త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇలా ఏ కాలంలోనైనా, ఏ అంశంలోనైనా స్త్రీని అత్యున్నత స్థానంలో ఉంచి గౌరవించారు. ఆమెను తొలిగురువుగా, ఆది శక్తిగా భావించి ఆరాధించారు. మన పురాణాలను కూలంకషంగా పరిశీలించినట్లైతే ఈ విషయం మనకు అవగతమౌతుంది. భారతావని అంతటా వైభవోపేతంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోనూ అమ్మవారిదే వైభోగమంతా. ఆ జగన్మాతని ఆరాధించేందుకే ఈ మహా శరన్నవరాత్రి సంరంభమంతా...
విజయదశమి....పదిరోజుల పండుగ...మనిషిలో దాగిన లోభం, అలసత్వం, జడత్వం, దురాశ, పాప–చింతనలాంటి వికారాలను నశింపచేసి, సాత్వికప్రవృత్తి వైపు నడిపిస్తుంది. మనలోని శక్తిని జాగృతం చేసి శుభసంకల్పాలకు నాంది పలికి చైతన్యం వైపుగా నడిపిస్తుంది. విజయదశమి–నవరాత్రి–దుర్గాపూజ...అన్ని శబ్దాలకూ ఒకటే అర్థం....తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలుగా భావిస్తూ ఆ జగన్మాతని పూజించుకోవటం. అసలు దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఎందుకు కొలుస్తారు, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం.
త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక నామాలతో పూజలందుకుంటున్న లలితాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండాలకు జనని. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ సకల జీవకోటికీ మాతృదేవత. తన బిడ్డలుగా భావించిన ప్రజలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులను సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దసరా ఉత్సవాలు. దశహరా అంటే పది రకాల పాపాలను నశింపజేసేవని అర్థం. అదే క్రమేణా దసరాగా మారింది.
విజయదశమి – వివిధ కారణాలు
ఆయా రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దుర్గాదేవి మహిషారుని సంహరించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది.
ఐకమత్యమే ఆయుధ బలం
ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అందుకే ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామినుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, వీటన్నింటినీ కూడగట్టుకోవడానికి కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధంచేసి విజయం సాధించింది.
సమష్టి బలం
దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఏ ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా ఉండి, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించగలం. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ చాటి చెబుతోందన్నమాట.
అందరి మొరలూ ఆలకించే అసలైన అమ్మ
మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు అమ్మ భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఐహిక, ఆముష్మిక ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి.
ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం
దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి.
శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం, శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు.
మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి.
దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనికే రామలీల అని పేరు.
తెలంగాణ ప్రాంతం నవరాత్రులలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యమిస్తే, విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దలకు జమ్మిని ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు.
బాక్స్
దుర్గానవరాత్రులో ఆఖరి అవతారం శ్రీరాజరాజేశ్వరి. భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఙ్ఞానశక్తిని ప్రసాదించే అవతారం శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూపమైనా, ఏ శక్తి రూపమైనా అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణతో పూజించాలి. చేమంతులతో ఆరాధన చేయాలి. భక్ష్య, భోజ్యాలతో మహానివేదన చేయాలి. ఈ రోజున అశ్వపూజ, ఆయుధపూజ, ఉఛ్చైశ్రవ పూజ, వాహన పూజ నిర్వహిస్తారు. శ్రీరాముడు విజయదశమి రోజున ‘అపరాజితాదేవిని’ పూజించి రావణునిపై విజయాన్ని సాధించాడు. నవరాత్రుల అనంతరం దశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని స్మరిస్తారు.
‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శినీ’’
ఈ మంత్రంతో తమ తమ గోత్రనామాలు చెప్పుకుని జమ్మి వృక్షాన్ని పూజ చేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీరాముడు దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘దశహర’ అని కూడా పిలువబడుతోంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా దశమి రోజునే. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. దేవీ ఉపాసకులు అంతవరకు తాము చేసిన జప సంఖ్యననుసరించి హోమాలు చేస్తారు. నవరాత్రి వ్రత సమాప్తి గావించిన వారు సర్వ సిద్ధులు పొందుతారు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.
చెడుపై మంచి సాధించిన విజయం
దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు –మానవులు తప్ప. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులున్నారు. వారే అందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలనే శత్రువులు. వారితోనే మనం పోరాడి విజయం సాధించాలి. జీవితాలను ఆనందమయం చేసుకోవాలి.
విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, మంచి పని అయినా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం.
–డి.వి.ఆర్. భాస్కర్
(చదవండి: సింహం వద్ద సలహదారు ఉద్యోగం! )
Comments
Please login to add a commentAdd a comment