Godavari district
-
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీని దక్కించుకున్న పీడీఎఫ్
-
పోలవరం కాలువ గట్లపై మట్టిని తవ్వేస్తున్న జనసేన, టీడీపీ నేతలు
-
కుళ్లిన కొబ్బరికీ కోట్లు
కొబ్బరి కాయ కుళ్లిపోయింది కదాని పక్కన పాడేయకండి. ఎందుకంటే.. కుళ్లిన కాయలు సైతం రూ.కోట్లు కురిపిస్తాయట. కుళ్లిన కురిడీల నుంచి తీసే నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తుంటే.. కుళ్లిన కాయలను కాశీలో శవ దహనాలకు వినియోగిస్తున్నారట. ఒక్క ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే కుళ్లిపోయిన కొబ్బరి కాయలతో రూ.100 కోట్లకు పైగావ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయట. అక్షరాలా ఇది నిజమని చెబుతున్నారు ఇక్కడి కొబ్బరి వ్యాపారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల కల్పతరువు కొబ్బరి. ఇప్పటివరకు కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, తెలగపిండి, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచు, పీచులోంచి వచ్చే పౌడర్, కొబ్బరి తాడు, ఆకుల నుంచి ఈనెలు, కమ్మలు ద్వారానే డబ్బొస్తుందని అందరికీ తెలుసు. కుళ్లిపోయిన కొబ్బరి కాయలకు సైతం డిమాండ్ ఉందనే విషయం ఎందరికి తెలుసు. కుళ్లిన కొబ్బరితో ఏటా రూ.కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కొబ్బరి కాయల దింపు సమయంలోను, రాశుల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలను ఏరి పక్కన పడేస్తుంటారు. నాణ్యమైన కాయలను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఏరివేసే ప్రక్రియను నాడెం(నాణ్యత పరిశీలకులు) చేసేవారు నిర్వహిస్తారు. కొబ్బరి రాశుల నుంచి నూటికి 5 కొబ్బరి కాయలు కుళ్లిపోయినవి వస్తుంటాయి. వీటిని ఏరివేసి పక్కన పడేస్తుంటారు. వీటిని కూడా కొనుగోలు చేసే వ్యాపారులు ప్రత్యేకంగా ఉంటారు. వీరు ఒక్కో కాయకు రూపాయి లేదా రెండు రూపాయల చొప్పున (కుళ్లిన కొబ్బరి పరిమాణాన్ని బట్టి) కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కుళ్లిన కొబ్బరి కాయలను ప్రాసెసింగ్, రవాణా చార్జీలతో కలిపి ఉత్తరాదిలో ఒక్కో కాయ రూ.8 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు. వాటి నుంచి నూనె తీసి.. కుళ్లిన కొబ్బరి కాయల్లో వచ్చే కొబ్బరి గుజ్జును తీసి నాలుగైదు వారాలపాటు ఎండబెట్టి కొబ్బరి నూనె తీస్తారు. ఇలా తీసిన నూనె కోనసీమలోని అంబాజీపేట కేంద్రంగా వ్యాపారులు సేకరిస్తారు. ఇలా సేకరించిన కుళ్లిన కొబ్బరి నూనెను యానాం, తణుకు, విజయవాడ, పుణె, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సబ్బుల తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. టన్నుల కొద్దీ కుళ్లిన కొబ్బరి నూనె అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నూనె కిలో రూ.30 నుంచి రూ.40 చొప్పున అమ్ముడుపోతుంది. కుళ్లిన కొబ్బరి కాయల చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్లో వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ తణుకు, విజయవాడ రవాణా చేస్తున్నారు. ఈ చిప్పలు టన్ను రూ.5 వేల ధర పలుకుతోంది. ఎగుమతికి సిద్ధమైన కుళ్లిన కొబ్బరి చిప్పలు శవ దహనాలకు కుళ్లిన కొబ్బరి కాయలు కాశీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో శవాల దహనానికి కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి వినియోగిస్తున్నారు. కుళ్లిన కొబ్బరి కాయలను నాణ్యమైన కొబ్బరి కాయల మాదిరిగా సంచులలో నింపి లారీల ద్వారా కాశీ, మధుర తదితర క్షేత్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కాశీ వంటి క్షేత్రాల్లో కొబ్బరి కాయలతో అంత్యక్రియలు నిర్వహిస్తే పుణ్యం వస్తుందని ఉత్తరాది రాష్ట్రాల వారి నమ్మకం. ఇందుకు నాణ్యమైన కొబ్బరి కాయలు వినియోగించాలంటే కాయ రూ.20 పైనే ఉంటుంది. అంత ధర భారమనే ఉద్దేశంతో కుళ్లిన కొబ్బరి కాయలను శవ దహనానికి వినియోగిస్తున్నారని గోదావరి జిల్లాల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతిచేసే వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి రోజుకు మూడు లారీలు (సుమారు లక్ష కాయలు) కాశీకి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతి అవుతున్నాయి. కార్తీక మాసంతో పాటు పూజల సమయాలలో హోమాల నిర్వహణ, మొక్కులు తీర్చుకునే క్రమంలో నదులలో వదిలేందుకు ఉత్తరాది భక్తులు ఈ కొబ్బరి కాయలను బస్తాల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి రెట్టింపు ధర పలుకుతున్నాయి. రూ.వంద కోట్ల వరకు లావాదేవీలు కుళ్లిన కొబ్బరి కాయలను ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఆచంట, అంబాజీపేట, పాశర్లపూడి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా కుళ్లిన కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తుండటంతో పోటీ నెలకొంది. కుళ్లిన కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, చిప్పలు అన్నీ కలిపి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జరిగే లావాదేవీలు ఏటా రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఉత్తరాదిలో మంచి గిరాకీ కుళ్లిన కొబ్బరి కాయల్ని చాలా కాలంగా ఎగుమతి చేస్తున్నాం. ఈ కొబ్బరికి ఉత్తరాదిలో మంచి గిరాకీ ఉంటుంది. ఆరేడు నెలల ముందుగానే ఆర్డర్లు బుక్ చేసుకుని కొనుగోలు చేస్తుంటారు. ఒబ్బిడి చేసిన కుళ్లిన కొబ్బరి కాయల నూనె, చిప్పలను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. సబ్బులు, దోమల కాయిల్స్ తయారీ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. శవ దహనాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. – దాసింశెట్టి రామారావు, పెదతిప్ప, వ్యాపారి -
ఇలస చేప.. పులసగా ఎలా మారుతుందో తెలుసా?
పెనుగొండ(పశ్చిమ గోదావరి జిల్లా): గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి పులసలు ఎర్రెక్కుతాయి. వారం రోజులుగా గోదావరిలో ఎర్రటి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పులసలు లభ్యమయ్యే కాలం ఆసన్నమైంది. ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పులసల జాడ కనిపిస్తోంది. సముద్రంలో జీవించే ఇలస చేప గోదావరికి వరద నీరు రాగానే ఎర్రదనంలోని తీపిని ఆస్వాదిస్తూ బంగాళాఖాతం నుంచి ఎదురీతుకుంటూ నదిలోకి వస్తుంది. ముఖ్యంగా వశిష్ట గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి గోదావరిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో జాలర్లకు చిక్కుతుంటాయి. ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులసల జాడ కనిపిస్తుంటుంది. వారం రోజులుగా గోదావరి వరద నీరు ఉధృతంగా సముద్రంలో కలుస్తుండటంతో పులసలు సమృద్ధిగా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అ‘ధర’హో.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ ఇది గోదావరి ప్రాంతంలో నానుడి. ఏడాదికి ఓసారి మాత్రమే లభించే పులసల కోసం మాంసప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. దీంతో వీటికి డిమాండ్ అధికంగానే ఉంటుంది. బరువును బట్టి చేప ఒకటి రూ.1,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుంది. ఇలసలను పులసలుగా.. పులసల డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా చెబుతూ విక్రయిస్తుంటారు. ఒడిషా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి జిల్లాలో పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే. ఎర్రనీటిలో ప్రయాణించడం వల్ల పులసలు ఎరుపు, గోధుమ వర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలు పు రంగులోనే ఉంటాయని జాలర్లు అంటున్నారు. -
అల్లికళ తప్పుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పై లేసులను చూశారా.. ఎంత అందంగా ఉండి మనస్సును ఆకట్టుకుంటోందో.. దీని వెనుక గాలిలో గమ్మత్తుగా చేతులు తిప్పే మహిళల అద్భుత ప్రతిభ దాగి ఉంది. తదేకంగా దృష్టి కేంద్రీకరించి రూపొందించే ఈ కళాత్మక లేసు అల్లికలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంతో ప్రసిద్ధి. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే క్రమంగా చాలామంది.. ముఖ్యంగా ఈ తరంవారు ఈ కళకు దూరమవుతున్నారు. పనికి తగ్గ ఫలితం దక్కకపోవడం వారిని నిరుత్సాహపరుస్తోంది. నరసాపురం తరువాత దేశంలో ఉత్తరప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పరిమితంగా లేసు పరిశ్రమ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరుదైన లేసు అల్లికల కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. బామ్మల వారసత్వంగా.. రెండు జిల్లాల్లోని 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నట్టు అంచనా. గత 50 ఏళ్లుగా తమ బామ్మల వారసత్వంగా ఈ అరుదైన కళను కొనసాగిస్తున్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరిలో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది దాకా ఉన్నారు. లేసు పార్కును ప్రారంభించిన వైఎస్సార్ కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ద్వారా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ఏర్పాటు చేయించారు. ఆయన స్వయంగా ఈ పార్కును ప్రారంభించారు. ప్రస్తుతం లేసుపార్కుకు అనుసంధానంగా 50 సొసైటీలు, 29,000 మంది సభ్యులు ఉన్నారు. మహిళల్లో మార్కెట్ స్కిల్స్ పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడానికి లేసుపార్కు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పార్కును నిర్లక్ష్యం చేయడంతో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో నరసాపురం లేసు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లు, నాణ్యతతో కూడిన అల్లికలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఇచ్చినంత తక్కువ ధరకు నరసాపురం ఎగుమతి దారులు అల్లికలను ఇవ్వలేకపోతున్నారు. కుంగదీస్తున్న పన్నుల మోత లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. ఇప్పుడు లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితం వరకు ప్రతిఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఏటా కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2006లో ఒక్క లేసు పార్కు ద్వారానే రూ.100 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం అది రూ.50 కోట్లకు పడిపోయింది. లేసు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతి దారులు కోరుతున్నారు. శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూడాలి నేను చిన్నప్పటి నుంచి లేసు అల్లికలు కుడుతున్నాను. లేసు కుట్టడం చాలా కష్టమైన పని. కంటి చూపును ఒకేచోట కేంద్రీకరించాలి. దాంతో కళ్ల జబ్బులు వస్తాయి. మా శ్రమకు తగ్గ వేతనం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందుముందు ఎవరూ లేసు అల్లికలు కుట్టరు. ఇప్పటి పిల్లలు ఈ వృత్తిలోకి రావడం లేదు. – చిలుకూరి అంజలి, శిరగాలపల్లి, యలమంచిలి మండలం కేవలం వ్యాపారం మాత్రమే కాదు లేసుపార్కు కేవలం వ్యాపారం కోసమే పెట్టింది కాదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తాం. వారిలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అల్లికలు సాగించే మహిళలే నేరుగా ఎగుమతులు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మన లేసు పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. – జక్కంపూడి నాయుడు, లేసుపార్కు మేనేజర్ -
‘ఆహ్లా’దం.. అద్భుతం
- గోదావరి అందాలకు యాత్రికుల పరవశం - చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన సాక్షి,రాజమండ్రి : పుష్కరాలకు పోటెత్తుతున్న యాత్రికులు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక , ఆధ్యాత్మిక కేంద్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్కర స్నానాలు పూర్తిచేసి పర్యాటక కేంద్రాల సందర్శనలకు బయల్దేరుతున్నారు. గోదావరి అందాలను చూసి ఆనందలో మునిగితేలుతున్నారు. కాటన్దొర గొప్పదనాన్ని కొనియాడుతున్నారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన పాపికొండలు, పట్టిసీమ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజినీ చూసేందుకు వస్తున్నారు. బ్యారేజీ పక్కనే ఉన్న కాటన్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. బొమ్మూరు మిట్టలో కాటన్దొర నివాసమున్న ఇంటిని సైతం సందర్శిస్తున్నారు. ఇక రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్న ఇస్కాన్టెంపుల్, కందుకూరి వీరేశలింగం పంతులు నివాస గృహాన్ని పుష్కర యాత్రికులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాల్లబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలను సైతం పుష్కర యా త్రికులు సందర్శిస్తున్నారు. మ్యూజియంలోని శిల్పకళను తిలకిస్తున్నారు. వీటితో పాటు ఉభయ గోదారిజిల్లాలలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సైతం పుష్కర భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు.