భక్తిమార్గానికి చరిత్ర బలి | sacrifice history of sammakka sarakka is went to devotional | Sakshi
Sakshi News home page

భక్తిమార్గానికి చరిత్ర బలి

Published Thu, Feb 25 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

భక్తిమార్గానికి చరిత్ర బలి

భక్తిమార్గానికి చరిత్ర బలి

కొత్త కోణం
 సమ్మక్క, సారక్కలు తమ జీవితాలను ఏ లక్ష్యం కోసం, ఏ జాతికోసం త్యాగం చేశారో ఈ కొలువుల్లో ఎక్కడా ప్రతిబింబించడం లేదు. తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో వీరిద్దరినీ దేవతలకన్నా కూడా పోరాటానికి ప్రతీకలుగా కీర్తించాం. ఆ పోరాట పటిమను పుణికి పుచ్చుకునే ప్రయత్నం చేశాం. కానీ ఈ రోజు అది కొరవడింది. ఉద్యమ నాయక త్వంలో ఉన్న చాలా మంది సామాన్య ప్రజలలాగా జాతరలో పాల్గొని మూఢ విశ్వాసాలకు ఊతమిచ్చారు. ఇది చరిత్ర క్రమాన్ని శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోలేకపోవడమే.

 సమ్మక్క, సారక్కలు సరిగ్గా తొమ్మిది వందల ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డమీద కోయజాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం రక్తతర్పణ చేసిన వీరనారీమణులు. ఆధిపత్యం, అణచివేతలకు వ్యతిరేకంగా ప్రతాపరుద్రుని కాకతీయ సైన్యంతో యుద్ధం చేసి వీరమరణం పొందిన ధీరవనితలే నేడు మనం కొలుస్తున్న సమ్మక్క, సారక్క. ఆదివాసీ ప్రజలకు అంతులేని విశ్వాసాన్నిచ్చిన వీరి సంస్మరణలో రెండేళ్లకోసారి తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నదే మేడారం జాతర. కాకతీయరాజు సమ్మక్క, సారక్కల సాహసానికి చలించి, తప్పిదాన్ని గుర్తించి ఆ తర్వాత తల్లీబిడ్డలను కాకతీయ కులదైవం ఏకవీరతో సరిసమానంగా గౌరవించి, వారి చితాభస్మాన్ని గుడిలో ఉంచి పూజించారు. యుద్ధం జరిగిన చోటనే పోరాటానికి గుర్తుగా సమ్మక్క, సారక్క జాతరను ప్రారంభించారు.

 బాల్యం నుంచి వేటలో, యుద్ధంలో ఆరితేరిన సమ్మక్క కాకతీయ సైన్యాలను ఎదుర్కొని వీరోచితంగా పోరాడింది. శత్రు సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తున్న సమ్మక్కను కాకతీయ సైనికుడొకరు వెనుక నుంచి దొంగచాటుగా బల్లెంతో పొడిచాడు. ఆ గాయంతోనే సమ్మక్క నెత్తుటిధారలుగా కారుతుండగా యుద్ధభూమికి ఈశాన్య దిశగా ఉన్న చిలుకలగుట్టవైపు వెళ్లి అదృశ్యమైనట్టు కూడా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంత మంది అనుచరులు ఆమెను అనుసరిస్తూ వెళ్లగా గుట్ట మీద నాగవృక్షం సమీపంలో ఒక కుంకమ భరిణ లభించినట్టు చెప్పుకుంటారు. ఆ భరిణను సమ్మక్కదిగా భావించి అది దొరికిన ప్రదేశంలోనే రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ముత్తైవలు పండుగ జరుపుకునేవారు. ఈ పండుగే కాలక్ర మేణా జాతరగా మారింది. సమ్మక్క జననం, పెరుగుదల, వివాహం, వీరమరణం మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క కోయరాజుల ఆడబిడ్డ కావడం, యుద్ధంలో వీరమరణం పొందడం సత్యమే. అందుకు ఆధారాలున్నాయి. కాలక్రమేణా ఆమె దేవతగా మారిపోవడం అనేక పరిణామాల అనంతరం జరిగింది. ముందుగా కోయల ఆడబిడ్డగా, అందులో చందావంశం వారి దేవతగా, తర్వాత కోయలందరి ఆరాధ్యదైవంగా, క్రమేణా అన్ని కులాల, తెగల ప్రజలందరి ఇష్టదేవతగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్కకు మరింతగా ప్రాముఖ్యం పెరిగింది.

 ఇటువంటి పరిణామాలు చరిత్రలో కొత్త కాదు. ప్రజాసేవకులు, నాయకులు  కాలక్రమంలో దేవుళ్లుగా దేవతలుగా రూపాంతరం చెందడం చాలా చోట్ల కనిపిస్తుంది. సమ్మక్క, సారక్కలను  దేవతలుగా కొలవడం కూడా ఆ కోవలోకి వస్తుంది. శక్తియుక్తులకు మించి ప్రజల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టినప్పుడు వారి పట్ల ఉండే గౌరవ భావం, ప్రేమ వారిని సాధారణ ప్రజానీకానికి భిన్నంగా పరిగణించే స్థితికి చేరుస్తుంది. ఇటువంటిదే క్రీ.శ. ఒకటవ శతాబ్దంలో తమిళనాడులోనూ జరిగింది. ఉమలనాడు ప్రాంతంలో అంబిగామయి అమ్మాన్ (అంబికాదేవి) అనే బాలిక ఏడేళ్ల వయసులోనే చదవడం, రాయడం నేర్చుకున్నది. 11 ఏళ్లకు బౌద్ధాన్ని అర్థం చేసుకున్నది. 13 ఏళ్ల వయసులో పెళ్లి చేయాలన్న పెద్దల ఆలోచనను తిరస్కరించింది. తన జీవితాన్ని బౌద్ధానికి అంకితం చేస్తానని తండ్రికి స్పష్టం చేసింది. అనేక పరిణామాల తర్వాత ఆమె బౌద్ధాన్ని స్వీకరించింది. ఆమె నిత్యం వేప చెట్టుకింద కూర్చొని ధ్యానం చేసేది. బౌద్ధ గ్రంథాలలో ఉన్న సారాన్ని ప్రజలకు అర్థం అయ్యే పద్ధతిలో వివ రించేది. ఆరోగ్య విషయాలపట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రయత్నించేది.

మనుసునూ, ఇంటినీ, ఊరునీ పరిశుభ్రంగా ఉంచుకోవడమే త్రిశుద్ధిగా ఆమె ప్రజలకు తెలియజేసింది. ప్రతి ఇంటిలో గుగ్గిలం, మైశాచి, సాంబ్రాణి పొగలు వేయడం, ప్రతి ఇంటికీ వేపాకు తోరణాలు కట్టడం నేర్పింది. ఇంటిని ఎర్రమన్నుతో అలకడం, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, వాకిట్లో పేడతో కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టడం నేర్పింది. దీనితో పాటు మశూచిలాంటి వ్యాధులు వస్తే పడకపైన వేపాకు పరిచి రోగిని పడుకోబెట్టాలని వివరించింది. ఆకలితో మలమల మాడేవారికి ఉన్నవారు తమ బాధ్యతగా గంజి కేంద్రాలను నడపాలని బోధించింది. ఆమె చెప్పిన మూడు విషయాలే తిరుమంత్రంగా ప్రసిద్ధికెక్కాయి. పసుపు, కుంకుమలు రాసుకుంటే రోగకారకమైన క్రిములు దరిచేరవని హితబోధ చేసింది. ఈ సేవా కార్యక్రమాల మధ్యనే ఒకరోజు అంబికాదేవి ధ్యానంలోనే పరినిర్వాణం పొందింది. ఆ తర్వాత అంబికాదేవి భౌతికకాయాన్ని దహనం చేసి ప్రజలు ఆ బూడిదను కావేరి నదిలో కలిపారు. ఆ నదిలో ఆ రోజు లక్షలాది మంది స్నానాలు చేశారు. ప్రతియేటా అదే రోజున ఇప్పటికీ లక్షలాది మంది ప్రజలు కావేరిలో స్నానమాచరించి అంబికాదేవిని స్మరించుకొంటారు. అంబికాదేవి ్రపబోధించిన ఆరోగ్య సూత్రాలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జ్వరాలు, మశూచిలాంటి వ్యాధులు వస్తే వేపాకును వ్యాధి నిరోధకంగా వాడుతారు. ఈ రోగాలు పోవాలంటే పోచమ్మ, నూకాలమ్మ, మారెమ్మ లాంటి దేవతలకు మొక్కుతుంటారు. తెలంగాణలో పోచమ్మ కథ అచ్చంగా అంబికాదేవి కథను పోలి ఉంటుంది.


 అదేవిధంగా 50 ఏళ్ల  కిందట జరిగిన ఒక ప్రజానాయకుడి పోరాటం ఆయనను దేవుణ్ణి చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన మెదక్ జిల్లా చేగుంట సమీపంలోని పోలంపల్లి వద్ద ఆయన పేరుతో జాతర జరుగుతుంది. ఆ పేరే కేవల్ కిషన్. జోగిపేట ఆంధ్రమహాసభ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో చేరిన కేవల్ కిషన్ అతికొద్ది కాలంలోనే ఆ ప్రాంతపు ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 1960 డిసెంబర్ 26న మోటారు సైకిల్‌పై వెళుతోన్న కేవల్ కిషన్‌ని వెనుక నుంచి లారీతో డీకొట్టించి చంపేశారు. దానిని యాక్సిడెంట్‌గా చిత్రీకరించి ఆ ప్రాంత భూస్వాములు హత్యానేరం నుంచి తప్పించుకొన్నారు. ఎక్కడైతే కేవల్ కిషన్ ప్రాణాలొదిలారో ఆ స్థలంలో ప్రతియేటా జాతర జరుపుతారు. దేవుడికి మొక్కులు చెల్లించినట్టే కేవల్ కిషన్ విగ్రహం దగ్గర కోళ్లు, గొర్రెలు, మేకలు కోసి మొక్కలు తీర్చుకుంటారు. చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారు. మెదక్ డివిజన్ లోని కాట్రియాల్, పాతూరు, అక్కన్న పేట, జక్కన్నపేట, మాసాయిపేట లాంటి అనేక గ్రామాల్లో కేవల్ కిషన్ భూపోరాటాలకు నాయకత్వం వహించారు. వేలాది ఎకరాల భూములు ప్రజలకు పంపిణీ చేయడమే కాకుండా వాటిపై శాశ్వత హక్కులు కల్పించారు. పై మూడు కథలు మూడు పోరాట గాథలుగా చరిత్రకెక్కాయి. ఇవి కల్పిత గాథలు కావు.
 ముఖ్యంగా సమ్మక్క, సారక్క జాతర గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మొదట్లో కోయలు మాత్రమే జరుపుకునే జాతరను ఈ రోజు కోట్లాదిమంది జరుపుకుంటున్నారు. సామాన్య ప్రజానీకంలో అటువంటి భావాలుండడంలో పెద్దగా తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ దీనివల్ల చారిత్రక సత్యాలు కనుమరుగవుతున్నాయి. సమ్మక్క, సారక్కలు తమ జీవితాలను ఏ లక్ష్యం కోసం, ఏ జాతికోసం త్యాగం చేశారో ఈ కొలువుల్లో ఎక్కడా ప్రతిబింబించడం లేదు. తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో వీరిద్దరినీ దేవతలకన్నా కూడా పోరాటానికి ప్రతీకలుగా కీర్తించాం. ఆ పోరాట పటిమను పుణికి పుచ్చుకునే ప్రయత్నం చేశాం. కానీ ఈ రోజు అది కొరవడింది. ఉద్యమ నాయకత్వంలో ఉన్న చాలా మంది సామాన్య ప్రజలలాగా జాతరలో పాల్గొని మూఢ విశ్వాసాలకు ఊతమిచ్చారు. ఇది చరిత్ర క్రమాన్ని శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోలేకపోవడమే. అంతేకాక భావితరాలకు సమ్మక్క, సారక్క పోరాట స్ఫూర్తిని అందించే క్రమానికి ఇది పెద్ద అవరోధం. ఇది కేవలం విశ్వాసాలకు, అంధ విశ్వాసాలకు మాత్రమే ఉదాహరణ కాదు, ఆర్థికంగా కూడా ప్రజలను కుంగ దీస్తుందనడానికి కింద ఉదాహరణ గమనించ వచ్చు.

 ఈ జాతర సందర్భంగా ప్రతి రెండేళ్లకోసారి ప్రజలు పెడుతున్న ఖర్చును పరిశీలిస్తే కళ్లు తిరుగుతాయి. ఈ సంవత్సరం జాతరలో కోటి మంది పాల్గొన్నట్టు అంచనా. అంటే సరాసరి కుటుంబానికి నలుగురిచొప్పున వేసుకుంటే 25 లక్షల కుటుంబాలు అవుతాయి. ప్రతి కుటుంబం పదిహేను రోజుల ముందునుంచే సమ్మక్క, సారక్కల పూజలు మొదలు పెడతారు. దానికన్నా ముందు వేములవాడగానీ, ఇతర దేవాలయాలను గానీ దర్శించుకోవాలి. వీటికి తోడు ప్రయాణ ఖర్చులు. అంటే వీటన్నింటికి కలిపి ప్రతి కుటుంబం 20 నుంచి 30 వేల రూపాయల వరకు ఖర్చు చేయడం తప్పనిసరిగా ఉంటుంది. సరాసరిగా చూసుకుంటే కనీసం 20 వేల రూపాయలు ఒక్కో కుటుంబం ఖర్చు చేసినట్టు భావించాలి. 25 లక్షల కుటుంబాలు ఒక్కో కుటుంబం 20 వేల రూపాయలు ఖర్చు చేస్తే మొత్తం 5 వేల కోట్లు ఖర్చు చేసినట్టవుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బడ్జెట్‌లతో పోల్చి చూస్తే దీని తీవ్రత అర్థమవుతుంది. 2015-16 తెలంగాణ గిరిజన బడ్జెట్ 2,878 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ గిరిజన బడ్జెట్ 993 కోట్ల రూపాయలు. ఈ రెండు బడ్జెట్‌లు కలిపినా మేడారం జాతరకు ప్రజలు పెట్టిన ఖర్చును మించలేదు. సమ్మక్క, సారక్కల త్యాగాలను, పోరాట స్ఫూర్తిని మనం చరిత్రక్రమంలో అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్న కోయ, గోండు తెగలు చాలా పురాతనమైన జాతులు. వందల ఏళ్ల పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణల ద్వారా వారు తమ మనుగడను కాపాడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే కోయలు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు. సమ్మక్క, సారక్క మొక్కులకు పెట్టే ఖర్చును అందరం వారి అభివృద్ధికి మళ్లిస్తే పదేళ్లలో కోయలంతా అన్ని రంగాల్లో మిగతా ప్రజలందరితో సమాన స్థాయికి వస్తారు. ఈ విషయాలను విశాలమైన హృదయాలతో అర్థం చేసుకొని తెలంగాణను ఒక చైతన్యవంతమైన గడ్డగా రుజువు చేయాల్సిన అవసరం మనందరిపై ఉన్నది.
 http://img.sakshi.net/images/cms/2015-03/71426100561_625x300.jpg
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మల్లెపల్లి లక్ష్మయ్య  మొబైల్: 97055 66213

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement