సాక్షి, నెట్‌వర్క్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. వసతి గృహాలు శిథిలావస్థకు చేరడం, కిటికీలు, తలుపులు లేక మరుగుదొడ్లు కంపు కొడుతుండడం, ఉన్నవాటికి నీటి వసతి లేకపోవడం, కనీసం తాగడానికి కూడా మంచినీరు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇంకా పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు, సబ్బులు, నోట్ బుక్స్ అందలేదు. కొన్ని హాస్టళ్లలో గదులకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో దోమల బాధతో విద్యార్థులు జాగారం చేస్తున్నారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ, ఆశమ్ర పాఠశాలల్లో సరిపడా సరుకులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ చేసిన పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ప్లేట్లు, గ్లాసులు, సబ్బులు, దుప్పట్లు ఏమీ లేవు..
జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 77 ఉండగా ఇందులో 52 బాలురు, 25 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం 8 వేల సీట్లకు గాను 3,847 సీట్లు ప్రస్తుతం భర్తీ అయ్యాయి. బీసీ హాస్టళ్లు 67 ఉండగా.. 37 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో 5 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు పెట్టెలు, దుప్పట్లు అందజేసినట్లు అధికారులు చెబుతున్నా చాలా హాస్టళ్లకు ఇవి అందలేదు. ఇక బీసీ హాస్టళ్ల విద్యార్థులకు అసలు పెట్టెలు, దుప్పట్లు, ప్లేటు, గ్లాసులు, సబ్బులు ఇంకా రానే లేదు. ఐటీడీఏ, మైదాన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు 365, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 75, వసతి గృహాలు 45 ఉన్నాయి. వీటిలో 36 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా ఈ హాస్టళ్లలో భోజనం అందిచేందుకు సరిపడ సరుకులు లేవు. ప్రభుత్వం నుంచి రూ.2.50 కోట్లు రావాల్సిన బిల్లు పెండింగ్‌లో ఉండడమే దీనికి కారణం.
దీంతో ఈ హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం సరిపోవడం లేదు. చాలా చోట్ల వార్డెన్లు లేకపోవడం, ఇన్‌చార్జులు పర్యవేక్షించాల్సి రావడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది. కొన్ని చోట్ల రెగ్యులర్‌గా కుక్‌లు లేకపోవడంతో ఏ రోజుకారోజు కూలీలను పెట్టి వండించి పెడుతున్నారు. ఇక ఎప్పటిలాగే రక్షిత మంచి నీటి వ్యవస్థ లేకపోవడం, టాయిలెట్లు సరిగా లేకపోవడం లాంటి సమస్యలు విద్యార్థులను పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే అనే రీతిలో సంక్షేమ హాస్టళ్లలో ఎదురవుతున్న సమస్యలు ఎప్పటికి తీరుతాయో ఆ పాలకులకే తెలియాలి.
సం‘క్షామ’ హాస్టళ్లు !
Published Fri, Jul 18 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement
Advertisement