babysitter
-
ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?
అది 1999 జూలై 15. తెల్లవారుజామున మూడు కావస్తోంది. అమెరికా మిస్సోరీ, సెయింట్ లూయీలోని రిచ్మండ్ హైట్స్‌లో 1600 బ్లాక్ ముందు ఉన్నట్టుండి అలజడి రేగింది. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు.. పోలీస్ హారన్స్‌తో ఉలిక్కిపడి లేచారు. చాలాసేపటి నుంచి తమ పక్క ఇంట్లో పసికందు ఏడుపు వినిపిస్తోందని.. తమకేదో అనుమానంగా ఉందని ఓ కుటుంబం.. ఎమర్జెన్సీ కాల్ చేయడంతోనే పోలీసులు అక్కడికి వచ్చారు. సదరు కుటుంబమిచ్చిన సమాచారంతో.. అంతా ఆ అనుమానాస్పద ఇంటి తలుపు తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. లోపల బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే బయటున్నవారందరికీ హృదయం ద్రవించిపోతోంది. తీరా తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఆ పసిపాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. దాంతో అంతా షాకయ్యారు. ఇరుగూ పొరుగూ ఆ పాపని సేదతీర్చే పనిలో పడ్డారు. కాసేపటికి పోలీసు కన్ను పడకగదిలో రక్తపుచుక్కల్ని పసిగట్టింది. వెంటనే ఇల్లంతా శోధించారు. రక్తం మరకలున్న చేతి రుమాలు, చెత్తబుట్ట వెనుక రక్తంతో తడిసిన తలదిండ్లు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు.. అదో మిస్టీరియస్ కేసుగా మిగలబోతోందని అక్కడున్న వారెవ్వరికీ తెలియదు. ఈ పాప తల్లిదండ్రులు.. డానా మాడెన్(తల్లి), క్రిస్టోఫర్ హెర్బర్ట్(తండ్రి) అనే దంపతులు. వాళ్లు ఆఫీసులకు వెళ్లినప్పుడు పాపని చూసుకోవడానికి ఎవరో తెలిసిన వాళ్ల అమ్మాయిని కేర్ టేకర్‌గా పెట్టి వెళ్తారని.. కనీసం ఆ అమ్మాయి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని.. పోలీసులకు స్థానికుల్లో కొందరు చెప్పారు. అసలు చంటిపాపను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎవరు? అని ఆరా తీస్తే.. పన్నెండేళ్ల హెదర్ కులోర్న్ అని.. తను, మాడెన్ స్నేహితురాలైన క్రిస్టీన్ కులోర్న్ కూతురని తేలింది. బ్లో మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ పాప.. మాడెన్ కూతురికి కేర్‌టేకర్‌గా ఉండేదట. క్రిస్టీన్, మాడెన్, హెర్బర్ట్లతో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి పాపతో ఆ ఇంట్లో ఉన్నది హెదరేనని పోలీసులకు స్పష్టమైంది. రెండు రోజులకు ఆ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షకు పంపిస్తే.. ఆ రక్తం హెదర్దేనని తేలింది. అసలు హేథర్కి ఏమైంది? ‘కేవలం మా పసిబిడ్డను చూసుకోవడానికే ఆ బాలికను ఇంట్లో ఉంచాం. ఆ రాత్రి మేము ఆ ఇంట్లో లేకపోవడం వల్ల ఏం జరిగిందో? హెదర్ని ఎవరు ఏం చేశారో? మాక్కూడా తెలియదు’ అని చెప్పుకొచ్చారు మాడెన్ దంపతులు. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆ అపార్ట్మెంట్ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దుప్పట్లో ఏదో బరువైనది మోసుకుని వెళ్లడాన్ని తాను చూసినట్టు ఓ సాక్షి చెప్పాడు. అయితే ఆ దుండగుడ్ని అతడు గుర్తించలేకపోయాడు. ఆ దుప్పట్లో ఉన్నది హెదర్ మృతదేహం కావచ్చని కొందరు నమ్మారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాల్లేవు. హెదర్ కోసం ఆమె తల్లి క్రిస్టీన్ గుండెలవిసేలా ఏడ్చింది. ‘నా బిడ్డకు మధుమేహం ఉంది.. తనకు మందులు అందకపోతే ఎక్కువ కాలం బతకలేదు. రోజువారీ ఇన్సులిన్ ఇస్తూ, తరచుగా రక్తపరీక్ష చేస్తూ ఉండాలి. దయచేసి నా బిడ్డను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వదిలిపెట్టండి’ అంటూ మీడియా ముఖంగానే వేడుకుంది. అయినా హెదర్ సమాచారం బయటికి రాలేదు. ఆ తల్లి వ్యథ ఎందరినో కంటతడి పెట్టించింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. ప్రీప్లాన్‌గానే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారని.. అది హేథర్కి తెలిసినవారి పనేనని.. రక్తపు ఆనవాళ్లు ఉన్నాయంటే చంపేసి ఉంటారని కూడా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే మృతదేహం దొరక్కపోవడంతో క్రిస్టీన్ తన న్యాయపోరాటాన్ని ఆపలేదు. తొమ్మిది నెలలు గడిచినా కేసులో ఎలాంటి పురోగతిలేదు. దాంతో ‘హెదర్ ఎక్కడ?’ అంటూ.. మాడెన్, హెర్బర్ట్లను అరెస్ట్ చేసి.. గట్టిగా నిలదీశారు. కానీ ఆ దంపతులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. మాడెన్ ఆ రాత్రి నైట్ షిఫ్ట్‌లో ఉందని తేలినప్పటికీ.. హెర్బర్ట్ ఎక్కడున్నాడనే దానిపై సరైన క్లారిటీ రాలేదు. అతడు పొంతన లేని ఎన్నో సమాధానాలిచ్చి.. ఆధారాలు లేక నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే క్రిస్టీన్ మాత్రం.. ‘తన కూతురు మాయం కావడానికి అసలు కారణం మాడెన్ దంపతులకు కచ్చితంగా తెలిసే ఉంటుంది’ అని నమ్మింది. ఆ క్రమంలోనే దర్యాప్తులో మరో నిజం బయటపడింది. మిస్సోరీలోని ప్రధాన డ్రగ్స్ మూలాలు ఆ అపార్ట్మెంట్లోనూ ఉన్నాయనే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అంటే అపార్ట్మెంట్లో రహస్యంగా ఉన్న చట్టవిరుద్ధమైన ఆ ల్యాబ్ గురించి హెదర్‌కి తెలిసి ఉంటుందని.. అపార్ట్మెంట్ గ్యారేజీలో మాదకద్రవ్యాల కార్యకలాపాలను ఆమె కళ్లారా చూసి ఉంటుందని.. అందుకే బలవంతంగా అపహరించి, హత్య చేసి ఉంటారని విశ్వసించారు. ఇది పరిష్కారం కాకుండానే.. క్రిస్టీన్ 2017 డిసెంబర్ 16న కన్నుమూసింది. ఏదైమైనా హెదర్‌కి ఏమైందనేది మాత్రం బయటపడలేదు. ఒకవేళ సీరియల్ కిల్లర్ దాడి చేసి ఉంటాడా? మాడెన్ భర్త హెర్బర్ట్ దురుద్దేశంతో హెదర్ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి, చంపేశాడా? లేదంటే హెదర్ తన స్నేహితుల్ని గుడ్డిగా నమ్మి.. ఆ ఇంటికి ఆహ్వానించి మోసపోయిందా? అనేది మాత్రం నేటికీ తేలలేదు. 12 ఏళ్ల హెదర్ కులోర్న్ అదృశ్యమై.. 24 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కేసులో హెదర్ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప మిస్టరీ అయితే వీడలేదు. సంహిత నిమ్మన (చదవండి: ఆ దేశంలోని టొమోటా ధర వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
అంగన్వాడీల ఆకలికేకలు
♦ జిల్లాలో 6వేలమందికిపైగా కార్యకర్తలు, ఆయాలు ♦ మూడు నెలలుగా అందని వేతనాలు ♦ ఆర్నెళ్లుగా అందని కేంద్రాల అద్దెలు ♦ ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న వైనం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 196 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గత ఏప్రిల్ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అలాగే గత జనవరి నుంచి ఇంటి అద్దె బకాయిలు రావాల్సి ఉంది. పట్టణ ప్రాంతం కావడంతో రూ.3,500 వరకు అద్దె చెల్లించి అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. నెలల తరబడి బకాయిలు రాని కారణంగా వీరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 328 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలు రాకపోగా గతేడాది నవంబర్ నుంచి ఇంటి అద్దెల బకాయిలు చెల్లించలేదు. అలాగే కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్ చార్జీల బకాయిలు కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రొద్దుటూరులోనే కాదు జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అనేక ఆందోళనల ఫలితంగా అంగన్వాడీల వేతనాలను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఏప్రిల్ నుంచి అసలు అంగన్వాడీ కార్యకర్తలతోపాటు అయాలకు వేతనాలు అందలేదు. దీంతోపాటు నెలల తరబడి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలతోపాటు కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్ చార్జీలను కూడా చెల్లించకపోవడం విచారకరం. దీంతో ఆర్థికంగా అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు సంబంధించి కడప అర్బన్, కడప రూరల్, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, బద్వేలు, సిద్ధవటం, పోరుమామిళ్ల, జమ్మలమడుగు, కమలాపురం, రైల్వేకోడూరు, ముద్దనూరు, పులివెందుల ప్రాజెక్టుల పరిధిలో సుమారు 6,500 మందికిపైగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. బడ్జెట్ కోసం ఎదురుచూపులు... సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు ఏ ప్రాజెక్టుకు బడ్జెట్ విడుదల కాలేదు. దీంతో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ కోసం అధికారులతోపాటు అంగన్వాడీలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ సబ్ ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి ఈఏడాది జనవరి నుంచి ప్రభుత్వం అంగన్వాడీలకు ఆన్లైన్లో వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. అలాంటిది మాటమరిచి సాధారణ పద్ధతుల్లోనే చెల్లించడానికి పూనుకుంది. ఆ ప్రకారం కూడా వేతనాలు రాకపోవడం గమనార్హం. -
వాతలు పెట్టిన ఆయాలపై వేటు
మంకమ్మతోట(కరీంనగర్): కరీంనగర్ పట్టణంలోని ఐసీడీఎస్ శిశుగృహంలో జరిగిన అమానుష ఘటనపై జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఆయాలను సర్వీసు నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసులకు ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ శిశుగృహంలో విధుల్లో ఉన్న ఇద్దరు ఆయాలు ఎనిమిది మంది చిన్నారులకు స్పూన్‌తో కాల్చి వాతలు పెట్టారు. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం మంగళవారం వెలుగు చూసిన విషయం తెలసిందే. దీంతో కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం శిశుగృహాన్ని సందర్శించారు. చిన్నారులతో మాట్లాడారు. ఐసీడీఎస్ పీడీ మోహన్‌రెడ్డిపై ఆమె సీరియస్ అయ్యారు. శిశుగృహంలో కాంట్రాక్టుపై పని చేస్తున్న ఆయాలు బుచ్చమ్మ, శారద, పద్మలను సర్వీసు నుంచి తొలగించాలని ఆదేశించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారు. -
ఓ చేతిలో తెగిన పాప తలను పట్టుకొని..
మాస్కో: ఓ చేతిలో రక్తం ఓడుతున్న నాలుగేళ్ల బాలిక తలను పట్టుకొని, మరో చేయెత్తి ‘అల్లా హో అక్బర్’ నినాదులు చేస్తూ నగరంలోని ఓ మెట్రో స్టేసన్ వద్ద ఆదివారం బురఖా ధరించి కనిపించిన ఓ 38 ఏళ్ల మహిళను చూసి బాటసారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తన పాపను చంపారని, దగ్గరికొస్తే అందర్ని పేల్చేస్తానంటూ కూడా ఆ మహిళ బెదిరించారు. తాను ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తానంటూ కూడా ఆమె నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఓక్త్యాబ్రస్కోయి మెట్రో రైల్వే స్టేషన్‌ను కొంతసేపు మూసివేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. నస్త్యా ఎం అనే నాలుగేళ్ల బాలికను తానే చంపానని, ఆ పాప తల్లిదండ్రులతోపాటు అందరికి ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే తాను ఇలా పాప తలను పట్టుకొని నినాదాలను చేసినట్లు ఆమె చెప్పారు. ఆమెను ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నాని గ్యుల్చెహరా బబోకులోవాగా గుర్తించారు. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం ఆమె గత 18 నెలలుగా ఓర్యో ప్రాంతంలోని నస్త్యా ఇంట్లో ఆమెకు బేబీ సిట్టర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం నాడు నస్త్యా తల్లిడండ్రులు 15 ఏళ్ల కొడుకును తీసుకొని బయటకు వెళ్లే వరకు నిరీక్షించిన నానీ, నడవడం రాని నాలుగేళ్ల నస్త్యాను కత్తితో మెడ నరికి చంపారు. అనంతరం ఇంటికి నిప్పంటించి, ఓ బ్యాగులో పాప తలను తీసుకొని మెట్రో రైల్వే స్టేషన్‌కు బయల్దేరారు. అక్కడికెళ్లాక బ్యాగులోని తలను బయటకు తీసి వీరంగం వేశారు. ఈ దారుణానికి పాల్పడినప్పుడు నాని మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉందని, మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని, అందుకని వైద్య పరీక్షల కోసం ఆమెను ఆస్పత్రికి పంపించామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఆమెపై ఎలాంటి టైస్టు ఆరోపణలు దాఖలు చేయలేదని, వైద్య పరీక్షల అనంతరం నిజానిజాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. పైశాచికత్వానికి బలైన నస్త్యా తల్లి ఓ వెడ్డింగ్ షాప్‌లో పని చేస్తుండగా, తండ్రి ఓ మొబైల్ కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.