భార్గవి పప్పూరి... మన కళలను ఇష్టపడ్డారు. మన కళాకారులకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం కళాత్మకమైన వేదికను నేశారు. అది తన సృజనాత్మకతకే వేదికవుతుందనుకోలేదామె. ఆర్ట్‌ఎన్ వీవ్స్... కృషి ఆమెదే... కళ ఆమెదే.
ఆర్ట్ అండ్ వీవ్స్ స్థాపించడానికి ముందు నా జర్నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అది సరదాగా సాగిపోయే ఓ సినిమాని తలపిస్తుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, వనస్థలి పురం దగ్గర ఆర్‌కే పురంలో. నాన్న పోస్ట్ మాస్టర్‌గా రిటైరయ్యారు. అమ్మ గృహిణి. బికామ్ చదివి చాలా కామ్‌గా ఉండేదాన్ని.
కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నోరు పెగిలేది కాదు. పెళ్లయిన తర్వాత మా వారు నన్ను మార్కెటింగ్ వైపు నడిపించారు. ఆయనది కూడా అదే ఫీల్డ్ కావడంతో నాకు మెళకువలు నేరి్పంచారు. మొదట క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్‌లు మార్కెట్ చేశాను. మా వారికి కోల్‌కతాకి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ కార్ లోన్ మార్కెటింగ్ చేశాను. కాలి నడకన కోల్‌కతా మొత్తం తిరిగాను.
మళ్లీ బదలీ
కోల్‌కతాలో మార్కెటింగ్ మీద పట్టు వచ్చేటప్పటికి మా వారికి మళ్లీ బదలీ. ఈ సారి విజయవాడ. అప్పుడు బాబు పుట్టడంతో నా కెరీర్‌లో విరామం తీసుకున్నాను. మళ్లీ బదలీలు. మొత్తానికి బాబు స్కూల్‌కెళ్లే వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్‌కొచ్చాం. బాబు పెద్దయ్యాడు కాబట్టి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ ఇక ఆ వయసుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరని ఫ్రెండ్‌తో కలిసి క్రెష్ నడిపించాను.
కొంతకాలానికి ఇంట్లోనే ఉంటూ కేటరింగ్ మొదలుపెట్టాను. మేముండే వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎక్కువ మంది వయసు మళ్లిన దంపతులే. పిల్లలు విదేశాలకు వెళ్లిన తర్వాత పెద్ద దంపతులు విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని లంచ్, డిన్నర్ పంపించే ఏర్పాటు చేశాను.
ఉదయం తొమ్మిదిలోపు ఆర్డర్ చేస్తే భోజనం సమయానికి ఒక బాయ్ సహాయంతో క్యారియర్ చేర్చాను. మా వారికి తరచూ బదలీలు, ఆయన కష్టమంతా ఎన్నో కంపెనీల అభివృద్ధికి దోహదం అవుతున్నాయి. మాకు మాత్రం ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం లేదు. మంచి జీతం వస్తోంది. కానీ మనకు మనంగా సాధించింది ఏమిటని చూసుకుంటే వెలితి కనిపించసాగింది. అప్పుడు పంథా మార్చుకున్నాం. ఇదంతా ఆర్డ్ అండ్ వీవ్స్ ప్రారంభానికి ముందు నా జీవితం.
కళాకృతుల సేకరణ
ఆర్ట్ అండ్ వీవ్స్ అనే ప్రాజెక్ట్ రూపొందించుకుని, దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో çకళలు, కళాకారులు, చేనేతకారులను స్వయంగా కలిశాం. భారతీయ కళలు ఒకదానికి మరొకటి పూర్తిగా భిన్నం. దేనికదే ప్రత్యేకం. అంతటి వైవిధ్యతను ఒక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఆ కళారూపాలను అభిరుచి ఉన్నవారికి దగ్గర చేయడం, కళాకృతుల తయారీదారులకు పని కలి్పంచడం మా ఉద్దేశం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేయించాం.
ఒడిశా, రాజస్థాన్, బీహార్, కర్నాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకునే కళాకృతుల ఫొటోలను మా వెబ్‌సైట్‌లో పెట్టాం. మధుబని, బిద్రీ వంటి కళాఖండాలకు ఆదరణ బాగా వచ్చింది, ఆర్డర్‌లు కూడా వచ్చాయి. కానీ తయారీదారుల దగ్గర ఆ సమయానికి కస్టమర్ కోరుకున్న మధుబని ఆర్ట్ కానీ, చేనేత చీర కానీ ఉండేది కాదు. ఇవన్నీ చాలా సమయం తీసుకునే కళాకృతులు. అంత సమయం వేచి చూసే ఓపిక కస్టమర్‌లకు ఉండేది కాదు.
కస్టమర్‌కి సకాలంలో అందించాలంటే తయారీదారులం మనమే అయి ఉండాలనుకున్నాను. టెర్రకోట కళాకృతులు నేర్చుకోవడానికి ప్రయతి్నంచాను. కానీ కుదరలేదు. అదే సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్లు హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్ వారం రోజుల కోర్సు ప్రకటించారు. నేర్చుకోవడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, పొరపాట్లను సరిదిద్దుకుంటూ 54 రకాల సబ్బుల తయారీలో నైపుణ్యం సాధించాను. నా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్ వచ్చింది.
ఆర్గానిక్ హోమ్‌మేడ్ సబ్బులు, షాంపూ, బాత్ జెల్స్ చేస్తున్నాను. మా బ్రాండ్‌కు మౌత్ పబ్లిసిటీ వచి్చంది. విదేశాలకు వెళ్లే వాళ్లు తమ పిల్లల కోసం పచ్చళ్లు, పొడులతోపాటు మా దగ్గర నుంచి ఏడాదికి సరిపడిన సబ్బులు, షాంపూలు కూడా తీసుకెళ్తున్నారు. నా వర్క్ యూనిట్, ఆఫీస్, ఇల్లు ఒకే బిల్డింగ్‌లో. ఆర్డర్లు ఎక్కువున్నప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తాను. సాధారణంగా మధ్యాహ్నం రెండు వరకు పని చేస్తాను. ఓ గంట ధ్యానం, గార్డెనింగ్ నా డైలీ రొటీన్‌లో భాగం.
ప్రకృతి సహకారం
నా క్రియేటివిటీని నా బ్రాండ్ కోసమే ఉపయోగిస్తున్నాను. మరో నలుగురికి జీతం ఇవ్వగలుగుతున్నాను. మన సంకల్పం మంచిదై ఉండి, నిబద్ధతతో పని చేస్తే ప్రకృతి తన వంతుగా సహకారం అందిస్తుందని, అదే మనల్ని ఓ మార్గంలో నడిపిస్తుందని నమ్ముతాను. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)తో అనుసంధానమయ్యాను. ముద్ర లోన్ వచి్చంది.
ఈ రోజు నేనిలా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏ పనికి గౌరవం ఎక్కువ, ఏ పనికి గౌరవం తక్కువ అని ఆలోచించకపోవడమే. అన్ని పనులూ గౌరవంతో కూడినవే. మహిళలకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటే. గొప్పవాళ్లు ప్రత్యేకంగా పుట్టరు. నిజాయితీగా కష్టపడే తత్వమే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతుంది. నాకు రోల్‌మోడల్ ఎవరూ లేరు. నాకు నేనే రోల్‌మోడల్‌ని. అలాగే నాకు నేనే కాంపిటీటర్‌ని. ఈ రోజు చేసిన పనిని రేపు మరింత మెరుగ్గా చేయాలనే లక్ష్యాన్ని మనకు మనమే నిర్దేశించుకోవాలి.
జీవితం మనకు రెండే రెండు ఆప్షన్‌లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. ఆర్థిక సవాళ్లతోపాటు ఆరోగ్యం పెట్టే పరీక్షలూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ఏకైక కర్తవ్యం. సంతోషంగా జీవించాలా దిగాలుగా రోజులు గడపాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. మనసు బాగాలేకపోతే ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావడం అనే చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది’’ అన్నారు భార్గవి.
జీవితం మనకు రెండే రెండు ఆప్షన్‌లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. సంతోషంగా జీవించాలా.. దిగాలుగా రోజులు గడపాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే.
– భార్గవి పప్పూరి
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : మోహనాచారి
Comments
Please login to add a commentAdd a comment