![Health Tips In Telugu: Itching Problems Allergy Causes Remedies - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/26/4411.jpg.webp?itok=xltCBOQ1)
ప్రతీకాత్మక చిత్రం
Health Tips In Telugu: ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు.
అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది.
కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్‌లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది.
పరిష్కారాలు
ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తలదురద పూర్తిగా పోతుంది.
ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్‌లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు.
దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు.
►దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి.
►శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
►మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment