ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
ఆదిలాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జిల్లాలో ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. వలసలను నివారించి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు పర్యవేక్షణ లోపంతో కొందరికే చేతి నిండాపని లభిస్తోంది. ఈ పథకం కింద పనికి వచ్చే కూలీలకు కనీసం వంద రోజులు పని చూపించాల్సిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీనికి తోడు కూలి చెల్లింపులోనూ జాప్యం కావడం, గిట్టుబాటు కాకపోవడంతో ఆశించిన స్థాయిలో
కూలీలు హాజరుకావడం లేదు. వంద రోజుల పని కొందరికే పరిమితమైందనే విమర్శలున్నాయి. ఆర్థిక సంవత్సరానికి 47 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా జిల్లాలో ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. దీంతో వంద రోజుల పని అందరికి కల్పించడం కలగానే మిగిలిపోనుంది. ఈ పథకం అమలులో భాగంగా చేపట్టిన ఇందిర జలప్రభ, వ్యవసాయ రహదారులు, ఇంకుడుగుంతలు, మట్టికట్టలు, బావుల పూడికతీత, నాడెపు, వర్మీ కంపోస్టు తదితర పనులు చాలా మండలాల్లో వెనుకబడి ఉన్నాయి.
కూలి చెల్లింపులో జాప్యం..
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి వారికి గ్రామంలోనే పని కల్పించడం ఈ ఉపాధి పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకంలో కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. మొదట్లో పథకం అమలు తీరు బాగానే ఉండేది. వలస వెళ్లకుండా గ్రామీణులకు భరోసా ఇచ్చింది. సొంత ఊరిలో ఉపాధి దొరకడం, వేతనాలు కూడా ప్రతీ వారం చెల్లించడంతో చాలా మంది ఆసక్తి చూపేవారు. అయితే రెండేళ్లుగా జిల్లాలో ఉపాధి పథకం అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కూలి సకాలంలో అందకపోవడం, వచ్చినా అంతంతమాత్రంగానే ఉండడంతో ఈ పథకంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీలు ఎక్కువగా వ్యవసాయ పనులకే మొగ్గు చూపుతున్నారు.
అధికారులు విఫలం..
జిల్లాలో జాబ్‌కార్డు కలిగిన 67,434 కుటుంబాలు ఉంటే అందులో కేవలం 5,527 కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించారంటే పథకం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ పథకంలో తగినంత మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నా ఎక్కువ పనులు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారులు పర్యవేక్షణ లోపంతోనే చేతినిండా పనులు కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద చేపట్టిన ఆయా నిర్మాణ పనులు నత్తనకడకన సాగుతున్నాయి. బిల్లుల విడుదలలోనూ జాప్యం చేయడంతో పథకంపై ప్రజలు నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో అధికారులు వెళ్లి ఉపాధి పనులపై ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, వంద రోజుల పనిదినాలు ఎక్కువ కుటుంబాలకు కల్పించే ప్రణాళిక రూపొందించినప్పుడే ఈ పథకంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందనే భావనే వ్యక్తమవుతోంది.
మూడు వారాల డబ్బులు రావాలె..
ఉపాధి పనికి వెళ్లిన కూలి డబ్బులు ఇంకా ఇవ్వడం లేదు. నాకు మూడు వారాల డబ్బులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నేను 45 రోజులు మాత్రమే పనిచేశా. వెళ్లిన పనికి సమయానికి డబ్బులు ఇస్తలేరు. అందుకే ఉపాధి పనికి వెళ్లాలనిపించడం లేదు.
– డి. విఠల్, లక్ష్మీపూర్, జైనథ్
డబ్బులు రాకుంటే పనికెట్ల పోయేది?
నేను ఇప్పటివరకు చేసిన మూడు వారాలకు సంబంధించిన డబ్బులు రాలేదు. నెలరోజులు కూడా నాకు పనిదినాలు కల్పించలేదు. డబ్బులు సరిగ్గా ఇస్తే కూలికి పోయేందుకు మంచిగుంటది.
– సేవంతబాయి
Comments
Please login to add a commentAdd a comment