గురునానక్ (1469-1539) ప్రభోధనల ఆధారంగా ఏర్పడిందే సిక్కు మతం. గురునానక్ బోధనల్లో మతాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. హిందూ, ఇస్లాం రెండు మతాలను ఒక్క తాటి కిందికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా దేశ మంతా తిరిగి,మక్కా మదీనాల యాత్ర కూడా చేసి వచ్చి, ఆయనిచ్చిన గొప్ప సందేశం ఏంటంటే.. 'హిందువు లేడు, ముస్లిం లేడు, ఇద్దరూ ఒక్కటే!'
200 ఏళ్ల కిందే సిక్కులొచ్చారు
హైదరాబాద్‌లోని సిక్కుల చరిత్ర దాదాపు 200 సంవత్సరాల నాటిది. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో ఆనాటి హైదరాబాద్ 4వ నిజాం ( 1829-1857) తన ప్రధాని చందూలాల్ (పంజాబ్ ఖత్రీ) సలహాపై ఒక ఒప్పందం ప్రకారం 1832 లో లాహోరి ఫౌజ్‌లో భాగంగా వీరిని హైదరాబాద్ కు పిలిపించుకున్నాడు. వారు నిజాం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టడంలో కూడా సేవలు అందించారు. ఆనాడు సిక్ రెజిమెంట్ క్యాంపు అత్తాపూర్ దగ్గరున్న బరంబలాలో ఉండేది. అక్కడే హైదరాబాద్ లోని మొట్ట మొదటి గురుద్వారా నిర్మింపబడింది.
తెలంగాణ అంతటా ఎన్నో గుర్తులు
అలా వచ్చిన సిక్కులు హైదరాబాద్ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణా అంతా విస్తరించారు, స్థానికులతో కలిసిపోయారు. మాతృ భాష పంజాబీని మరిచిపోకుండానే తెలుగు భాషా సంస్కృతులకు అలవాటు పడ్డారు. సికింద్రాబాద్ లో ఏకంగా ఒక సర్దార్జీల గ్రామమే ఉంది. ప్యారడైజ్‌కు మూడు కిలో మీటర్ల దూరంలోనున్న ఆనాటి 'సిక్కుల తోట'నే కంటోన్మెంట్ పరిధిలోనున్న నేటి 'సిక్ విలేజ్'.
వ్యాపారాల్లో ఉద్ధండులు
చాలా మంది సర్దార్జీ లు వివిధ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ స్థిరపడి పోయారు. ఇక్కడో గురుద్వారా కూడా నిర్మించుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒకప్పటి 'గచ్చుబాయ్ తాండా' ఇప్పుడు' గురుగోవింద్ నగర్ 'గా మారిపోవడం విశేషం. సిక్ హెరిటేజ్ ఫౌండేషన్ వారు 'డెక్కన్ సిక్కుల సంస్కృతి'పై సాలర్ జంగ్ మ్యూజియం లోనున్న పెక్కు చారిత్రక వ్రాత ప్రతుల ఆధారంగా పరిశోధన చేయడం ముదావహం.
సిక్కు జీవితంలోంచి వచ్చిన కథ
ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సిక్కు కుటుంబాల్లోంచి వచ్చిందే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ. పూర్వ కరీంనగర్ జిల్లాలోని రాఘవ పట్నం కు చెందిన బహు గ్రంథకర్త రామసింహ కవి( 1857 - 1963 ) సర్దార్జీయే. నిజాం కాలం నాటి ఈ కవి ఆత్మకథ వారి మునిమనవడైన సర్దార్ గురుదేవ్ సింగ్ గారి వద్ద లభించగా దాన్ని వేముల ప్రభాకర్ పరిష్కరించి, మిత్రుడు తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ పర్యవేక్షణలో ప్రచురించగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘము వారి వేదికపై (తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో) తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్, ప్రముఖ కథకుడు శ్రీ కాలువ మల్లయ్య ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment