handicrafts items
-
Bhargavi Pappuri: నా రోల్‌మోడల్ నేనే!
భార్గవి పప్పూరి... మన కళలను ఇష్టపడ్డారు. మన కళాకారులకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం కళాత్మకమైన వేదికను నేశారు. అది తన సృజనాత్మకతకే వేదికవుతుందనుకోలేదామె. ఆర్ట్ఎన్ వీవ్స్... కృషి ఆమెదే... కళ ఆమెదే. ఆర్ట్ అండ్ వీవ్స్ స్థాపించడానికి ముందు నా జర్నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అది సరదాగా సాగిపోయే ఓ సినిమాని తలపిస్తుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, వనస్థలి పురం దగ్గర ఆర్కే పురంలో. నాన్న పోస్ట్ మాస్టర్‌గా రిటైరయ్యారు. అమ్మ గృహిణి. బికామ్ చదివి చాలా కామ్‌గా ఉండేదాన్ని. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నోరు పెగిలేది కాదు. పెళ్లయిన తర్వాత మా వారు నన్ను మార్కెటింగ్ వైపు నడిపించారు. ఆయనది కూడా అదే ఫీల్డ్ కావడంతో నాకు మెళకువలు నేరి్పంచారు. మొదట క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లు మార్కెట్ చేశాను. మా వారికి కోల్‌కతాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కార్ లోన్ మార్కెటింగ్ చేశాను. కాలి నడకన కోల్‌కతా మొత్తం తిరిగాను. మళ్లీ బదలీ కోల్‌కతాలో మార్కెటింగ్ మీద పట్టు వచ్చేటప్పటికి మా వారికి మళ్లీ బదలీ. ఈ సారి విజయవాడ. అప్పుడు బాబు పుట్టడంతో నా కెరీర్లో విరామం తీసుకున్నాను. మళ్లీ బదలీలు. మొత్తానికి బాబు స్కూల్‌కెళ్లే వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్‌కొచ్చాం. బాబు పెద్దయ్యాడు కాబట్టి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ ఇక ఆ వయసుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరని ఫ్రెండ్‌తో కలిసి క్రెష్ నడిపించాను. కొంతకాలానికి ఇంట్లోనే ఉంటూ కేటరింగ్ మొదలుపెట్టాను. మేముండే వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎక్కువ మంది వయసు మళ్లిన దంపతులే. పిల్లలు విదేశాలకు వెళ్లిన తర్వాత పెద్ద దంపతులు విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని లంచ్, డిన్నర్ పంపించే ఏర్పాటు చేశాను. ఉదయం తొమ్మిదిలోపు ఆర్డర్ చేస్తే భోజనం సమయానికి ఒక బాయ్ సహాయంతో క్యారియర్ చేర్చాను. మా వారికి తరచూ బదలీలు, ఆయన కష్టమంతా ఎన్నో కంపెనీల అభివృద్ధికి దోహదం అవుతున్నాయి. మాకు మాత్రం ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం లేదు. మంచి జీతం వస్తోంది. కానీ మనకు మనంగా సాధించింది ఏమిటని చూసుకుంటే వెలితి కనిపించసాగింది. అప్పుడు పంథా మార్చుకున్నాం. ఇదంతా ఆర్డ్ అండ్ వీవ్స్ ప్రారంభానికి ముందు నా జీవితం. కళాకృతుల సేకరణ ఆర్ట్ అండ్ వీవ్స్ అనే ప్రాజెక్ట్ రూపొందించుకుని, దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో çకళలు, కళాకారులు, చేనేతకారులను స్వయంగా కలిశాం. భారతీయ కళలు ఒకదానికి మరొకటి పూర్తిగా భిన్నం. దేనికదే ప్రత్యేకం. అంతటి వైవిధ్యతను ఒక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఆ కళారూపాలను అభిరుచి ఉన్నవారికి దగ్గర చేయడం, కళాకృతుల తయారీదారులకు పని కలి్పంచడం మా ఉద్దేశం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేయించాం. ఒడిశా, రాజస్థాన్, బీహార్, కర్నాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకునే కళాకృతుల ఫొటోలను మా వెబ్సైట్లో పెట్టాం. మధుబని, బిద్రీ వంటి కళాఖండాలకు ఆదరణ బాగా వచ్చింది, ఆర్డర్లు కూడా వచ్చాయి. కానీ తయారీదారుల దగ్గర ఆ సమయానికి కస్టమర్ కోరుకున్న మధుబని ఆర్ట్ కానీ, చేనేత చీర కానీ ఉండేది కాదు. ఇవన్నీ చాలా సమయం తీసుకునే కళాకృతులు. అంత సమయం వేచి చూసే ఓపిక కస్టమర్లకు ఉండేది కాదు. కస్టమర్‌కి సకాలంలో అందించాలంటే తయారీదారులం మనమే అయి ఉండాలనుకున్నాను. టెర్రకోట కళాకృతులు నేర్చుకోవడానికి ప్రయతి్నంచాను. కానీ కుదరలేదు. అదే సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్లు హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్ వారం రోజుల కోర్సు ప్రకటించారు. నేర్చుకోవడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, పొరపాట్లను సరిదిద్దుకుంటూ 54 రకాల సబ్బుల తయారీలో నైపుణ్యం సాధించాను. నా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్ వచ్చింది. ఆర్గానిక్ హోమ్మేడ్ సబ్బులు, షాంపూ, బాత్ జెల్స్ చేస్తున్నాను. మా బ్రాండ్‌కు మౌత్ పబ్లిసిటీ వచి్చంది. విదేశాలకు వెళ్లే వాళ్లు తమ పిల్లల కోసం పచ్చళ్లు, పొడులతోపాటు మా దగ్గర నుంచి ఏడాదికి సరిపడిన సబ్బులు, షాంపూలు కూడా తీసుకెళ్తున్నారు. నా వర్క్ యూనిట్, ఆఫీస్, ఇల్లు ఒకే బిల్డింగ్‌లో. ఆర్డర్లు ఎక్కువున్నప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తాను. సాధారణంగా మధ్యాహ్నం రెండు వరకు పని చేస్తాను. ఓ గంట ధ్యానం, గార్డెనింగ్ నా డైలీ రొటీన్లో భాగం. ప్రకృతి సహకారం నా క్రియేటివిటీని నా బ్రాండ్ కోసమే ఉపయోగిస్తున్నాను. మరో నలుగురికి జీతం ఇవ్వగలుగుతున్నాను. మన సంకల్పం మంచిదై ఉండి, నిబద్ధతతో పని చేస్తే ప్రకృతి తన వంతుగా సహకారం అందిస్తుందని, అదే మనల్ని ఓ మార్గంలో నడిపిస్తుందని నమ్ముతాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)తో అనుసంధానమయ్యాను. ముద్ర లోన్ వచి్చంది. ఈ రోజు నేనిలా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏ పనికి గౌరవం ఎక్కువ, ఏ పనికి గౌరవం తక్కువ అని ఆలోచించకపోవడమే. అన్ని పనులూ గౌరవంతో కూడినవే. మహిళలకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటే. గొప్పవాళ్లు ప్రత్యేకంగా పుట్టరు. నిజాయితీగా కష్టపడే తత్వమే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతుంది. నాకు రోల్‌మోడల్ ఎవరూ లేరు. నాకు నేనే రోల్మోడల్ని. అలాగే నాకు నేనే కాంపిటీటర్ని. ఈ రోజు చేసిన పనిని రేపు మరింత మెరుగ్గా చేయాలనే లక్ష్యాన్ని మనకు మనమే నిర్దేశించుకోవాలి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. ఆర్థిక సవాళ్లతోపాటు ఆరోగ్యం పెట్టే పరీక్షలూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ఏకైక కర్తవ్యం. సంతోషంగా జీవించాలా దిగాలుగా రోజులు గడపాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. మనసు బాగాలేకపోతే ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావడం అనే చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది’’ అన్నారు భార్గవి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. సంతోషంగా జీవించాలా.. దిగాలుగా రోజులు గడపాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. – భార్గవి పప్పూరి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
హ్యాపీ స్పేస్
యాంత్రిక ప్రయాణంలో పోటీ ఎప్పుడూ ఉండేదే! కానీ, చంటిబిడ్డ తన జీవనంలోకి వచ్చినప్పుడు అమ్మ కళ్లలో.. కలల్లో చుట్టూ జీవం ఉండాలనుకుంటుంది. ‘ఆ ప్రయాస నుంచి పుట్టుకువచ్చిందే నా ప్రకృతి ఎకో ప్లే థీమ్’ అంటోంది భార్గవి. హైదరాబాద్ అల్వాల్‌లో ఉంటున్న భార్గవి నేచురల్ కలర్స్ వాడకం గురించి అపార్ట్మెంట్ పిల్లలకు పరిచయం చేస్తూ కనిపించారు. ఆసక్తితో ఆమె చేస్తున్న పని గురించి ప్రశ్నించినప్పుడు పిల్లల కోసం తను సృష్టించిన సహజ ప్రపంచాన్ని మన ముందుంచారు.. ‘‘పుట్టింది మెదక్ జిల్లాలో. ఎమ్‌టెక్ చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బిజీ బిజీగా మారిపోయాను. పెళ్లై, పిల్లలు జీవితంలోకి వచ్చాక నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. మూడేళ్ల నా కూతురు స్వతంత్రంగా ఎదగాలంటే ఏదైనా హ్యాపీ స్పేస్ ఉందా.. అని వెతికాను. కానీ, నాకేవీ సంతృప్తినివ్వలేదు. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే పిల్లల వికాసం అంత బాగుంటుంది అనే తపన నాది. దీంతో చాలారోజులు ఆలోచించాను. నా సేవింగ్స్ ఎంత ఉన్నాయో చూసుకున్నాను. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆరేళ్లక్రితం నా ఇద్దరు పిల్లలతో ఈ థీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాను. ఇప్పుడు ముప్పైమంది పిల్లలు ఉన్నారు. ఈ ముప్పై సంఖ్య దగ్గరే నేను కటాఫ్ పెట్టుకున్నాను. స్వలాభం ఏ మాత్రం చూసుకోని ఒక ప్రాజెక్ట్ ఇది. నాకై నేను నా పిల్లలకోసం సృష్టించుకున్న ప్రపంచం. ఈ పిల్లలు ఎదిగి, పైస్కూళ్లకు వెళ్లినప్పుడు ఎంత ప్రతిభను చూపిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నాను. ఈ హ్యాపీ స్పేస్‌లో పిల్లలు చేసే అద్భుతాలు కళ్లారా చూడాల్సిందే. అందమైన పెయింట్స్ వేస్తుంటారు. సీడ్ బాల్స్తయారుచేస్తారు. కాగితాలతో బొమ్మలు తయారుచేస్తారు. కూరగాయలు, పువ్వులతో రంగులు తయారుచేస్తారు. తొమ్మిదేళ్ల పాప ఫిక్షన్ స్టోరీస్ రాసి, బుక్ కూడా పబ్లిష్ చేసింది.ఆరుబయట చెట్ల కింద రాలిపడిన పూలు, విత్తనాలను ఏరుకొచ్చి, ఒక్కోదాని గురించి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారికి ఇష్టమైన పండ్లు, కూరగాయలతో సలాడ్స్ చేస్తుంటారు. ప్రతీదీ నిశితంగా పరిశీలించడం వల్ల వారిలో ఎంతటి అవగాహన పెరుగుతుందో స్వయంగా చూస్తుంటాం. ఇది వారి మానసిక వికాసానికి ఎంతో మేలు కలిగిస్తుంది. హ్యాండీ క్రాఫ్ట్ తయారీలో పిల్లల చూపే ప్రతిభ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తే ఎన్ని అద్భుతాలు చూపుతారో స్వయంగా నేనే తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుంటాను. రెండేళ్ల నుంచి పద్నాలుగేళ్ల పిల్లలు ఈ గ్రూప్‌లో ఉన్నారు. పిల్లలు వేసే ప్రశ్నలే ఈ ఎకో థీమ్‌లో పాఠ్యాంశాలు. ఎవరికీ నచ్చలేదు... మా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఇప్పుడు స్పెషల్ కిడ్స్ కూడా ఉన్నారు. వారిలో ఎంత ఆర్ట్ ఉందో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాను. చాలా మంది పేరెంట్స్ ముందు నా థీమ్‌ను ఏ మాత్రం నమ్మలేదు. ‘పిల్లలకు ఈమె ఏమీ నేర్పడం లేదు. ఆడుకోవడానికి వదిలేస్తున్నారు. క్రమశిక్షణగా పిల్లలు ఒక్క దగ్గర కూర్చోవడం లేద’ని చాలా మంది తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కోవిడ్ టైమ్‌లో అయితే అందరూ మూసేయమనే సలహాలే. మా ఇంటి నుంచి మరీ ఎక్కువగా వచ్చాయి. ‘జాబ్ మానేసి, ఇలాంటి ప్రాజెక్ట్ వద్దు, ఎలాంటి లాభాలూ ఉండవు’ అనే మాటలే నా చుట్టూ విన్నాను. కానీ, లాభం కోసం ఈ థీమ్‌ని ఎంచుకోలేదు. నా పిల్లల కోసం ఎంచుకున్నాను. నేను నమ్మిన ఈ సిస్టమ్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. నా ఈ థీమ్‌కు తగిన టీచర్లను ఎంపిక చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. దీంతో నేనే కొందరిని ఎంపిక చేసుకొని, నాకు తగినవిధంగా ట్రైన్ చేసుకున్నాను. అదే పట్టుదలతో కొనసాగించాను. ఫైనాన్షియల్‌గా ఇది సక్సెస్ఫుల్ అని చెప్పలేం. కానీ, ఎప్పటికీ నిలిచే ఉండేది, నాకు సంతృప్తిగా అనిపించిన ప్రపంచం ఇదే. దానినే పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాను. నా పిల్లలనూ ఈ ప్రపంచంలో పెంచడం చాలా హ్యాపీగా ఉంది. అవగాహన కార్యక్రమాలు... ఈ థీమ్ వల్ల పిల్లల్లో జరిగే మానసిక వికాసం ఎంతగా ఉంటుందో తెలియజేస్తూ కార్పోరేట్ స్కూళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల్లోని స్వయంప్రతిభ ఎలా ఉంటుందో, వారిని వారిలాగే ఎలా ఎదగనివ్వాలో మా నేచర్ పిల్లలను పరిచయం చేసి, మరీ చూపుతుంటాను. రోజువారీ మనకు ఏం అవసరమో వాటన్నింటినీ స్వయంగా ఇక్కడి పిల్లలు చేస్తుంటారు. వాళ్లే వంట చేయడం, తినడం.. ఏదీ కూడా చెప్పకుండానే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, తమ ప్రతిభను చూపుతుంటారు. లాభాపేక్ష లేకుండా చేసే ఈ పని రాబోయే తరాలకు ప్రయోజనం కలిగించడమే నాకు వచ్చే ఆదాయం’ అని చెబుతోంది భార్గవి. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
ఈ–కామర్స్ వేదికపై మన హస్తకళలు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను రాష్ట్ర హస్తకళాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారంతో ఈ–కామర్స్ పోర్టళ్ల వేదికగా తమ ఉత్పత్తులకు ఆన్లైన్ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులైన హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెట్లో విక్రయించేందుకు మెప్మా చేపట్టిన కార్యాచరణ విజయవంతమవుతోంది. ఇప్పటికే 450 రకాల హస్తకళా ఉత్పత్తులు ఈ–కామర్స్ పోర్టళ్లలో బ్రాండింగ్ దక్కించుకోవడం విశేషం. మెప్మా కార్యాచరణ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 94,533 మంది హస్త కళాకారులు డ్వాక్రా సంఘాల సభ్యులుగా ఉన్నారు. సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ఆలంబనగా చేసుకుని వారు స్వయంఉపాధి రంగంలో రాణించేందుకు మెప్మా కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ముందుగా స్వయం ఉపాధి పథకాల కోసం గ్రూపు రుణాలు, వ్యక్తిగత రుణాల కింద రూ.118.49 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యతను కూడా చేపట్టింది. ప్రధానంగా విస్తృతమవుతున్న ఆన్లైన్ మార్కెటింగ్ రంగం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. మహిళలు తమ ఇళ్లలో తయారుచేసిన హస్త కళారూపాలను మార్కెటింగ్ చేసుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ–కామర్స్ పోర్టళ్లలో రిజిస్ట్రేషన్ చేయించింది. అదేవిధంగా ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ సౌజన్యంతో డ్వాక్రా సభ్యులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించింది. 450 రకాల ఉత్పత్తులు ఈ–కామర్స్ ద్వారా మార్కెటింగ్ కోసం జిల్లాలవారీగా హస్తకళలను మెప్మా ఎంపిక చేసింది. దాంతో ఆయా జిల్లాల డ్వాక్రా మహిళలు ఆ ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఏకంగా 450 రకాల హస్త కళా ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోర్టళ్లలో బ్రాండింగ్ పొందడం విశేషం. మహిళల స్వయంఉపాధికి ఊతం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్న హస్తకళా ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. దీంతో మహిళల స్వయంఉపాధి అవకాశాలు పెరిగి మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. ఇప్పటివరకు 450 రకాల ఉత్పత్తులకు ఆన్లైన్లో బ్రాండింగ్ చేయించాం. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. – వి.విజయలక్ష్మి, మిషన్ డైరెక్టర్, మెప్మా -
అల్లికళ తప్పుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పై లేసులను చూశారా.. ఎంత అందంగా ఉండి మనస్సును ఆకట్టుకుంటోందో.. దీని వెనుక గాలిలో గమ్మత్తుగా చేతులు తిప్పే మహిళల అద్భుత ప్రతిభ దాగి ఉంది. తదేకంగా దృష్టి కేంద్రీకరించి రూపొందించే ఈ కళాత్మక లేసు అల్లికలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంతో ప్రసిద్ధి. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే క్రమంగా చాలామంది.. ముఖ్యంగా ఈ తరంవారు ఈ కళకు దూరమవుతున్నారు. పనికి తగ్గ ఫలితం దక్కకపోవడం వారిని నిరుత్సాహపరుస్తోంది. నరసాపురం తరువాత దేశంలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పరిమితంగా లేసు పరిశ్రమ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరుదైన లేసు అల్లికల కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. బామ్మల వారసత్వంగా.. రెండు జిల్లాల్లోని 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నట్టు అంచనా. గత 50 ఏళ్లుగా తమ బామ్మల వారసత్వంగా ఈ అరుదైన కళను కొనసాగిస్తున్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరిలో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్‌దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది దాకా ఉన్నారు. లేసు పార్కును ప్రారంభించిన వైఎస్సార్ కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ద్వారా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ఏర్పాటు చేయించారు. ఆయన స్వయంగా ఈ పార్కును ప్రారంభించారు. ప్రస్తుతం లేసుపార్కుకు అనుసంధానంగా 50 సొసైటీలు, 29,000 మంది సభ్యులు ఉన్నారు. మహిళల్లో మార్కెట్ స్కిల్స్ పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడానికి లేసుపార్కు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పార్కును నిర్లక్ష్యం చేయడంతో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో నరసాపురం లేసు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లు, నాణ్యతతో కూడిన అల్లికలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఇచ్చినంత తక్కువ ధరకు నరసాపురం ఎగుమతి దారులు అల్లికలను ఇవ్వలేకపోతున్నారు. కుంగదీస్తున్న పన్నుల మోత లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. ఇప్పుడు లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితం వరకు ప్రతిఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఏటా కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2006లో ఒక్క లేసు పార్కు ద్వారానే రూ.100 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం అది రూ.50 కోట్లకు పడిపోయింది. లేసు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతి దారులు కోరుతున్నారు. శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూడాలి నేను చిన్నప్పటి నుంచి లేసు అల్లికలు కుడుతున్నాను. లేసు కుట్టడం చాలా కష్టమైన పని. కంటి చూపును ఒకేచోట కేంద్రీకరించాలి. దాంతో కళ్ల జబ్బులు వస్తాయి. మా శ్రమకు తగ్గ వేతనం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందుముందు ఎవరూ లేసు అల్లికలు కుట్టరు. ఇప్పటి పిల్లలు ఈ వృత్తిలోకి రావడం లేదు. – చిలుకూరి అంజలి, శిరగాలపల్లి, యలమంచిలి మండలం కేవలం వ్యాపారం మాత్రమే కాదు లేసుపార్కు కేవలం వ్యాపారం కోసమే పెట్టింది కాదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తాం. వారిలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అల్లికలు సాగించే మహిళలే నేరుగా ఎగుమతులు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మన లేసు పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. – జక్కంపూడి నాయుడు, లేసుపార్కు మేనేజర్ -
జాతీయ చేనేత ప్రదర్శన అదుర్స్
- ఆర్కాట్రోడ్డులో ప్రారంభమైన ఎక్స్పో - జూన్ 15 వరకు కొనసాగనున్న ప్రదర్శన కొరుక్కుపేట, న్యూస్‌లైన్:భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే చేనేత, హస్తకళా వస్తువులు దశాబ్దాల నుంచి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. హస్తకళలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వంతోపాటు, పలు సంఘాలు కృషి చేస్తున్నాయి. భారత దేశానికే వన్నె తెచ్చిన చేనేత, హస్తకళలు మరింతగా బతికించుకునేందుకు పుష్పాంజలి ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థాన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ చేనేత హస్తకళా ఉత్పత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా చెన్నై, సాలిగ్రామం, భరణీ హాస్పిటల్ సమీపంలోని ఆర్కాట్ రోడ్డులో జాతీయ చేనేత ఎక్స్పోను గురువారం నుంచి ప్రారంభించింది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రదర్శనలోని వస్తువులు, హస్తకళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీహార్‌కు చెందిన మధుబానీ రింట్ శారీలు, జైపూర్‌కు చెందిన తుషార్ సిల్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాంతా సిల్క్ శారీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన కాశ్మీర్ ప్లోరల్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్, ప్యూర్ సాఫ్ట్ కాటన్ బందిని శారీలు, బెంగాళ్ కాటన్ శారీలు, మదురై కాటన్ చీరలు మగువలకు కనువిందు చేస్తున్నాయి. అదేవిధంగా హస్తకళా ప్రియులను లెట్ ఉడ్‌తో, రోజ్ ఉడ్‌తో చేసిన బొమ్మలు, ఆర్ట్ జ్యువలరీ, చిన్నారుల ఆట బొమ్మలు అలరిస్తున్నాయి. జూన్ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.