
- ఉద్యోగ భద్రత లేకున్నా ఊడిగం
- జీసీసీ సబ్బుల తయారీ కేంద్రంలో శ్రమ దోపిడీ
అరకులోయ : శరీరాన్ని మెరిపించే సబ్బుల తయారీ కార్మికుల బతుకులు మాత్రం వెలవెలబోతున్నాయి. ఎన్నాళ్లు పనిచేసినా కనీస వేతనాలకు నోచుకోలేకపోతున్నాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు చేస్తున్న విజ్ఞప్తులు అరణ్య రోదనలవుతున్నాయి. 2007-2008 సంవత్సరంలో అరకులోయ జీసీసీ కార్యాలయానికి ఆనుకుని అలోవెరా(రీతు) సబ్బుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సబ్బుల తయారిలో ముందుగానే శిక్షణ పొందిన 27 మంది గిరిజన యువతకు ఇందులో ఉపాధి కల్పించారు.
ఆరేళ్లయినా కనీస వేతనాల్లేవు
ఈ కేంద్రాన్ని స్థాపించిన ఆరేళ్లయినా కనీస వేతనాలను అమలు చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కార్మికులు 35 గ్రాముల, 75 గ్రాములు, 100 గ్రాముల సబ్బులు 9 వేల నుంచి 13 వేల వరకు తయారు చేస్తారు. వీటి విలువ సుమారు రూ.1.70 లక్షలుంటుంది. వీరికి రోజుకు దక్కేది రూ.100 నుంచి రూ.120 మాత్రమే. 35 గ్రాముల సబ్బులు తయారు చేసిన రోజు ఒక్కొక్క సబ్బుపై 35 పైసల చొప్పున చెల్లిస్తారు. దీంతో ఇక్కడ పనిచేసే 27 మంది కార్మికులు పని పంచుకుంటే రోజువారి కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు.
విద్యుత్ కోత, ముడి సరుకులు అందుబాటులో లేనప్పుడు నెలలో సుమారు 20 రోజులు పని ఉంటుందని, మిగిలిన రోజులు ఖాళీగా ఉండటం వల్ల అన్ని రకాలుగా నష్టపోతున్నట్లు కార్మికులు తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులకెళ్లినా, ఇంతకన్నా ఎక్కువ కూలీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్బుల తయారీతో జీసీసీకి నెలకు సుమారు రూ.25 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతున్నా కార్మికుల సంక్షేమం శూన్యం.
ఉద్యోగులుగా గుర్తించాలి
ఏళ్ల తరబడి నుంచి సబ్బుల తయారీ కేంద్రం లో పని చేస్తున్న కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలి. సబ్బుల పేర్ల ముద్రణలో గాయపడినా పట్టించుకునే వారే లేరు. సేఫ్టీ మెటీరి యల్, యూనిఫాంలు అందజేయలేదు. కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదు. జీసీసీ ఎమ్‌డీ మాకు న్యాయం చేయాలి.
- వి.సింహాచలం, కార్యదర్శి, సబ్బుల తయారీ కార్మిక సంఘం
ఎంత శ్రమించినా ప్రయోజనం లేదు
సబ్బుల తయారీ కేంద్రంలో ఎంత శ్రమించినా ప్రయోజనం లేదు. రోజువారి కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీస వేతనాలను అమలు చేస్తే బావుంటుంది.
- వి.సింహాద్రి, అధ్యక్షుడు, సబ్బుల తయారీ కార్మికుల సంఘం