విభిన్న నామాలతో, వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి? అమ్మవారి నామంతో వెలసిన అలాంటి నగరాలు కొన్ని... వాటి ప్రాశస్త్యం క్లుప్తంగా...
కోల్‌కతా – కాళీమాత
కోల్‌కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలసిన కాళికాదేవి రూపంతోపాటు కాళీఘాట్‌లో ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు కళ్లకు కడతాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తుల పాలిట కరుణామయి. కన్నతల్లిలా బిడ్డలను కాపాడుతుంది. కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను చూద్దాం... ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. అలాగే బెంగాలీ భాషలో కాలికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. అమ్మవారు కొలువైన కాళీఘాట్ కాళీ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది.
మంగళాదేవి పేరు మీదుగా మంగళూరు
కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు తెలుస్తుంది. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా, అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందీ తల్లి. మహర్నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు చండీయాగం కూడా చేస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది.
ముంబై – ముంబా దేవి
దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడంలో అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయమే కారణం. ఇందుకో పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ‘మత్స్య’ అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు‘ముంబాదేవి’గా మారినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.
శ్యామలాదేవి పేరు మీదుగా సిమ్లా
సాక్షాత్తూ ఆ కాళీమాతే శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలి సిమ్లా అని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.
చండీగఢ్ – చండీ మందిర్
అటు పంజాబ్‌కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణం. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీమాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం.
పాటన్‌దేవి పేరుతో పట్నా
శక్తి స్వరూపిణి ‘పాటన్‌దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం ఉండటమే పట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు.
కాలక్రమంలో.. ఆ పేరు‘పాటనేశ్వరి’గా, ఇప్పుడు ‘పాటన్‌దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజులపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి.
నైనాదేవి పేరుతో నైనిటాల్
ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత శోభాయమానంగా అలరారే నైనిటాల్‌కు ఆ పేరు రావడం వెనక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది, దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది.
మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపీuŠ‡ అని కూడా పిలుస్తారు. అలా మహిషుడిని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ’జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనాదేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.
దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు
అంబాలా – భవానీ అంబాదేవి (హరియాణా)
అంబ జోగే – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర)
తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)
హసన్ – హసనాంబ (కర్ణాటక)
త్రిపుర – త్రిపురసుందరి (త్రిపుర)
మైసూరు – మహిషాసురమర్దిని (కర్ణాటక)
కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు)
సంబల్‌పూర్ – సమలాదేవి/ సమలేశ్వరి (ఒడిశా)
(చదవండి: ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..! )
Comments
Please login to add a commentAdd a comment