ఆర్టీసీలో కానరాని ఫస్ట్ ఎయిడ్
ఆర్టీసీలో కానరాని ఫస్ట్ ఎయిడ్
Published Wed, Nov 2 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స లేనట్లే!
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
రాయవరం : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. ఇలా ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తోంది. బస్సు ప్రమాదానికి గురైతే అప్పటికప్పుడు తాత్కాలిక వైద్య సేవలు పొందేందుకు ప్రతి ఆర్టీసీ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ప్రస్తుతం అటువంటివి బస్సుల్లో కానవరావడం లేదు. బస్సు షడన్ బ్రెక్ వేసినప్పుడు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలపాలైతే వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందే.
3.23 లక్షల కిలోమీటర్ల ప్రయాణం
జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, తుని, గోకవరంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 840 బస్సులు వివిధ మార్గాల్లో ప్రతి రోజు 3.23 లక్షల కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆర్టీసీలో ఉద్యోగంలో చేరే కొత్త డ్రైవర్లకు, కండక్టర్లకు తొలుత ఫస్ట్ ఎయిడ్ ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాలిస్తారు. ప్రయాణికులు గాయపడితే.. వారికి అత్యవసర చికిత్స చేసే సామర్థ్యం సంబంధిత బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఉంటుంది. కాని ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురై ప్రయాణికులకు గాయాలైతే 108 వాహనం వచ్చే వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకు క్షతగాత్రులు నొప్పితో బాధపడాల్సిందే. ప్రథమ చికిత్స అందక పోవడం వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాప్రాయం కూడా కలుగుతుంది.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో...
ఫస్ట్ ఎయిడ్ బాక్సులో రెండు బ్యాండేజ్ కట్టలు, టించర్ అయోడిన్, గ్లాస్ బ్యాండేజ్, నొప్పి తగ్గించే ఆయింట్‌మెంట్, అత్యవసర మందులు ఉంటాయి.
పట్టించుకోని అధికారులు..
బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ల్లో మందులను ఏర్పాటు చేయక పోతే బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీవో స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ బస్సులేనన్న భావనతో సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి.
Advertisement