అంగన్వాడీల ఆకలికేకలు
♦ జిల్లాలో 6వేలమందికిపైగా కార్యకర్తలు, ఆయాలు
♦ మూడు నెలలుగా అందని వేతనాలు
♦ ఆర్నెళ్లుగా అందని కేంద్రాల అద్దెలు
♦ ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న వైనం
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 196 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు గత ఏప్రిల్ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అలాగే గత జనవరి నుంచి ఇంటి అద్దె బకాయిలు రావాల్సి ఉంది. పట్టణ ప్రాంతం కావడంతో రూ.3,500 వరకు అద్దె చెల్లించి అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
నెలల తరబడి బకాయిలు రాని కారణంగా వీరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 328 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలు రాకపోగా గతేడాది నవంబర్ నుంచి ఇంటి అద్దెల బకాయిలు చెల్లించలేదు. అలాగే కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్ చార్జీల బకాయిలు కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రొద్దుటూరులోనే కాదు జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అనేక ఆందోళనల ఫలితంగా అంగన్‌వాడీల వేతనాలను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఏప్రిల్ నుంచి అసలు అంగన్‌వాడీ కార్యకర్తలతోపాటు అయాలకు వేతనాలు అందలేదు. దీంతోపాటు నెలల తరబడి అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలతోపాటు కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్ చార్జీలను కూడా చెల్లించకపోవడం విచారకరం. దీంతో ఆర్థికంగా అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు సంబంధించి కడప అర్బన్, కడప రూరల్, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, బద్వేలు, సిద్ధవటం, పోరుమామిళ్ల, జమ్మలమడుగు, కమలాపురం, రైల్వేకోడూరు, ముద్దనూరు, పులివెందుల ప్రాజెక్టుల పరిధిలో సుమారు 6,500 మందికిపైగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు.
బడ్జెట్ కోసం ఎదురుచూపులు...
సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు ఏ ప్రాజెక్టుకు బడ్జెట్ విడుదల కాలేదు. దీంతో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ కోసం అధికారులతోపాటు అంగన్‌వాడీలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ సబ్ ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి ఈఏడాది జనవరి నుంచి ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఆన్‌లైన్‌లో వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. అలాంటిది మాటమరిచి సాధారణ పద్ధతుల్లోనే చెల్లించడానికి పూనుకుంది. ఆ ప్రకారం కూడా వేతనాలు రాకపోవడం గమనార్హం.