తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు?
ప్రభువుల హోదాకు చిహ్నం
సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్‌పుత్‌లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్‌పుత్‌ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్‌పుత్‌లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు.
గురు గోవింద్ సింగ్ అనుమతితో..
ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు.
తలపాగాను మార్చుకునే ఆచారం
గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు.
ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్‌ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు?
Comments
Please login to add a commentAdd a comment