boxes
-
ఆర్టీసీలో కానరాని ఫస్ట్ ఎయిడ్
ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స లేనట్లే! పట్టించుకోని ఆర్టీసీ అధికారులు రాయవరం : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. ఇలా ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తోంది. బస్సు ప్రమాదానికి గురైతే అప్పటికప్పుడు తాత్కాలిక వైద్య సేవలు పొందేందుకు ప్రతి ఆర్టీసీ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ప్రస్తుతం అటువంటివి బస్సుల్లో కానవరావడం లేదు. బస్సు షడన్ బ్రెక్ వేసినప్పుడు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలపాలైతే వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందే. 3.23 లక్షల కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, తుని, గోకవరంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 840 బస్సులు వివిధ మార్గాల్లో ప్రతి రోజు 3.23 లక్షల కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆర్టీసీలో ఉద్యోగంలో చేరే కొత్త డ్రైవర్లకు, కండక్టర్లకు తొలుత ఫస్ట్ ఎయిడ్ ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాలిస్తారు. ప్రయాణికులు గాయపడితే.. వారికి అత్యవసర చికిత్స చేసే సామర్థ్యం సంబంధిత బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఉంటుంది. కాని ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురై ప్రయాణికులకు గాయాలైతే 108 వాహనం వచ్చే వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకు క్షతగాత్రులు నొప్పితో బాధపడాల్సిందే. ప్రథమ చికిత్స అందక పోవడం వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాప్రాయం కూడా కలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో... ఫస్ట్ ఎయిడ్ బాక్సులో రెండు బ్యాండేజ్ కట్టలు, టించర్ అయోడిన్, గ్లాస్ బ్యాండేజ్, నొప్పి తగ్గించే ఆయింట్మెంట్, అత్యవసర మందులు ఉంటాయి. పట్టించుకోని అధికారులు.. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ల్లో మందులను ఏర్పాటు చేయక పోతే బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీవో స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ బస్సులేనన్న భావనతో సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. -
సం‘క్షామ’ హాస్టళ్లు !
సాక్షి, నెట్వర్క్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. వసతి గృహాలు శిథిలావస్థకు చేరడం, కిటికీలు, తలుపులు లేక మరుగుదొడ్లు కంపు కొడుతుండడం, ఉన్నవాటికి నీటి వసతి లేకపోవడం, కనీసం తాగడానికి కూడా మంచినీరు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇంకా పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు, సబ్బులు, నోట్ బుక్స్ అందలేదు. కొన్ని హాస్టళ్లలో గదులకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో దోమల బాధతో విద్యార్థులు జాగారం చేస్తున్నారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ, ఆశమ్ర పాఠశాలల్లో సరిపడా సరుకులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ చేసిన పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్లేట్లు, గ్లాసులు, సబ్బులు, దుప్పట్లు ఏమీ లేవు.. జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 77 ఉండగా ఇందులో 52 బాలురు, 25 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం 8 వేల సీట్లకు గాను 3,847 సీట్లు ప్రస్తుతం భర్తీ అయ్యాయి. బీసీ హాస్టళ్లు 67 ఉండగా.. 37 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో 5 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు పెట్టెలు, దుప్పట్లు అందజేసినట్లు అధికారులు చెబుతున్నా చాలా హాస్టళ్లకు ఇవి అందలేదు. ఇక బీసీ హాస్టళ్ల విద్యార్థులకు అసలు పెట్టెలు, దుప్పట్లు, ప్లేటు, గ్లాసులు, సబ్బులు ఇంకా రానే లేదు. ఐటీడీఏ, మైదాన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు 365, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 75, వసతి గృహాలు 45 ఉన్నాయి. వీటిలో 36 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా ఈ హాస్టళ్లలో భోజనం అందిచేందుకు సరిపడ సరుకులు లేవు. ప్రభుత్వం నుంచి రూ.2.50 కోట్లు రావాల్సిన బిల్లు పెండింగ్‌లో ఉండడమే దీనికి కారణం. దీంతో ఈ హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం సరిపోవడం లేదు. చాలా చోట్ల వార్డెన్లు లేకపోవడం, ఇన్చార్జులు పర్యవేక్షించాల్సి రావడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది. కొన్ని చోట్ల రెగ్యులర్‌గా కుక్‌లు లేకపోవడంతో ఏ రోజుకారోజు కూలీలను పెట్టి వండించి పెడుతున్నారు. ఇక ఎప్పటిలాగే రక్షిత మంచి నీటి వ్యవస్థ లేకపోవడం, టాయిలెట్లు సరిగా లేకపోవడం లాంటి సమస్యలు విద్యార్థులను పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే అనే రీతిలో సంక్షేమ హాస్టళ్లలో ఎదురవుతున్న సమస్యలు ఎప్పటికి తీరుతాయో ఆ పాలకులకే తెలియాలి. -
బ్యాలెట్ బాక్సులొచ్చేశాయ్!
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: cఆయా కార్యాలయాల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది వాటిని పరిశీలించారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాల పోలింగ్ కోసం మూడు రకాల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఒక్కో స్థానంలో ఓట్ల సంఖ్యను బట్టి బాక్సుల ను కేటాయిస్తున్నారు. వెయ్యి ఓట్లు కంటే అధికంగా ఉన్న కేంద్రానికి రెండు పెద్ద బాక్సులు, వెయ్యి లోపు ఓట్లు, ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండే కేంద్రానికి ఒక పెద్దది, మధ్య తరహా బాక్సులు, అంతకంటే తక్కువ ఓట్లు ఉన్న స్థానాల్లో చిన్న బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక పెద్ద బాక్సులో 1200 నుంచి 1400 వరకు ఓట్లు వేసే అవకాశముంటుంది. ఈ ఎన్నికలకు మొత్తంగా 2300 పెద్దవి, 1800 మధ్యతరహావి, 1200 చిన్న బాక్సులను అందుబాటులో ఉంచారు. వాటన్నింటినీ ఇప్పటికే పరిశీలించి భద్రపరిచారు. వీటితో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా దాదాపుగా తుది దశకు చేరుకుంది. జెడ్పీటీసీలకు సంబంధించిన తెల్ల రంగులోను, ఎంపీటీసీలవి గులాబీ రంగులోను ముద్రించారు. అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షర క్రమం అనుసరించి గుర్తులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ మండల కేంద్రాల్లో మంగళవారం నిశితంగా పరిశీలించారు. వాటితోపాటు బ్యాలెట్లపై ఉన్న సీరియల్ నంబర్లను సైతం పరిశీలించారు. సవ్యంగా లేని బ్యాలెట్ పత్రాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 16,50,329 మంది ఓటర్లు ఉండగా ఒక్కొక్కరు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి రెండేసి ఓట్లు వేయనున్నారు. దీని ప్రకారం బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 10 శాతం రిజర్వ్‌తో పాటు దాదాపుగా 36.5 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఎన్నికలు ఈ నెల 6,11 తేదీల్లో జరగనున్నాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను మండల కేంద్రాలకు. అక్కడే మే 7వ తేదీ తరువాత లెక్కింపును చేపట్టనున్నారు.