తెలంగాణ గతంపై విహంగ వీక్షణం
భారతదేశంలో ఆవిర్భవించిన సరికొత్త రాష్ట్రం సమగ్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అప్పుడే మన చేతుల్లో ఉంచాయి. అదే ‘తెలంగాణ చరిత్ర’. నిజానికి ఇది కూడా ఒక చరిత్రే.
చరిత్రకు చోదకశక్తి ఉంటుంది. అదే- ప్రజా ప్రస్థానం. బయటి శక్తుల ప్రభావం ఏ సమాజం మీద నైనా ఒక చారిత్రక సత్యం. ఒక దేశ లేదా ఒక ప్రాంత చరిత్ర రచనలో పరిధులు కనిపించవన్నదీ సత్యమే. ఆ దృష్టి ‘తెలంగాణ చరిత్ర’ గ్రంథ రూపకల్పనలో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ అనే ఒక భౌగోళిక ప్రాంతం మీద ఎన్నో ప్రభావాలు ఉన్నాయి. ఇక్కడి జీవన, ఆలోచనా విధానాలు, భాష, సంస్కృతి, సంఘ ర్షణ, పోరాట దృక్పథం వంటివన్నీ ఆ ప్రభావాల ఫలి తమే. ఏపీ హిస్టరీ కాంగ్రెస్ ఇతర సంస్థలతో కలసి సమగ్రాంధ్ర చరిత్రను ఎనిమిది సంపుటాలలో వెలువ రించింది. వాటిలో తెలంగాణ ప్రాంత చరిత్రను వివ రించే వ్యాసాలను వేరు చేసి ‘తెలంగాణ చరిత్ర’ పేరుతో సంకలనంగా తీసుకువచ్చారు.
విభజన నేపథ్యంలో ఇదొక అవసరం. రాతియుగాల దగ్గర నుంచి మొదలు పెట్టి, మౌర్యులు, ఆపై శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు; తరువాత మలుపు తిరిగిన చరిత్రలో ముస్లిం పాలకులు కనిపిస్తారు. మహమ్మద్ కులీకుతుబ్‌షా (1589) వంశం, మొగలులు, ఆసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. చివరి నవాబుగా చెప్పదగిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ పతనంతో తెలంగాణ చరిత్ర మరో గుణాత్మకమైన మార్పును సంతరించు కుంది.
అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ, మళ్లీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర అవతరణ వరకు జరిగిన ఒక సంక్షుభిత, పోరాట, సంఘర్షణాత్మక చరిత్రను ఈ పుస్తకంలో నమోదు చేశారు. కరీంనగర్ సమీపంలోని కోటలింగాల, ఓరుగల్లు పట్టణం శాత వాహనుల, కాకతీయుల యుగాలలో పాలనా కేంద్రా లుగా అలరారాయి. వాటి గురించి ఇందులో పరిచయం ఉంది. అంటే క్రీస్తుపూర్వం నుంచి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం వరకు నడి చిన చరిత్ర మీద ఇదొక విహంగ వీక్షణం.
ఇరవయ్యేడు అధ్యాయాలు ఉన్న ఈ గ్రంథ రూప కల్పనలో రచయితలను ఎంపిక చేసుకున్న తీరు కూడా విశిష్టమే. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షా హీలు, ఆసఫ్ జాహీల గురించి నిష్ణాతులైన చరిత్రకా రులు అధ్యాయాలను ఆవిష్కరించారు. ఆ తరువాత జరిగిన కీలక పరిణామాలను విశ్లేషించిన వారు దాదాపు వాటికి ప్రత్యక్ష సాక్షులు. పురాతన చరిత్రలో తెలంగా ణకు ఉన్న చోటు గురించి వీవీ కృష్ణశాస్త్రి, పీవీ పర బ్రహ్మశాస్త్రి రాశారు. శాతవాహనుల గురించి మరో ప్రఖ్యాత చరిత్రకారుడు సి. సోమసుందరరావు రాశారు.
కాకతీయ యుగం మీద విశేషమైన కృషి చేసిన పరబ్రహ్మశాస్త్రిగారే తెలంగాణ మీద, ఇక్కడి సంస్కృతి, సాహిత్యం, భాష, జీవనాల మీద ఆ వంశీకుల ముద్రను వర్ణించారు. ఆయా యుగా లలో, వంశీకుల ఏలు బడిలో పాలనా విధానం ఎలా ఉందో శోధించారు ఏఆర్ రామచంద్రారెడ్డి. తెలంగాణ సాయుధ పోరా టానికి ముందు, భారత స్వాతంత్య్రోద్యమంతో ఇక్కడి ఉద్యమం అనుబంధం ఏర్పరచుకోవడానికి ముందు ఇక్కడ జరిగిన సాంస్కృతిక, సాహిత్య, భాషోద్యమాల గురించి తెలుసుకోవడం ఇప్పుడు అవసరం. ఆ అవ కాశం కల్పించారు వై. సుదర్శనరావు.
తెలంగాణ రైతాంగ పోరాటం గురించి ఇనుకొండ తిరుమలి వివ రించారు. ‘సమైక్య ఆంధ్ర-రాజకీయ పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర అవతరణ’ అన్న పేరుతో ఇటీవలి చారి త్రక ఘట్టాలను ప్రముఖ పత్రికా రచయిత కె. రామ చంద్రమూర్తి గుదిగుచ్చారు. ఇది కొత్త వ్యాసం. పుస్త కానికి పరిపూర్ణతను తీసుకువచ్చిన వ్యాసం కూడా. ఆంధ్రప్రదేశ్ అవతరణ మొదలు, తెలంగాణ రాష్ట్ర అవ తరణ మధ్య సంభవించిన అనేక పరిణామాలను, ఉద్య మాలను, చట్టాలను, ప్రభుత్వాల వైఖరులను, ఆయా పార్టీల ధోరణులను కేఆర్ మూర్తి తన సుదీర్ఘ వ్యాసంలో పదునైన వ్యాఖ్యలతో వివరించారు.
ఎమెస్కో ప్రచురించిన విలువైన ఈ చరిత్ర గ్రంథా నికి సంపాదకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ.
- కల్హణ