న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరల నుంచి పేదలను కాపాడేందుకు కేంద్రం గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీ ఏ) వేతనాలను పెంచే అవకాశం ఉంది. వేతనాలు నిర్ణయించే ప్రాతిపదిక(బేస్‌లైన్)ను మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధి హామీ పథకం వేతనాల వార్షిక సమీక్ష బేస్‌లైన్‌ను వినియోగదారుల ధరల సూచీ–వ్యవసాయ కూలీ(సీపీఐ–ఏఎల్) నుంచి వినియోగదారుల ధరల సూచీ –గ్రామీణం(సీపీఐ– రూరల్)కు మార్చనున్నట్లు గ్రామీణ శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా తెలిపారు. ఇందుకోసం ఎస్ మహేంద్ర దేవ్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని, తుది నిర్ణయం మాత్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాక ఉంటుందని వెల్లడించారు.