చేతులు శుభ్రంగా కడుక్కున్నావా ఈ మధ్య ప్రతీ ఇంట్లో వినిపిస్తున్న మాట. కరోనా కారణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తద్వారా ఏదైనా వస్తువును ముట్టుకున్నా, తినడానికి ముందు సబ్బుతో కానీ శానిటైజర్‌తో కానీ చేతులు శుభ్రపరుచుకోవడం అనివార్యం అయ్యింది. మన శరీరంలోనూ కొన్ని వేల సూక్షజీవులు ఉంటాయి. వాటి నుంచి అనారోగ్యానికి గురికాకుండా సబ్బుతో శుభ్రపరుచుకుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న సబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? దీన్ని ఎవరు కనుగొన్నారు ?సబ్బుల్లోనూ హానికారకమైనవి ఎలా గుర్తించాలి..ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాళ్లనే మనం ఫాలో అవుతున్నాం
సబ్బును మొట్టమొదటగా పురాతన బాబీలోనియన్లు క్రీ.పూ. 2800 సంవత్సరంలోనే తయారుచేశారు. కలప, బూడిద, కొంచెం నీటిని వాడి సబ్బులా తయారుచేశారు. అయితే దీన్ని వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగించలేదు. కేవలం ఉన్ని, పత్తి లాంటి వాటిని శుభ్రపరిచేందుకు వినియోగించినట్లు తేలింది. అయితే ఆ తర్వాత బాబీలోనియన్లు ఉపయోగించిన పదార్థాలతోనే ఈజిప్టియన్లు సబ్బును తయారుచేసి పుండ్లు, చర్మ వ్యాధుల చికిత్స కోసం వినియోగించారు. రోమన్ శతాబ్దాం వరకు వ్యక్తిగత శుభ్రతకు సబ్బును వాడలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే దశాబ్దాలు మారినా బేసిక్ సబ్బు తయారీ విధానం మాత్రం మారలేదు. ఏ సబ్బు తయారీలో అయినా సాధారణంగా నీరు, నూనె ( వెజిటేబుల్ ఆయిల్ ) , బేసిక్ ఆల్కలీ, అయానిక్ ఉప్పు ను వాడతారు. సరైన నిష్పత్తిలో ఈ పదార్థాలన్నింటినీ కలపడం ద్వారా రసాయన ప్రక్రియ జరిగి సబ్బు తయారవుతుంది. ఈ పద్దతిని సోపోనిఫికేషన్ అంటారు. సబ్బు తయారీకి చల్లని ప్రక్రియ (కోల్డ్ ప్రాసెస్ ), వేడి ప్రక్రియ ( హాట్ ప్రాసెస్ ) అని రెండు పద్దతులను వాడతారు. అయితే వేడి ప్రక్రియ ద్వారానే సులభంగా సబ్బు చేయడానికి వీలుంటుందని రుజువైంది.
ఆ సబ్బుపై నిషేదం
నిత్యం ఎన్నో సూక్షజీవులతో మనం జీవిస్తున్నాం. సబ్బులో నీరు, నూనె వంటి గుణాలు ఉండటం వల్ల బాక్టీరియా, క్రిములు తొందరగా ఆకర్షించబడతాయి. దాదాపు 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవడం వల్ల క్రిములు నశిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..తడిచేతులను అలాగే వదిలేయరాదు. దీని వల్ల సూక్షజీవులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే టువాలు లేదా టిష్యూలు వాడి చేతులు తడిబారకుండా చూసుకోవాలి. అయితే అన్ని సూక్షజీవులు హానికారం కాదు. కొన్ని మనకు మేలుచేసేవి ఉంటాయి. ఏ సబ్బు అయినా క్రిములను చాలామేర తగ్గిస్తుంది కానీ మొత్తానికే వాటిని నాశనం చేయదు. అయితే యాంటీ బాక్టీరియల్ సబ్బులు మాత్రం బాక్టీరియా లోపలి కణ త్వచాలోకి వెళ్లి చంపేస్తుంది. ఈ సబ్బులోని ట్రైక్లోసన్ లేదా ట్రైక్లోకార్బన్ వంటి పదార్థాలు శరీరంపై దీర్ఘకాలిక దుష్ర్పభావాలను చూపిస్తుందని అధ్యయనంలో తేలడంతో 2016 నుంచి ఎఫ్డీఏ యాంటీ బాక్టీరియల్ సబ్బుల అమ్మకాలపై నిషేదం విధించింది.
పీహెచ్ లెవల్ పెరిగితే చర్మ సమస్యలు
ప్రస్తుతం శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే 60-95% ఆల్కహాల్ సాంద్రత కలిగిన హ్యాండ్ శానిటైజర్లు సూక్షజీవులను చంపడంలో ఎక్కువ శక్తిమంతమైనవి. అయితే ఎక్కువసార్లు శానిటైజర్ వాడటం వల్ల చేతులు పొడిబారే అవకాశం ఉంది. పీహెచ్ లెవర్ ఎక్కువగా ఉన్న సబ్బులు వాడటం వల్ల శరీరం దురద, మంట, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తక్కువ పీహెచ్ లెవల్ ఉన్న సబ్బులు వాడాలి. అంతే కాకుండా సబ్బులను డైరెక్ట్ గా వాడకుండా తప్పకుండా నీరు కలిపి వాడాలి. హెర్బల్, యాంటీ ఆక్నె, శరీరం చర్మ తత్వాన్ని బట్టి సబ్బులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అప్పటినుంచే వాడకం..ఆ సబ్బుపై నిషేధం
Published Wed, May 20 2020 8:37 AM | Last Updated on Wed, May 20 2020 9:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment