అల్లికళ తప్పుతోంది! | embroidery industry in crisis dodavary districts | Sakshi
Sakshi News home page

అల్లికళ తప్పుతోంది!

Published Sat, Oct 19 2019 5:25 AM | Last Updated on Sat, Oct 19 2019 5:26 AM

embroidery industry in crisis dodavary districts - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  పై లేసులను చూశారా.. ఎంత అందంగా ఉండి మనస్సును ఆకట్టుకుంటోందో.. దీని వెనుక గాలిలో గమ్మత్తుగా చేతులు తిప్పే మహిళల అద్భుత ప్రతిభ దాగి ఉంది. తదేకంగా దృష్టి కేంద్రీకరించి రూపొందించే ఈ కళాత్మక లేసు అల్లికలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంతో ప్రసిద్ధి. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే క్రమంగా చాలామంది.. ముఖ్యంగా ఈ తరంవారు ఈ కళకు దూరమవుతున్నారు. పనికి తగ్గ ఫలితం దక్కకపోవడం వారిని నిరుత్సాహపరుస్తోంది. నరసాపురం తరువాత దేశంలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పరిమితంగా లేసు పరిశ్రమ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరుదైన లేసు అల్లికల కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది.


బామ్మల వారసత్వంగా..
రెండు జిల్లాల్లోని 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నట్టు అంచనా. గత 50 ఏళ్లుగా తమ బామ్మల వారసత్వంగా ఈ అరుదైన కళను కొనసాగిస్తున్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరిలో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్‌దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది దాకా ఉన్నారు.  

లేసు పార్కును ప్రారంభించిన వైఎస్సార్‌
కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ద్వారా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ఏర్పాటు చేయించారు. ఆయన స్వయంగా ఈ పార్కును ప్రారంభించారు. ప్రస్తుతం లేసుపార్కుకు అనుసంధానంగా 50 సొసైటీలు, 29,000 మంది సభ్యులు ఉన్నారు. మహిళల్లో మార్కెట్‌ స్కిల్స్‌ పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడానికి లేసుపార్కు ఏర్పాటు చేశారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పార్కును నిర్లక్ష్యం చేయడంతో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో నరసాపురం లేసు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లు, నాణ్యతతో కూడిన అల్లికలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా ఇచ్చినంత తక్కువ ధరకు నరసాపురం ఎగుమతి దారులు అల్లికలను ఇవ్వలేకపోతున్నారు.

కుంగదీస్తున్న పన్నుల మోత
లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. ఇప్పుడు లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్‌టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితం వరకు ప్రతిఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఏటా కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2006లో ఒక్క లేసు పార్కు ద్వారానే రూ.100 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం అది రూ.50 కోట్లకు పడిపోయింది. లేసు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతి దారులు కోరుతున్నారు.  

శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూడాలి  
నేను చిన్నప్పటి నుంచి లేసు అల్లికలు కుడుతున్నాను. లేసు కుట్టడం చాలా కష్టమైన పని. కంటి చూపును ఒకేచోట కేంద్రీకరించాలి. దాంతో కళ్ల జబ్బులు వస్తాయి. మా శ్రమకు తగ్గ వేతనం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందుముందు ఎవరూ లేసు అల్లికలు కుట్టరు. ఇప్పటి పిల్లలు ఈ వృత్తిలోకి రావడం లేదు.

– చిలుకూరి అంజలి, శిరగాలపల్లి, యలమంచిలి మండలం  

కేవలం వ్యాపారం మాత్రమే కాదు  
లేసుపార్కు కేవలం వ్యాపారం కోసమే పెట్టింది కాదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తాం.  వారిలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అల్లికలు సాగించే మహిళలే నేరుగా ఎగుమతులు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మన లేసు పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది.
  
– జక్కంపూడి నాయుడు, లేసుపార్కు మేనేజర్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement